సర్వం సిద్ధం
సర్వం సిద్ధం
Published Tue, Mar 28 2017 3:01 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
► ఉమ్మడి జిల్లాలో 74 కేంద్రాలు
► హాజరుకానున్న 49,000 మంది ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు
► తొలిసారి ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం వార్షిక పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి జిల్లాలో 74 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 49 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం విధానంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కోదాడ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర వార్షిక పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో అధికారులు, కళాశాలల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటిసారి ఆన్‌లైన్ విధానంలో ప్రశ్నపత్రాలను ప్రవేశ పెడుతున్నందున ఇటు అధికారులతోపాటు, అటు పరీక్ష కేంద్రాల నిర్వాహకుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈమేరకు చీఫ్ సూపరింటెండెంట్‌లకు శనివారం అవగాహన కల్పించారు. తొలి పరీక్ష రోజు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని అధిగమించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
సెంటర్లెక్కువ.. విద్యార్థులు తక్కువ
ఆన్‌లైన్ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 49వేల మంది హాజరుకానున్నారు. ప్రతి కేంద్రంలో 300 మందికి మించకుండా పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేయడం, ప్రింట్‌అవుట్స్ తీయడం సమస్య ఉండదని అధికారులు అంటున్నారు. తెలుగు, ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలు ఒకటి రెండు పేజీలు మాత్రమే ఉంటున్నందున పెద్ద ఇబ్బంది ఉండదని, కామర్స్ మాత్రం ఐదారు పేజీలు ఉండే అవకాశం ఉన్నందున కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని దానిని అధిగమించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు నిర్వాహకులకు సూచిస్తున్నారు.
8.45 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం.. 9 గంటలకు పరీక్ష..
యూనివర్సిటీ అధికారులు ప్రతి పరీక్షకు 15 నిమిషాల ముందు ప్రశ్నపత్రాన్ని ఆన్‌లైన్‌లో ఉంచుతారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రతి సెంటర్‌కు ఒక పాస్‌వర్డ్ ఇస్తారు. అది తెలిసిన చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలో ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకొని విద్యార్థుల సంఖ్యమేరకు ప్రింటవుట్లు తీసి 9 గంటల వరకు పరీక్షను ప్రారంభించాలి. ఒక ప్రింటర్‌పై నిమిషానికి 20 నుంచి 25 వరకు ప్రింట్లు తీసే అవకాశం ఉన్నందున్న ఎక్కువ మంది విద్యార్థులున్న సెంటర్లలో రెండు ప్రింటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడంలో గానీ, ప్రింటవుట్లు తీసుకోవడంలోగానీ ఎమైనా ఇబ్బందులు ఎదురైతే ఐదు పది నిమిషాలు ఆలస్యంగానైనా పరీక్షను ప్రారంభించుకోవచ్చని, దానికి అనుగుణంగా చివరల్లో ఆ మేరకు అదనపు సమయాన్ని విద్యార్థులకు కేటాయించాలని అధికారులు చెప్పినట్లు సమాచారం.
కానీ వీలైనంతలో అనకున్న సమయానికి పరీక్షను ప్రారంభించడానికే కృషి చేయాలని, తప్పనిసరి, సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పడు మాత్రమే ఐదు పది నిమిసాలు ఆలస్యంగా ప్రారంభించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Advertisement
Advertisement