గత ఏడాదికంటే పది శాతం సాగు పెరగొచ్చని అంచనా
విత్తనాలు, ఎరువుల కొరత ఉండకుండా పక్కా ప్రణాళిక
నల్లగొండ అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి సమస్యలూ ఎదురుకాకుండా జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసింది. జూన్ మొదటి వారంలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలను అందించేందకు పక్కా ప్రణాళికలను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5లక్షల 21 వేల 256 హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. అందులో పత్తి అత్యధికంగా 3లక్షల హెక్టార్లు కాగా వరి సుమారు లక్షా 90 వేల హెక్టార్లు సాగు చేశారు. అయితే ప్రస్తుత రాబోయే ఖరీఫ్‌లో 6లక్షల 30 వేల హెక్టార్లు వివిధ పంటల సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది.
అందులో పత్తి 3లక్షల 40 వేల, వరి 2 లక్షల హెక్టార్లుతోపాటు వేరుశనగ, పెసర, కంది ఇతర పంటలు సాగుకానున్నట్లు అంచనాలు వేసింది. దీనికి అవసరమైన విత్తనాలు, ఎరువుల సమస్యలు తలెత్తకుంగా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతుంది. సీజన్ ప్రారంభానికి ముందే వరి, పత్తి, వేరుశనగ, కంది, పెసర విత్తనాలను సిద్ధంగా ఉంచడానికి చర్యలు చేపట్టింది. అదే విధంగా గతంలో ఏర్పడిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎరువులను సిద్ధంగా ఉంచడానికి వ్యవసాయ శాఖ ఉపక్రమించింది. ముఖ్యంగా యూరియా కొరతను అధిగమించడానికి జిల్లా వ్యవసాయ శాఖ వద్ద 30 వేల మెట్రిక్‌టన్నుల యూరియాను బఫర్‌గా ఉంచుకోనుంది. ఇప్పటికే సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్‌గా నిల్వ ఉంది.
పత్తి విత్తనాలు ఇలా..
గత ఖరీఫ్‌లో జిల్లాకు 12 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్‌లను అందుబాటులో ఉంచగా ఈ ఖరీఫ్‌కు 17 లక్షల పత్తి ప్యాకెట్‌లను అవసరంగా గుర్తించి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అదే విధంగా 49 వేల 750 క్వింటాళ్ల వరి విత్తనాలను, 2700 క్వింటాళ్ల కంది, పెసర విత్తనాలు, 8000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సిద్ధంగా ఉంచనున్నారు.
పంటరుణం
గతఖరీఫ్‌లో రూ.1226 కోట్ల పంటరుణం లక్ష్యంగా నిర్ణయించగా ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.1400.24 కోట్లు అందించాలని లక్ష్యంగా జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.
మట్టి నమూనాల సేకరణ
ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాలలో మూడోవంతు గ్రామాలలో మట్టినమూనాలను సేకరించి భూసార పరీక్షలను నిర్వహించనున్నారు. సుమారు 37వేల మట్టినమూనాలను సేకరించి పరీక్షలను నిర్వహిస్తారు. భూసార పరీక్షల తరువాత ఆయా భూములలో రైతులు ఎలాంటి ఎరువులు వాడాలో సూచిస్తూ రైతులకు కార్డులను జారీ చేయనున్నారు. దీని ద్వారా రైతులు ఇబ్బడిముబ్బడిగా ఎరువుల వాడకాన్ని నిరోధించడం ద్వారా ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నది లక్ష్యం.
నకిలీలపై ఉక్కుపాదం : బి.నర్సింహారావు, జేడీఏ
ఖరీఫ్‌లో జిల్లాలో నకిలీపత్తి విత్తనాలను విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపనున్నాం. నకిలీపత్తి విత్తనాల విక్రయదారులపై పోలీస్, విజిలెన్స్, వ్యవసాయ శృఖ బందాలు ప్రత్యేక నిఘా ఉంచుతాయి. గతంలో ఎక్కడ నకిలీపత్తి విత్తనాలు విక్రయించారో ఆయా వివరాలను ముందస్తుగా పోలీసులకు ఇచ్చి నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నకిలీ విత్తనాలపై అనుమానం ఉంటే తమకు సమాచారం అందించాలలి. అవసరమైతే పీడీయాక్టును ప్రయోగించడానికి వెనుకాడం. ఖరీఫ్‌లో రైతులకు ఎలాంటి సమస్యలూ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
ఖరీఫ్..సన్నద్ధం
Published Thu, Apr 23 2015 12:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement