నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు షరా మామూలు అనిపించాయి. 53శాతం ఉత్తీర్ణతతో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం కూడా 52శాతంతో 14వ స్థానాన్నే దక్కించుకుంది. ఈ ఏడాది మొత్తం జిల్లాలో 36,208మంది విద్యార్థులు హాజరుకాగా 19363మంది (53శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 17,427 హాజరుకాగా 10283 మంది (59శాతం) ఉత్తీర్ణత సాధించగా, బాలురు 18781మంది హాజరుకాగా 9080 మంది (48 శాతం) ఉత్తీర్ణత సాధించారు. కాగా ఒకేషనల్ విభాగంలో 4541 మంది పరీక్షలు రాయగా 2807 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 2190కి గాను 1489 మంది (68 శాతం), బాలురు 2351కి గాను 1318 (56 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ కాలేజీల్లో 70 శాతం ఉత్తీర్ణత...
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల ఫలితాల శాతం ఈ సంవత్సరం కూడా మెరుగ్గా ఉంది. మొత్తం 29 కాలేజీల్లో 4765మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగాా 3330 మంది (69.88 శాతం) ఉత్తీర్ణత సాధించారు. నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు 98.44 శాతం ఉత్తీర్ణతతో జిల్లా ప్రథమస్థానంలో నిలిచారు. గత సంవత్సరం జిల్లాలో మొదటిస్థానం పొందిన యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈసారి 93.61 శాతం ఫలితాలతో 2వ స్థానానికి పరిమితమయ్యారు. మోత్కూరు 92.86శాతం, నడిగూడెం 92.36 శాతం, నెమ్మికల్ 92.26 శాతం, నారాయణపూర్ విద్యార్థులు 91.95 శాతం ఫలితాలు సాధించారు. 26.24 శాతం ఉత్తీర్ణతతో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు చివరి స్థానంలో నిలిచారు. ఇక్కడ 202 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా కేవలం 53 మంది ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం కూడా ఈ కాలేజీ 23.74 శాతం ఫలితాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది.
జిల్లా టాపర్లు...
ఎంపీసీ విభాగంలో నల్లగొండలోని ప్రగతి జూనియర్ కాలేజీ విద్యార్థిని ఎస్.వైష్టవి వెయ్యి మార్కులకు 987 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం సాధించింది. బైపీసీ విభాగంలో స్థానిక లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ విద్యార్థిని బోడ శ్రీతేజ 987 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. అదే కాలేజీకి చెందిన ఎంఈసీ విద్యార్థిని విగ్రహాల శ్రావణి 969 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం పొందింది. హాలియాలోని సృజనా కళాశాల విద్యార్థి కుర్ర నాగార్జున సీఈసీ విభాగంలో 935 మార్కులు సాధించాడు.
ఒకేషనల్‌లో..
ఒకేషనల్‌లో ఎంపీహెచ్‌డబ్ల్యూ విభాగంలో నల్లగొండలోని లిటిల్‌ఫ్లవర్ జూనియర్ కళాశాల విద్యార్థిని పరంగి మౌనిక 964 మార్కులతో జిల్లా ప్రథమస్థానం సాధించింది. దేవరకొండ ఒకేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన ఎన్.భాగ్యకు ఎంఎల్‌టీలో 933 మార్కులు వచ్చాయి. డెయిరీ గ్రూపులో ఎం.నీలిమ 924 మార్కులు, ఎలక్ట్రికల్ గ్రూపులో కె.బాల్‌సింగ్ 901 మార్కులు సాధించారు.
కార్డియాలజిస్టునవుతా : శ్రీతేజ
ఇంటర్‌లో ప్రథమ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. ఎంసెట్‌లో కూడా మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్టునవుతా. పేదలకు సేవ చేస్తా. డాక్టర్‌గా సేవలందించాలనే ఉద్దేశంతోనే బైపీసీ గ్రూపును ఎంపిక చేసుకున్నా.
ఐఐటీ సాధిస్తా : ఎస్.వైష్ణవి
నాన్న లారీడ్రైవర్, అమ్మ ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ నన్ను కష్టపడి చదివించారు. ఎంపీసీలో టాపర్‌గా నిలవడం సంతోషం కలిగించింది. ఐఐటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మంచి ఇంజినీర్‌గా సేవలందిస్తాను.
సీఏ చేస్తా : శ్రావణి
ఎంఈసీలో జిల్లా ప్రథమ స్థానం దక్కడం ఆనందం కలిగిస్తోంది. భవిష్యత్‌లో సీఏ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అధ్యాపకులు అందించిన ప్రోత్సాహం వల్లే జిల్లా ప్రథమ, రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించగలిగాను.
మళ్లీ 14వ స్థానమే!
Published Sun, May 4 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement