సాక్షి, సిటీబ్యూరో :ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ) మార్గంలో మెట్రో ప్రారంభం కావడంతో... ఈ మార్గంలోని చారిత్రక, వారసత్వ కట్టడాలకు మెట్రో లుక్ వచ్చినట్లైంది. ప్రధానంగా అసెంబ్లీ, అమరవీరుల స్థూపం, మొజంజాహీ మార్కెట్, రంగమహల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్ వంతెనకు ఆనుకొని ప్రవహిస్తున్న మూసీ అందాలను వీక్షిస్తూ సిటీజనులు మెట్రో జర్నీ చేసే అవకాశం లభించింది. ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ ఇక్కడి బస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉండడంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారనుంది. ఈ స్టేషన్ ఆసియాలోనే అత్యంత పెద్ద స్టేషన్లలో ఒకటి కావడం విశేషం. సోమవారం సాయంత్రం 6గంటల నుంచి ఈ రూట్‌లో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి.
18 రైళ్లు సిద్ధం...
మంగళవారం నుంచి రద్దీ వేళల్లో ప్రతి 6నిమిషాలకో రైలు, మిగతా వేళల్లో ప్రతి 8నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించేందుకు 18 రైళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఉదయం 6:30గంటల నుంచి రాత్రి 10:30గంటల వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎల్బీనగర్ నుంచి 29 కి.మీ దూరంలో ఉన్న మియాపూర్ వరకు జర్నీ చేసేందుకు రోడ్డు మార్గంలో రెండు గంటలకు పైగా సమయం పడుతుండగా... మెట్రోలో కేవలం 52 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడం విశేషం. అదీ కేవలం రూ.60 చార్జీతో ఒక చివరి నుంచి మరో చివరికి ప్రయాణించవచ్చు. మెట్రో జర్నీతో సమయం ఆదా అవడంతో పాటు ట్రాఫిక్, కాలుష్యం నుంచి సిటీజనులకు విముక్తి లభించనుంది. ఇక ఎల్బీనగర్ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే వారితో పాటు ఈ రూట్లోని దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు మలక్‌పేట్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మందికి ఈ మెట్రో మార్గం సౌకర్యవంతంగా మారనుంది. ప్రధానంగా ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ) మార్గంలోని మెట్రో మార్గానికి ఇరువైపులా పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, మార్కెట్లు, విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులున్నాయి. ఆయా కేంద్రాలకు వెళ్లే వేలాది మందికి మెట్రో జర్నీ సౌకర్యవంతంగా మారనుంది.
పార్కింగ్ పరేషాన్ తప్పదు...
మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ కష్టాలు మాత్రం ప్రయాణికులకు చుక్కలు చూపనున్నాయి. ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో 17 స్టేషన్లుండగా... వీటిలో ఎల్బీనగర్, విక్టోరియా, మూసారాంబాగ్, ఎర్రమంజిల్ మినహా మిగతా స్టేషన్లలో పార్కింగ్ వసతి లేదు. ద్విచక్రవాహనాలు, కార్లలో తరలివచ్చిన ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు చుక్కలు చూపనున్నాయి. ప్రధానంగా ఆటోలు, బస్సులు, క్యాబ్ సర్వీసుల్లో మెట్రో స్టేషన్లకు తరలివచ్చే వారికే మెట్రో జర్నీ సౌకర్యవంతంగా మారనుంది. దశలవారీగా ఆయా స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని, సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఆయా స్టేషన్ల వద్ద స్మార్ట్‌బైక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బైక్‌లు, కార్లు అద్దెకు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇస్తున్నారు.
ఉద్యోగుల హర్షం...
పంజగుట్ట /సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్: ఎల్‌బీనగర్ – అమీర్‌పేట్ మెట్రో రైలు ప్రారంభం కావడంపై పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎర్రమంజిల్ కాలనీలో జలసౌధ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం, విద్యుత్ సౌధ తదితర ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు, నిమ్స్ ఆసుపత్రి, మరెన్నో ప్రైవేట్ సంస్థలు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. దీంతో ఈ రహదారిలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎల్‌బీనగర్ నుంచి పంజగుట్టకు రావాలంటే ఆఫీస్ సమయాల్లో దాదాపు 2గంటలు పడుతోంది. ఇప్పుడు మెట్రోలో అరగంటలో రావచ్చు. ఇక కాలుష్యం, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పార్కింగ్ సమస్య...
మెట్రోను హడావుడిగా ప్రారంభించారే తప్ప సరైన వసతులు కల్పించలేదు. ఖైరతాబాద్‌లో వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు సౌకర్యం లేదు. ఎర్రమంజిల్‌లో కూడా పార్కింగ్ లేదు. స్టేషన్ పక్కనే నిర్మిస్తున్న షాపింగ్‌మాల్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సౌకర్యాలు అంతంతే..!
ఎంజీబీఎస్, కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల మెట్రో రైల్వే స్టేషన్‌లలో సౌకర్యాలు అంతంతామాత్రంగానే ఉన్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలల పనులు పూర్తి కాలేదు. ఎస్కలేటర్ పనులు సైతం కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాథమిక దశలోనే మొరాయించడంతో మరమ్మతులు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. దీనిపై మెట్రో అధికారులను వివరణ కోరగా ఎంజీబీఎస్ బస్టాండ్‌లో పార్కింగ్ చేసుకోవచ్చని ఉచిత సలహా ఇస్తున్నారు.
20 నిమిషాల్లో...
నాకు మియాపూర్‌లో సెలూన్ ఉంది. ప్రతిరోజు బైక్‌పై వెళ్లి రావాలంటే చాలా కష్టమవుతోంది. ఇప్పుడు ఇంటికి దగ్గర్లోని ఎర్రమంజిల్ స్టేషన్‌లో మెట్రో ఎక్కితే 20 నిమిషాల్లో మియాపూర్ చేరుకుంటాను. హ్యాపీగా, సాఫీగా వెళ్లిపోవచ్చు. – సంతోష్, ఎర్రమంజిల్ కాలనీ
తగ్గిస్తే మేలు..
ఢిల్లీలో మాదిరి హైదరాబాద్‌లోనూ టికెట్ ధరలు తగ్గించాలి. ఆదరణ పెరగాలంటే చార్జీలు తగ్గించి, స్టేషన్‌లలో సెక్యూరిటీ పెంచాలి. – సాన శ్రీతిషా
ఎంతో హాయి...
ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఎలాంటి ట్రాఫిక్‌జామ్ లేకుండా మెట్రో రైలులో వెళ్లడం ఎంతో హాయినిచ్చింది. బైక్‌లో వెళ్లడం కంటే మెట్రోలో సేఫ్ కూడా. ఇది ప్రజలకెంతో సౌకర్యం. – స్వరూప్‌రెడ్డి, ప్రయాణికుడు
చార్జీలు తగ్గించాలి..
నేను నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగిని. తార్నాకలో ఉంటాను. రోజు ట్రాఫిక్‌లో రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఇక ఇప్పుడు మెట్రోలో ఇబ్బందులు లేకుండా వెళ్లొచ్చు. నిమ్స్‌కు వచ్చే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కానీ చార్జీలు కొంత మేరకు తగ్గించి, పేదలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలి. – సత్యగౌడ్, నిమ్స్ ఉద్యోగి
చార్జీలు ఇలా...
మెట్రో రైలులో ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ) మార్గంలో ఒక చివరి నుంచి మరో చివరికి ప్రయాణించేందుకు రూ.60 చార్జీ అవుతుంది. ఇక మియాపూర్‌లో బయలుదేరిన వ్యక్తికి స్టేషన్ల వారీగా మెట్రో టిక్కెట్ చార్జీ ఇలా ఉంది
ప్రయాణం చార్జీ (రూ.ల్లో)
మియాపూర్–జేఎన్‌టీయూ 10
కేపీహెచ్‌బీ కాలనీ 15
కూకట్‌పల్లి 25
బాలానగర్ 30
మూసాపేట్ 30
భరత్‌నగర్ 30
ఎర్రగడ్డ 35
ఈఎస్‌ఐ 35
ఎస్‌ఆర్‌నగర్ 40
అమీర్‌పేట్ 40
పంజగుట్ట 40
ఎర్రమంజిల్ 40
ఖైరతాబాద్ 45
లక్డీకాపూల్ 45
అసెంబ్లీ 45
నాంపల్లి 45
గాంధీభవన్ 50
ఉస్మానియా మెడికల్ కాలేజ్ 50
ఎంజీబీఎస్ 50
మలక్‌పేట్ 50
న్యూమార్కెట్ 50
మూసారాంబాగ్ 55
దిల్‌సుఖ్‌నగర్ 55
చైతన్యపురి 60
విక్టోరియా మెమోరియల్ 60
ఎల్బీనగర్ 60
Comments
Please login to add a commentAdd a comment