
కేటీఆర్‌తో మహీంద్రా ప్రతినిధుల భేటీ
ఐటీ, మోటార్స్ రంగాల్లో కంపెనీలను
విస్తరిస్తామన్న ప్రతినిధులు
హైదరాబాద్: మహీంద్రా గ్రూప్‌కు చెందిన 6 కంపెనీల ప్రతినిధులు గురువారం పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో భేటీ అయ్యారు. గురువారం సచివాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ కంపెనీల విస్తరణకు సంబంధించి భేటీలో చర్చించారు.
హైదరాబాద్‌లో చెత్త సేకరణకు జీహెచ్‌ఎంసీకి అవసరమైన వాహనాలను త్వరలో అందిస్తామన్నారు. మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికుల కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై తమ ప్రణాళికలు వివరించారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న మహీంద్రా ప్లాంట్‌లో స్థానిక యువతకు ఉద్యోగాలను ఇస్తామన్నారు. కాగా, ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి మహీంద్రా కంపెనీ నుంచి తగు ప్రణాళికలు ఇవ్వాలని కేటీఆర్ ప్రతినిధులను కోరారు. అలాగే ఎరోస్పేస్, రక్షణ రంగాల్లో విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.