యంత్రాల సబ్సిడీలో భారీ అవినీతి | Agriculture products not getting support price: Bhatti vikramarka | Sakshi
Sakshi News home page

యంత్రాల సబ్సిడీలో భారీ అవినీతి

Published Tue, Mar 21 2017 1:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

యంత్రాల సబ్సిడీలో భారీ అవినీతి - Sakshi

యంత్రాల సబ్సిడీలో భారీ అవినీతి

శాసనసభలో భట్టి విక్రమార్క ఆరోపణ
ట్రాక్టర్ల కొనుగోలులో గోల్‌మాల్‌పై విచారణ జరపాలని డిమాండ్‌
నకిలీ విత్తనాల అంశంలో తీసుకున్న చర్యలేమిటని నిలదీత
రాష్ట్రంలో 12 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్య
భట్టి విమర్శలపై మంత్రులు ఈటల, హరీశ్‌రావు ఫైర్‌


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్ల సబ్సిడీలో భారీగా అక్రమాలు జరిగాయని శాసనసభలో కాంగ్రెస్‌ సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క ఆరోపించా రు. అర్హులైన రైతులకు ఇవ్వకుండా పక్కదారి పట్టించారని, దీనిలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ జరుగుతోందని విమర్శించారు. ముఖ్యంగా ట్రాక్టర్ల కొనుగోలు, సబ్సిడీపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం అసెంబ్లీలో పలు పద్దులపై జరిగిన చర్చలో భట్టి మాట్లాడారు. వ్యవ సాయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని విరుచుకుపడ్డారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో నకిలీ మిరప, మొక్కజొన్న, పత్తి విత్తనాలు వెలుగు చూశాయని.. నకిలీ విత్తన సంస్థలకు లైసెన్సులు జారీచేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. రాష్ట్రం నకిలీ విత్తన భాండాగారంగా మారిందని, నకిలీ విత్తన కంపెనీ యజమానులపై పీడీ యాక్టు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇటీవలి వడగళ్ల వానలకు రైతులు నష్టపోయినా వ్యవసాయశాఖ స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్రంలో 12 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.

లిక్కర్‌ మాల్స్‌కు అనుమతా..?
సమస్యలపై నిలదీస్తే ప్రభుత్వం అడ్డగోలుగా, అహంకారంతో సమాధానమిస్తోందని భట్టి మండిపడ్డారు. బంగారు తెలంగాణలో లిక్కర్‌ మాల్స్‌ ఇస్తున్నామంటున్నారని.. ఇదెంత వరకు సబబో పరిశీలించాలని పేర్కొన్నారు. మైక్రో బేవరేజెస్‌ వల్ల హైదరాబాద్‌లో యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వసూళ్లు చేయలేక కొద్ది నెలల్లోనే ఆరుగురు ఎస్సైలు ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించారు. నీటిపారు దల శాఖ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వద్దకు వెళితే అధికార పెద్దలు ఆయనపై కేసులు పెట్టారని ఆరోపించారు. అయితే ఈ అంశంలో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకున్నారు.

సుదర్శన్‌రెడ్డి ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తానని పట్టుబట్టారని.. ఆయనకు ఏ హోదా ఉందని స్థానిక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిలదీస్తే వారిపై దాడి చేయించారన్నారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై భట్టి మండిపడ్డారు. హరీశ్‌ సభను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక భట్టి విమర్శలపై మంత్రి ఈటల కూడా జోక్యం చేసుకున్నారు. 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని భట్టి మాట్లాడటం సరికాదని, ఎస్‌ఆర్‌ఎస్పీ ద్వారా చివరి ఆయకట్టు రైతుకూ నీరిచ్చామని పేర్కొన్నారు.

దీంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి లేచి.. ‘‘నల్లగొండ జిల్లాకు ఎస్‌ఆర్‌ఎస్పీ ద్వారా నీరిచ్చామంటున్నారు.. ఎప్పుడు ఇచ్చారో చెప్పాలి. వాస్తవంగా ఎస్‌ఆర్‌ఎస్పీ కింద 2.40 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. కాలువ చివరి భూములకు నీరిచ్చారా?’’అని నిలదీశారు. దీనిపై హరీశ్‌ జోక్యం చేసుకుం టూ.. ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశలో 350 చెరువులను నింపామని, 25 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చామని చెప్పారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఏది?: చింతల
కేంద్రం విడుదల చేసిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.791 కోట్లను రైతులకు పూర్తిగా అందజేయలేదేమని బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి నిలదీశారు. ఈసారి వ్యవసాయ బడ్జెట్‌ తగ్గించారని.. పరిశ్రమలు, ఐటీని ప్రోత్సహించినట్లే వ్యవసాయాన్నీ ప్రోత్సహించాలని టీడీపీ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. ట్రాక్టర్ల స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని ప్రతి రైతుకు రెండు ఎద్దుల చొప్పున పంపిణీ చేయాలని సూచించారు. బీసీలకూ పారిశ్రామిక విధానం తీసుకురావాలని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement