ఆదాయమే లక్ష్యంగా ‘ఆర్థిక మండలి’
- ఐదు ప్రధాన విధులతో
- సీఎం అధ్యక్షతన ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: అంతర్గతంగా ఆదాయ వనరుల పెంపు, పెట్టుబడుల ఆకర్షణ, సింగపూర్ కంపెనీలకు కొత్త రాజధాని నిర్మాణ మాస్టర్ డెవలపర్ బాధ్యతలను కట్టపెట్టడమే లక్ష్యంగా ఆర్థికాభివృద్ధి మండలిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మండలికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. మండలి కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్నే తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికంటే ముందు కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా ప్రాథమిక ఏర్పాట్లను ముమ్మరం చేయనుంది.
ఆర్థికాభివృద్ధి మండలి ప్రధానంగా ఐదు విధులను నిర్వహించనుంది. అందులో భాగంగా ఆదాయ వనరుల సమీకరణతో పాటు నిధి నిర్వహణ సెల్, ప్రాజెక్టు మదింపు సెల్, స్పెషల్ పర్పస్ వెహికల్ సెల్, పెట్టుబడుల ప్రోత్సాహకం-ప్రాజెక్టు కోఆర్డినేషన్ సెల్, వ్యూహాత్మక ప్రణాళిక, విధాన ఆలోచన సెల్ ఉన్నాయి. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థలకు కట్టపెట్టడం వంటి వాటిపైనా ఆర్థికాభివృద్ధి మండలి నిర్ణయం తీసుకుంటుంది.
ఆదాయ వనరు ల సమీకరణ సెల్ ప్రధానంగా అంతర్గత ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా పన్నుల స్థాయి పెంపు, పన్ను రేట్లు పెంపు, యూజర్ చార్జీల వసూలు చేసే మార్గాల గుర్తింపుతో పాటు.. ఆ చార్జీల పెంపు మార్గాలను గుర్తించనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయం రాబట్టే మార్గాలను గుర్తించనుంది.
నిధుల సమీకరణపై మండలి దృష్టి..
ప్రత్యేక రాష్ట్ర హోదా, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలపైనా, విదేశీ సంస్థల నుంచి రుణాల సేకరణపైనా ఆర్థికాభివృద్ధి మండలి దృష్టి పెడుతుంది. నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సేవలు, రాజధాని నగరం, స్మార్ట్ సిటీ, పారిశ్రామిక కారిడార్లకు స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయ, అప్పులను అధ్యయనం చేయడంతో పాటు ఆయా సంస్థల ఆస్తులను విలువ కట్టి, వాటిని తాకట్టు పెట్టి నిధుల సమీకరణను కూడా ఆర్థికాభివృద్ధి మండలి చేయనుంది. రోడ్లు, నీరు, విద్యుత్, ఫైబర్, గ్యాస్ గ్రిడ్లను ఆ మండలి సమన్వయం చేస్తుంది. ప్రైవేట్ రంగం పెట్టుబడుల ద్వారా ఆర్థిక ప్రగతి సాధించడంపైనా మండలి ప్రధాన దృష్టి సారించనుంది. దీర్ఘకాలిక అభివృద్ధిలో భాగంగా వాణిజ్య పరంగా పోటీ పెంచేందుకు సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్‌ప్రైజెస్‌ను కన్సల్టెంట్‌గా నియమించనున్నారు.
పాత చట్టమే కొత్తగా..
పదిహేనేళ్ల క్రితం చంద్రబాబు పాలనలో తీసుకొచ్చిన ఇలాంటి చట్టంలోని పలు అంశాలపై పౌరసంఘాలు, ప్రజా సంస్థల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇపుడు ఆ చట్టాన్ని మొత్తంగా తెరపైకి తేకుండా.. కొన్ని అంశాల్ని మళ్లీ అమల్లోకి తీసుకురానున్నారు. 2001లో ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ చట్టం లోని కొన్ని కీలకాంశాల్ని యథాతథంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి చట్టంలోకి తీసుకురావాలని ప్రభుత్వ నిర్ణయించింది.
2001 చట్టంలోని సెక్షన్ 19లో రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీగానీ, స్థానిక అథారిటీగానీ డవలపర్ ఎంపికను నేరుగాగానీ, సంప్రదింపుల ద్వారాగానీ లేదా స్విస్ చాలెంజ్ విధానంలోగానీ, పోటీ విధానంలోగానీ చేయవచ్చునని ఉంది. ఇపుడు ఆ సెక్షన్‌తో పాటు అవసరమైన మరిన్ని సెక్షన్లను తీసుకుని కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ మండలి చట్టం తీసుకురానున్నారు. ఇలా మాస్టర్ డవలపర్ బాధ్యతను సింగపూర్ కంపెనీలకు అప్పగించాలని సీఎం భావిస్తున్నారు. ముసాయిదా రూపకల్పనకు 21 మంది నిపుణులను నియమించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీ గడువుతో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆర్థిక శాఖ ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసింది.