అడ్డాకుల మండల పరిషత్ కార్యాలయం
సాక్షి, అడ్డాకుల: పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 3న ఎంపీపీల పదవీ కాలం ముగియనున్నందున ఆ లోపు ఎన్నికలు పూర్తయితే కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టే విధంగా సర్కారు ఎన్నికలకు అంతా సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే నెల 27న ముగియనుంది. రాష్ట్రంలో ఈనెల 11న మొదట విడతలోనే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వాహణపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం జిల్లా, మండల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ స్థానిక ఎన్నికల వేడి రగులుకుంటోంది.
ఆశావహుల ‘ప్రచారం’..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సమీపించడంతో పోటీలో నిలవాలనుకున్న ఆశావహులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తలమునకలవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ముగియగానే తమ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరందుకోవడంతో తాజాగా గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రిజర్వేషన్ అనుకూలించే నేతలు అందరినీ కలుపుకుపోవడానికి సమాయత్తం అవుతున్నారు. వలస ఓటర్లపై కూడా మెల్లగా దృష్టి సారిస్తున్నారు.
ఇప్పటికే వలస ఓటర్లు రెండు సార్లు గ్రామాలకు వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. ఒకసారి ఎమ్మెల్యే మరోసారి సర్పంచ్ ఎన్నికలకు వచ్చి ఓట్లు వేశారు. తాజాగా మరో రెండు ఎన్నికలు రావడంతో వలస ఓటర్లను గ్రామాల నేతలు మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఎలాగైనా వచ్చే రెండు ఎన్నికలకు వచ్చి వలస ఓటర్లు ఓట్లు వేసి పోయే విధంగా ఆశావహులు ఫోన్లు చేస్తున్నారు.
జెడ్పీటీసీపై నేతల గురి..
అడ్డాకుల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఈసారి జనరల్‌కు రిజర్వు చేశారు. దీంతో చాలా మంది మండల ముఖ్య నేతలు జెడ్పీటీసీపై గురి పెట్టారు. జెడ్పీ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఇక్కడ జెడ్పీటీసీగా విజయం సాధిస్తే అదృష్టం వరించి జెడ్పీ చైర్మన్ కావొచ్చన్న ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్ నుంచి పార్టీ మండల అధ్యక్షుడు డి.నాగార్జున్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు పొన్నకల్ మహిమూద్, సింగిల్‌విండో అధ్యక్షుడు ఎం.జితేందర్‌రెడ్డి, పెద్దమునుగల్‌ఛేడ్ సర్పంచ్ భర్త రాజశేఖర్‌రెడ్డి, అడ్డాకుల తిరుపతిరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, బలీదుపల్లి వేణుయాదవ్‌తో పాటు మరి కొందరు తెలంగాణ ఉద్యమ నేతలు కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు.
కాంగ్రెస్, బీజేపీలు సిద్ధం..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీని ఎదుర్కొవడానికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో రెండు పార్టీలు తలమునకలయ్యాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ఆ పార్టీ కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ముగ్గురు నేతలు జెడ్పీటీసీ స్థానంపై గురి పెట్టినా పక్క మండలానికి చెందిన ఓ నియోజకవర్గ నేతను ఇక్కడి నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment