
అందరికీ ఇళ్లు
- గుజరాత్ స్ఫూర్తితో అమలుకు శ్రీకారం
- ఇళ్ల సంఖ్య, స్థల లభ్యతపై సర్వే చేపట్టాలని ఆదేశం
- త్వరగా నివేదిక ఇవ్వాలనిపురపాలక సంఘాలకు సూచన
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అందరికీ ఇళ్లు-2022 పథకం అమలు కసరత్తు వేగంగా సాగుతోంది. నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా సొంత ఇళ్లు లేని పేదలు, వారికి అవసరమైన ఇళ్ల సంఖ్య, భూముల లభ్యత వంటి అంశాలతో సమగ్ర నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు అందాయి.
త్వరగా ఈ నివేదికలు రూపొందించి పంపించాలని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి తెలంగాణలోని అన్ని నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల కమిషనర్లకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యూరుు. ఈ మేరకు జిల్లా అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఆయూ ప్రాంతంలో ఎన్ని కాలనీలు ఉన్నాయి ? ఏ స్థితిలో ఉన్నాయి ? ఎంతమందికి ఇళ్లు నిర్మించాల్సి ఉంటుందనే అంశాలపై సర్వే చేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయూలి.
పథకం ఉద్దేశం
దేశంలోని పేదలకు 2022లోపు సొంత ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపడుతోంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో చేపట్టిన ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకుని దీన్ని రూపొందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. దేశంలో సొంత ఇల్లు లేని వారి సంఖ్య కచ్చితంగా ఎంత ఉంటుందనేది తేల్చేందుకు కేంద్రం ప్రాథమికంగా సర్వే నిర్వహించింది. అల్పాదాయ, నిరుపేదల్లో 95 శాతం మందికి సొంతిళ్లు లేవని ఈ సర్వేలో తేలింది. సొంత ఇల్లు లేని వారి జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది.
ఇల్లులేని వారిని కేంద్రం నాలుగు కేటగిరీలు (మురికివాడల్లో నివసించే పేదలు, మురికివాడలు కాని ప్రాంతాల్లో నివసించేవారు, పూర్తిగా నిరాశ్రయులు, వలసకాలనీల్లో నివసిస్తున్నవారు)గా విభజించింది. ఈ నివాస ప్రాంతాల్లో కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థలాల్లో ఉండగా మరికొన్ని ప్రైవేట్ స్థలాల్లో ఉన్నాయి. కొన్ని అనుమతి లేని ప్రాంతాల్లో ఉన్నాయి. పేదలు ఇప్పుడు ఉన్న ప్రాంతాల్లోనే వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి. లేనిపక్షంలో కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. నగరాలు, పట్టణాల పాలక మండళ్లు పంపించే నివేదిక తర్వాత జాతీయ స్థాయిలో దీనిపై పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధం చేయనున్నారు.
తీరనున్న కష్టాలు
గ్రేటర్ వరంగల్ జనాభా 8.20 లక్షలు ఉండగా... ఇప్పటివరకు రాజీవ్ ఆవాస్ యోజన కింద కేవలం 576 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి పక్కా గృహాలు నిర్మిస్తున్నారు. రెండో విడతలో మీరా సాహేబ్‌కుంట, గాంధీనగర్ ఎంపికయ్యాయి. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. కానీ, అధికారిక లెక్కల ప్రకారమే నగరంలో 183 మురికివాడలుగా ఉండగా... ఇందులో 3.30 లక్షల మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. ఎంతమాత్రం నివాసయోగ్యం కాని చెరువు ముంపు ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో 31 కాలనీలు విస్తరించగా, ఇక్కడ లక్షలకు పైగా జనాభా నివసిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం అందుబాటులోకి వస్తే మురికివాడల్లో నివసించే ప్రజల కష్టాలు గట్టెక్కినట్లే.