అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం
కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్
ఘనంగా అంబేద్కర్ జయంతి
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: నిమ్నకులాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ ఐ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ 124వ జయంతి వేడుకలు సోమవారం ఖమ్మం లో ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఐ.శ్రీనివాసశ్రీనరేష్, ఎస్పీ ఏవీ రంగనాధ్, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేద్రమోహన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితా న్ని ధారపోశారని కొనియాడారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్ అవసరాలను ముందే ఊహించి, వాటి పరిష్కర మార్గాలను రాజ్యాంగంలో పొందుపరిచిన దార్శనికుడని కొనియాడారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ అంటరానితనం, మూఢనమ్మకాల నిర్మూలనపై అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు.
అంబేద్కర్ మార్గం అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు లక్ష్మీదేవి, ఎస్పీ కార్పొరేషన్ కార్యనిర్వహణాధికారి సీతామహాలక్ష్మి, జేడీఏ భాస్కర్‌రావు, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, బీసీ సంక్షే మ అధికారి వెంకటనర్సయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆంజనేయశర్మ, నగరపాలక సంస్థ కమిషనర్ బి శ్రీనివాస్, వికలాంగ శాఖ ఏడీ మున్న య్య, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు, ఉద్యానవన శాఖ సహాయసంచాలకులు మరియన్న పాల్గొన్నారు.