
ఎయిర్ హోస్టెస్ హత్య?
- అనుమానంతో భర్త వేధింపులు
- ఇటీవలే ఉద్యోగం
- మాన్పించిన వైనం
- తల్లిదండ్రులు సర్దిచెప్పి వెళ్లిన కొద్ది గంటలకే విషాదం
హైదరాబాద్: ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన ఓ మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. మనస్పర్థలు రావడంతో భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బాధితురాలి తల్లిదండ్రులు సముదాయించి వెళ్లిన కొద్ది గంటలకే ఈ ఘోరం చోటు చేసుకుంది.
ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ ఆటోనగర్‌కు చెందిన రీతు(26) ఆరేళ్ల నుంచి జెట్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. ఉప్పల్‌కు చెందిన సచిన్ (28)తో రీతుకు 2013 నవంబర్‌లో వివాహమైంది. పెళై్లన రెండు నెలల తర్వాత నుంచి అత్తమామలు, భర్త అదనపు కట్నం కోసం రీతును శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. ఆమెను ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం కూడా మాన్పించారు.
కాగా, గత ఏడాది నవంబర్‌లో రీతు పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయినా సచిన్‌లో మార్పు రాలేదు. బాబు తనకు పుట్టలేదని మరింతగా ఆమెను వేధించేవాడు. దీంతో సచిన్ వేధింపుల గురించి రీతు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆదివారం ఉదయం రామంతాపూర్‌లోని సచిన్ ఇంటికి వచ్చి సముదాయించి సాయంత్రం వెళ్లిపోయారు. వీరు వెళ్లిన తర్వాత రాత్రి 11.30కి సచిన్ రీతు తండ్రికి ఫోన్ చేసి ఆమె ఆరోగ్యం సీరియస్‌గా ఉందని రావాలని కోరడంతో అర్ధరాత్రి వారు ఇంటికి చేరుకున్నారు. కంటి పైభాగంలో గాయంతో బెడ్‌రూంలో పడి ఉన్న రీతును చికిత్స నిమిత్తం వారు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు.
పెళ్లయిన 18 నెలలకే తమ కూతుర్ని పొట్టనబెట్టుకున్నాడని సచిన్‌పై రీతు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హత్య, వరకట్న వేధింపుల కింద ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతురాలి భర్త సచిన్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
మద్యం వద్దన్నందుకేనా..
రీతు తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత సచిన్‌తన స్నేహితులతో కలసి రాత్రి 8 గంటలకు ఇంట్లో మద్యం సేవించినట్టు తెలిసింది. ఇంట్లో మద్యం సేవించడంపై రీతు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్టు తెలుస్తోంది. దీంతో మద్యం మత్తులో ఉన్న సచిన్ బీరు సీసాతో రీతు తలపై బలంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భయపడ్డ సచిన్ స్నేహితులు, అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ సహకారంతో రామంతాపూర్‌లోని మాట్రిక్ అస్పత్రికి ఆమెను తరలించారు. అయితే అప్పటికే రీతు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఏమీ ఎరగనట్టుగా రీతు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి బెడ్‌రూంలో పడేసినట్లు తెలిసింది.
భర్తే పొట్టన పెట్టుకున్నాడు: రీతు సోదరి
పెళై్లన నాటి నుంచి రీతును సచిన్ వేధింపులకు గురిచేసేవాడని, అనునిత్యం ఆమెను అనుమానించేవాడని రీతు సోదరి తులిక పేర్కొంది. భర్తే తన సోదరిని పొట్టన పెట్టుకున్నాడని ఆరోపించింది.