
‘గొంతెత్తే హక్కు కోల్పోయేలా కనిపిస్తోంది’
కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తేస్తాం.. అవేవో నగర శివారు ప్రాంతాల్లో చేసుకొండి అంటే కుదరదు. ఈనెల 23న ఇందిరాపార్క్ వద్ద భారీ సదస్సు నిర్వహిస్తున్నాం. వచ్చే వాళ్లంతా బోనాలు, బతుకమ్మలు, పీర్లు, వృత్తుల చిహ్నాలతో హాజరు కావాలి. సగటుపౌరుడి బలమేంటో ప్రభుత్వానికి తెలియజేయాలి.’ అని తెలంగాణ ఐక్య కార్యచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ధర్నాచౌక్ పరిరక్షణపై బుధవారం మక్ధూంభవన్‌లో వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. ‘జేఏసీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కోసం అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారు. నిర్వాసితుల దీక్ష అంటే అందుకూ అనుమతి ఇవ్వలేదు. ఇక నిరుద్యోగ సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారు. అనుమతి కోసం పోలీసులను సంప్రదిస్తే పొద్దంతా వేచి చూడాల్సిన పరిస్థితి. తీరా అంతసేపు ఎదురుచూస్తే రాత్రికి వచ్చి అనుమతి ఇవ్వడం లేదు అని తాపీగా చెప్తారు. తెల్లారి కార్యక్రమం చేసుకోనీయకుండా చేస్తున్నారు. ఇదంతా ఒక రకమైన అణిచివేతలా కనిపిస్తోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక సామాన్యుడు గొంతెత్తే హక్కును సైతం కోల్పోయేలా కనిపిస్తోందని, ఇందిరాపార్క్ వద్ద నిరసన వ్యక్తం చేసుకోవద్దనడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈనెల 23న చేపట్టే కార్యక్రమానికి అన్ని వర్గాలు హాజరు కావాలన్నారు. అక్కడే వంటా-వార్పు చేపట్టాలని, కళాకారులతో ఆటా-పాటా, ధూంధాం కూడా ఉంటుందన్నారు. కార్యక్రమానికి వచ్చే వాళ్లంతా జాతీయ జెండాతో పాటు తెలంగాణ ప్రతీకలైన చిహ్నాలను వెంట తెచ్చుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.