రీతూను చంపింది భర్తే | Air hostess murder case: Ritu's husband in judicial remand | Sakshi
Sakshi News home page

రీతూను చంపింది భర్తే

Published Fri, Apr 24 2015 1:53 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

రీతూను చంపింది భర్తే - Sakshi

రీతూను చంపింది భర్తే

వీడిన మాజీ ఎయిర్ హోస్టెస్ హత్య కేసు మిస్టరీ
నేరాన్ని అంగీకరించిన ఆమె భర్త సచిన్

 
హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్ పరిధి ఇందిరానగర్‌కు చెందిన మాజీ ఎయిర్ హోస్టెస్ రీతూను ఆమె భర్తే అంత మొందించాడు. ఆమె ముఖంపై దిండుతో అదిమి ప్రాణాలు తీసినట్లు రీతూ భర్త సచిన్ ఉప్పల్ నేరాన్ని అంగీకరించాడు.  కేసు వివరాలను గురువారం  ఉప్పల్ ఏసీపీ కార్యాలయంలో మల్కాజిగిరి ఏసీపీ  రవిచందన్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. రీతూ ఈ నెల 19 న  హత్యకు గురైన సంగతి విదితమే. భార్య మీద అనుమానంతో పాటు తనను స్నేహితుని ముందు అవమానించిందన్న ఆగ్రహంతో ఆమెను భర్తే అంతమొందించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
 
 మద్యం తాగి..స్నేహితునితో వచ్చి..
 ఈ నెల 19వ తేదీ రాత్రి సచిన్ తన స్నేహితుడు కోటగిరి రాకేశ్‌తో కలిసి హిమాయత్ నగర్‌లోని ఓ బార్‌లో మద్యం తాగాక 10.30 గంటల సమయంలో అతన్ని తీసుకొని తమ ప్లాట్‌కు వచ్చాడు. అలా రావడాన్ని భార్య రీతూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని పట్టించుకోని సచిన్ ఆమె టీవి చూస్తుండగా రిమోట్ తీసుకొని స్నేహితునితో కలిసి చూసేందుకని క్రికెట్ మ్యాచ్ పెట్టాడు. ఇది వారి మధ్య తొలుత వాగ్వాదానికి దారి తీసింది. అంతే కాకుండా తనకూ, తన స్నేహితునికీ ఇంట్లో ఉన్న బిర్యానీ వడ్డించమని కోరాడు. రీతూ అంగీకరించక పోవడంతో అవమానంగా భావించి స్నేహితుని సమక్షంలోనే ఆమెపై చేయి చేసుకున్నాడు. దాన్ని అడ్డుకునేందుకు రాకేశ్ ప్రయత్నించడంతో అతన్ని ఇంట్లోనుంచి బయటకు గెంటి తలుపు వేసేశాడు. అనంతరం రీతూను మంచంపైకి నెట్టి ఆమె ముఖంపై దిండుతో అదిమి హతమార్చాడు.
 
ఈ సంఘటనను దాచి ఉంచి భార్య తల్లితండ్రులకు సచిన్ ఫోన్‌చేసి రీతూ ఆరోగ్యస్థితి సీరియస్‌గా ఉందని తెలియజేశాడు. వారు అక్కడికి చేరువలోనే ఉన్న తమ మరో కుమార్తె ఇంటివద్ద ఉంటున్నారు. వారు వెంటనే వచ్చి చూసేసరికి రీతూ మంచంపై మరణించి ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అదే రోజు నిందితుడ్ని కస్టడీలోకి తీసుకొని విచారించడంతో కేసు గుట్టు వీడింది. ఈ మేరకు పోలీసులు గురువారం సచిన్ ఉప్పల్‌ను రిమాండ్‌కు తరలించారు. నిందితులుగా ఉన్న అతని తండ్రి రమేష్ ఉప్పల్, తల్లి సీమా ఉప్పల్, సోదరి నితిన్ ఉప్పల్‌పై కూడా  కేసు నమోదు చేశారు. వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  సచిన్, అతని స్నేహితుడు రాకేశ్‌లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాకేశ్‌ను కూడా అరెస్టు చేశారు. కాగా తమ కుమార్తె మరణానికి కారకుడైన సచిన్‌కు ఉరిశిక్ష వేస్తేనే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని రీతూ తల్లిదండ్రులు తెలిపారు.కాగా సచిన్ దంపతుల ఆరునెలల కొడుకు తల్లి మంచంపై ఆడుకుంటున్న సమయంలోనే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి పలువురు కదిలిపోయారు.
 
 రీ పోస్టుమార్టం నిర్వహించాం: ఏసీపీ
 రీతూ హత్య కేసులో  రెండో అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రీ-పోస్టుమార్టం కూడా జరిపించామని ఏసీపీ రవిచందన్‌రెడ్డి తెలిపారు. కాగా సచిన్‌కు కొడుకు విషయంలో భార్యపై అనుమానం ఉండేదనీ దీనికోసం డీఎన్‌ఏ పరీక్ష కోసం ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడని కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఈ విషయమై తమ వద్ద స్పష్టమైన సమాచారం లేదనీ ఈ కోణంలోనూ విచారణ చేపడతామని వెల్లడించారు. రీతు హత్య కేసులో వెంటనే స్పందించిన ఉప్పల్  ఇన్స్‌పెక్టర్ నర్సింహారెడ్డి, పోలీస్ సిబ్బందికి తగిన పారితోషికం అందచేయనున్నట్లు ఏసీపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement