
సభలో ఇక ‘ఐక్య’ పక్షం
- ఏకతాటిపై ఉండాలని విపక్షాల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో అధికార టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు కలసికట్టుగా ఉండాలని విపక్షాలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కకు పెట్టి ఐక్యతతో లేకుంటే కష్టమన్న భావనకు వచ్చిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు బుధవారం చర్చించుకున్నారు. ‘కేవలం ఈ ఒక్క సెషన్స్‌కు అని మాత్రమే కాదు. భవిష్యత్తు గురించి కూడా చర్చించుకున్నాం. ప్రభుత్వాన్ని నిలవరించాలంటే ప్రతిపక్ష పార్టీలు ఒక్కటిగా ఉండాల్సిన అవసరం ఉంది..’ అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి లాబీల్లో విలేకరులతో వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం నామమాత్రంగానే చర్చించినా, ఆ తర్వాత టీడీపీ సభ్యులనూ కలుపుకొని పూర్తిస్థాయిలో వ్యూహాన్ని ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కలసి విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక కిషన్‌రెడ్డి స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు.