పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగినా.. ‘ముందస్తు’ అయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తులు ఖాయమనే చర్చ ఇటీవల మళ్లీ ఊపందుకుంది. ఆరు నెలల కిందటే రెండు పార్టీల హైకమాండ్ మధ్య ఓ అవగాహన వచ్చిందన్న ప్రచారం జరగ్గా.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు పొత్తులు అవసరమన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఈ రెండు పార్టీల నడుమ కొంత స్థబ్దత నెలకొనగా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు పొత్తులతోనే ముందుకు సాగుతాయన్న చర్చ 15 రోజులుగా జోరందుకుంది. ఈ మేరకు ఆ రెండు పార్టీల అధిష్టానంలో ఎన్ని స్థానాలకు, ఏయే జిల్లాల్లో ఏయే నియోజకవర్గాలను కేటాయిం చాలన్న ఎక్సర్‌సైజ్ జరుగుతోందంటున్నారు.
ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరి ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీలోని ఎవరి టికెట్æకు ఎసరు వస్తుందన్న చర్చ ఆ పార్టీ ఆశావహుల్లో అలజడి రేపుతోంది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేసింది. ఆ పార్టీ ఏఐసీసీ కార్యదర్శులు, రాహుల్‌గాంధీ దూతలు సమీక్షలు, సదస్సుల పేరిట ఉమ్మడి జిల్లాలోని అన్ని ని యోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలను కూడా అంచనా వేసే పనిలో పడ్డారు. ప్రధానంగా ఆయా సెగ్మెంట్లలో తెలుగుదేశం ప్రాబల్యం ఏ మేరకు ఉందన్న అంచనా కూడా వేస్తున్నారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు మైత్రి అవసరమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎవరికి టికెట్ చేజారుతుందోనన్న ఆందోళన హస్తం పార్టీ ఆశావహుల్లో మొదలైంది. 2014 ఎన్నికల్లో రెండు పార్లమెంట్, 13 అసెంబ్లీ స్థానాలకు ఒకే అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆధిక్యతను చాటుకోవాలని చూస్తోంది. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేతలందరు కూడా మళ్లీ పోటీలో ఉండాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తీవ్రం చేసినట్లు కూడా ప్రచారం ఉంది. ఇదిలా వుంటే హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి గతంలో రెండు పర్యాయాలు తెలుగుదేశం నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన ఇనుగాల పెద్దిరెడ్డి ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పొత్తుల హామీతోనే ఏ పార్టీలోకి వెళ్లలేదంటున్నారు.
అదే విధంగా మరో సీనియర్ నేత, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కూడా ఈ సారి జిల్లా నుంచే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ కమిటీలు వేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్యక్రమాలను ఉధృతం చేశారు. ఆ పార్టీ ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడుతోంది. ఈ దశలో కాంగ్రెస్‌తో స్నేహ హస్తం చాచడం, బలీయశక్తిగా అవతరించిన టీఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు రెండు పార్టీల మధ్యన మైత్రి కలిసి వస్తుందని అంచనాకొచ్చినట్లు తెలిసింది. ఏఐసీసీ స్థాయిలో ఈ మేరకు ప్రాథమిక చర్చలు జరిగాయని, పొత్తుకు ఇరుపార్టీలు దాదాపుగా అంగీకరించాయని, అయితే టీడీపీకి ఎన్ని స్థానాలు కేటాయించడమన్నదే ప్రధాన సమస్యని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ పొత్తు పొడిస్తే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే చర్చ పక్కనపెడితే.. ఆశావహులకు మాత్రం ఈ వార్త కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
పొత్తుల ప్రతిపాదనలు బాగానే ఉన్నా.. ఎవరికి నష్టం? మరెవరికి లాభం? అన్న లెక్కల్లో కాంగ్రెస్ పార్టీ ఆశావహులు పడ్డారు. ఓ వైపు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన నేతలు.. మరోవైపు పొత్తుల్లో భాగంగా టీడీపీ నేతలకు సీట్లను కేటాయించడం ద్వారా ఎవరి స్థానా లకు ఎసరు వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితోపాటు కవ్వంపెల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, చింతకుంట్ల విజయరమణారావు, ము ద్దసాని కశ్యప్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు మానకొండూరు, చొప్పదండి, పెద్దపల్లి, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ టికెట్లు ఆశించారు. ఈ స్థానాలకు వస్తే చొప్పదండి నుంచి 2014లో ఓడిపోయిన సుద్దాల దేవయ్య, గజ్జెల కాంతం, బండి శంకర్, ఎన్.శేఖర్ పోటీ పడుతున్నారు. పెద్దపల్లిలో గీట్ల సబితా, ఈర్ల కొమురయ్య, సురేష్‌రెడ్డి, హుజూరాబాద్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ బంధువు పాడి కౌశిక్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేష్ తదితరులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
పొత్తుల్లో భాగంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా ఇక్కడే పోటీ చేయాలనుకుంటున్నారు. కాగా.. మానకొండూరు నుంచి మాజీ విప్ ఆరెపెల్లి మో హన్ ఖాయమన్న ప్రచారం ఉండగా పలువురు పోటీ పడుతుండటం చర్చనీయాంశంగా మారిం ది. ఇదిలా వుండగా జగిత్యాల నుంచి సీఎల్‌పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మంథనిలో మాజీ మంతి డి.శ్రీధర్‌బాబులే ఖాయమని చెప్తుండగా, హుజూరాబాద్, రామగుండం, కోరుట్లలపై కన్నేసినట్లు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ దాదాపుగా నిర్వీర్యమైనప్పటికీ చాలా చోట్ల ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. ముఖ్యనేతలు పార్టీని వీడినా క్షేత్రస్థాయి కేడర్ మాత్రం ఇంకా అంటిపెట్టుకునే ఉంది. ఈ నేపథ్యంలోనే తమకు ఆశించిన టిక్కెట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలను వేగం చేస్తున్నట్లు ప్రచారం.
కాగా వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, ఏనుగు మనోహర్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు పోటీ పడుతుండగా, సిరిసిల్లలో కెకె మహేందర్‌రెడ్డి, చీటి ఉమేష్‌రావు తదితరుల పేర్లుండగా, కరీంనగర్ నుంచి గత ఎన్నికల్లో ఓటమి చెందిన చల్మెడ లక్ష్మీనరసింహరావుతోపాటు 10 మంది పేర్లు వినిపిస్తున్నాయి. రామగుండం నుంచి రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్, బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి తదితరులు ఉండగా, ధర్మపురి నుంచి కూడా ఈసారి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు పోటీ పడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. హుస్నాబాద్ నుంచి ఎ.ప్రవీణ్‌రెడ్డి పేరు తెరమీద ఉండగా, బొమ్మ వెంకటేశ్వర్, బొమ్మ శ్రీరామ్ అడుగుతున్నారంటుండగా, సీపీఐతో సైతం పొత్తు కుదిరితే ఈ స్థానం కూడా కాంగ్రెస్ ఆశావహుల చేజారే అవకాశం లేకపోలేదంటున్నారు. ఓ వైపు పార్టీ బలోపేతం రాహుల్‌గాంధీ వేగుల పర్యటన, ఇంకోవైపు పొత్తులు కాంగ్రెస్ పార్టీ వర్గాలో హీట్ పెంచగా, కాంగ్రెస్ పార్టీతో ఇతర పార్టీల పొత్తుల వ్యవహారం ఎవరికి ఎసరు తెస్తుందోనన్న చర్చ హాట్‌టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment