‘సీఎం నటించటం నేర్పిస్తున్నారు’
Published Tue, Mar 28 2017 3:32 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
హైదరాబాద్: ప్రతిపక్షాలతోనే అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాయని.. పాలక పక్షం నియంతృత్వం పోకడలతో ఎదురుదాడి చేసిందని బీజేపీఎల్పీ నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేసినందుకు ప్రశ్నిస్తే రెండు రోజుల పాటు బీజేపీని, టీడీపీ సభ్యులను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. పైగా ప్రభుత్వం వల్లనే సమావేశాలు జరిగాయనడం విడ్డూరమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. ఎదురు దాడి చేస్తూ గోల, అరుపులు, పెడ బొబ్బలు చేసిన మంత్రుల వల్ల సమావేశాలు బాగా జరిగాయా అనేది ప్రభుత్వం చెప్పాలన్నారు. కృత్రిమ అంకెలు చూపించి, సత్యం రామలింగ రాజు చేసిన దానికి .. సీఎం చేసిన దానికి తేడా ఏమిటో చెప్పాలన్నారు.
అద్భుతమైన అప్పుల తెలంగాణ గా మార్చారని తెలిపారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థలు ఫీజులు పెంచుకోవడం కూడా సేవ చేయడమే అని సీఎం అనటం ఏమిటని ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఏమైంది. మానస పుత్రిక అన్నారు కదా.. దాని అర్ధం ఏమిటని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. సింగరేణి కార్మికులు అంతా ఆంధ్రా కార్మికులని సీఎం అన్నారని అని గుర్తు చేశారు. సింగరేణి లో ఉన్న తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తారా.. మీరు ఇచ్చిన మాట మీద నిలబడతారా అని సీఎంను నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులు అంటున్నారని ఆరోపించారు. మంత్రులు శాసన సభలో దండాలు పెట్టి నటిస్తున్నారు.. సీఎం గారు నటించడం నేర్పిస్తున్నట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల మీద మొత్తం గందరగోళమే.. ఇష్టా రాజ్యంగా బడ్జెట్ అంచనాలు పెంచి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. గురుకులాల విద్య పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే దౌర్భాగ్య స్థితి తెలంగాణలో ఉందని విమర్శించారు. అప్పుల మీద, కేంద్ర మీద భారం, మద్యం అమ్మకాల లాభం మీద మమకారం.. ఇదీ ప్రభుత్వం తీరని ఎండగట్టారు. చెట్టు మీద కూర్చుని విస్తర్లు కుట్టినట్టుగా ప్రభుత్వం తీరు ఉందని తెలిపారు. సమావేశాలు ముగిశాక.. బడ్జెట్ ఆమోదం పొందాక.. కాగ్ రిపోర్ట్ ఎందుకు.. సమావేశాల మొదటి రోజే ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. అప్పులు తెచ్చి రెవెన్యూలో చూపించిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కిందన్నారు. ముస్లింలను బీసీలలో కలపడం ద్వారా బీసీలకు మేలు చేస్తున్నారా.. లేక అన్యాయం చేస్తున్నారా చెప్పాలని కోరారు. బీజేపీ తరపున రాజకీయంగా, న్యాయ పరంగా చివరి వరకు పోరాటం చేసి ముస్లిం రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement