అరిగిపోయిన రికార్డులా మళ్లీ మళ్లీ అదే...
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ప్రసంగం అరిగిపోయిన రికార్డులా ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. 34 నెలలుగా ప్రజలను ఇంకా ఊహ లోకంలో విహరింప చేసే విధంగా ప్రసంగం ఉందన్నారు. వాపును చూసి బలుపు అనుకోవద్దని ఆయన సూచించారు. గతంలో చెప్పిన పనులు చెయ్యకుండా.. చేసినట్టు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిలో దీపం పెట్టినట్టు..ప్రసంగం ఉందని ఎద్దేవా చేశారు.
గత ప్రసంగంలో చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ చేత కాకిలెక్కలు చెప్పించిందని పేర్కొన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు ప్రగతి భవన్ దాటడం లేదని అన్నారు. మాటలు తియ్యగా, చేతలు చేదుగా ఉన్నాయని, కేజీ లేదు పీజీ లేదని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ ఎందుకు ఆగిపోయే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఎందుకు తరలిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.