Ameerpet-L.B. Nagar
-
ఒక్కరోజే.. 2.25 లక్షల మంది మెట్రో జర్నీ
సాక్షి, సిటీబ్యూరో: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగించ డం వల్ల ఒకేరోజు 2.25 లక్షల మంది ప్రయాణించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లు నడిపారు. దీని కారణంగా ఒకేరోజు మెట్రోలో ప్రయాణించిన వారిసంఖ్య తొలిసారి 2 లక్షల మార్క్‌ను దాటిందని హెచ్‌ఎమ్మార్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో 1.65 లక్షల మంది, నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో సుమారు 60 వేల మంది మెట్రో ప్రయా ణం చేసినట్లు ఆయన వెల్లడించారు. అమీర్‌పేట్, మియాపూర్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, ఉప్పల్ స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడాయన్నారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 12.30 గం. వరకు ఈ రద్దీ కొనసాగిందన్నారు. ఆరు నిమిషాలకో రైలు: రోజూ 1.50 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఎల్బీనగర్–మియాపూర్, అమీర్‌పేట్–నాగోల్ రూట్లలో ప్రతి ఆరు నిమిషాలకో మెట్రో రైలును నడిపారు. జనవరి నెలాఖరులోగా అమీర్‌పేట్–హైటెక్‌సిటీ (10 కి.మీ)రూట్లోనూ మెట్రోరైళ్ల వాణిజ్య రాకపోకలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మార్గానికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ మార్గం ప్రారంభమయితే.. నిత్యం నగరంలో మెట్రో జర్నీ చేసే ప్రయాణికుల సంఖ్య మూడు లక్షలు దాటుతుందని మెట్రోరైల్ అధికారులు అంచనావేస్తున్నారు. హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో పూర్తయితే ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ఈ రూట్లోని స్టేషన్ల నిర్మాణం, సుందరీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గం కూడా పూర్తయితే నిత్యం మూడు మార్గాల్లో సుమారు 16 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తారని మెట్రో అధికారులు అంచనావేస్తున్నారు. -
చారిత్రక కట్టడాలకు మెట్రో లుక్
సాక్షి, సిటీబ్యూరో :ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ) మార్గంలో మెట్రో ప్రారంభం కావడంతో... ఈ మార్గంలోని చారిత్రక, వారసత్వ కట్టడాలకు మెట్రో లుక్ వచ్చినట్లైంది. ప్రధానంగా అసెంబ్లీ, అమరవీరుల స్థూపం, మొజంజాహీ మార్కెట్, రంగమహల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్ వంతెనకు ఆనుకొని ప్రవహిస్తున్న మూసీ అందాలను వీక్షిస్తూ సిటీజనులు మెట్రో జర్నీ చేసే అవకాశం లభించింది. ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్ ఇక్కడి బస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉండడంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారనుంది. ఈ స్టేషన్ ఆసియాలోనే అత్యంత పెద్ద స్టేషన్లలో ఒకటి కావడం విశేషం. సోమవారం సాయంత్రం 6గంటల నుంచి ఈ రూట్లో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. 18 రైళ్లు సిద్ధం... మంగళవారం నుంచి రద్దీ వేళల్లో ప్రతి 6నిమిషాలకో రైలు, మిగతా వేళల్లో ప్రతి 8నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించేందుకు 18 రైళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఉదయం 6:30గంటల నుంచి రాత్రి 10:30గంటల వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎల్బీనగర్ నుంచి 29 కి.మీ దూరంలో ఉన్న మియాపూర్ వరకు జర్నీ చేసేందుకు రోడ్డు మార్గంలో రెండు గంటలకు పైగా సమయం పడుతుండగా... మెట్రోలో కేవలం 52 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడం విశేషం. అదీ కేవలం రూ.60 చార్జీతో ఒక చివరి నుంచి మరో చివరికి ప్రయాణించవచ్చు. మెట్రో జర్నీతో సమయం ఆదా అవడంతో పాటు ట్రాఫిక్, కాలుష్యం నుంచి సిటీజనులకు విముక్తి లభించనుంది. ఇక ఎల్బీనగర్ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే వారితో పాటు ఈ రూట్లోని దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి రైల్వేస్టేషన్లతో పాటు మలక్‌పేట్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మందికి ఈ మెట్రో మార్గం సౌకర్యవంతంగా మారనుంది. ప్రధానంగా ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ) మార్గంలోని మెట్రో మార్గానికి ఇరువైపులా పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, మార్కెట్లు, విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులున్నాయి. ఆయా కేంద్రాలకు వెళ్లే వేలాది మందికి మెట్రో జర్నీ సౌకర్యవంతంగా మారనుంది. పార్కింగ్ పరేషాన్ తప్పదు... మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ కష్టాలు మాత్రం ప్రయాణికులకు చుక్కలు చూపనున్నాయి. ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో 17 స్టేషన్లుండగా... వీటిలో ఎల్బీనగర్, విక్టోరియా, మూసారాంబాగ్, ఎర్రమంజిల్ మినహా మిగతా స్టేషన్లలో పార్కింగ్ వసతి లేదు. ద్విచక్రవాహనాలు, కార్లలో తరలివచ్చిన ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు చుక్కలు చూపనున్నాయి. ప్రధానంగా ఆటోలు, బస్సులు, క్యాబ్ సర్వీసుల్లో మెట్రో స్టేషన్లకు తరలివచ్చే వారికే మెట్రో జర్నీ సౌకర్యవంతంగా మారనుంది. దశలవారీగా ఆయా స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని, సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఆయా స్టేషన్ల వద్ద స్మార్ట్‌బైక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బైక్‌లు, కార్లు అద్దెకు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఉద్యోగుల హర్షం... పంజగుట్ట /సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్: ఎల్బీనగర్ – అమీర్‌పేట్ మెట్రో రైలు ప్రారంభం కావడంపై పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎర్రమంజిల్ కాలనీలో జలసౌధ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం, విద్యుత్ సౌధ తదితర ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు, నిమ్స్ ఆసుపత్రి, మరెన్నో ప్రైవేట్ సంస్థలు, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. దీంతో ఈ రహదారిలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎల్బీనగర్ నుంచి పంజగుట్టకు రావాలంటే ఆఫీస్ సమయాల్లో దాదాపు 2గంటలు పడుతోంది. ఇప్పుడు మెట్రోలో అరగంటలో రావచ్చు. ఇక కాలుష్యం, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ సమస్య... మెట్రోను హడావుడిగా ప్రారంభించారే తప్ప సరైన వసతులు కల్పించలేదు. ఖైరతాబాద్‌లో వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు సౌకర్యం లేదు. ఎర్రమంజిల్‌లో కూడా పార్కింగ్ లేదు. స్టేషన్ పక్కనే నిర్మిస్తున్న షాపింగ్‌మాల్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సౌకర్యాలు అంతంతే..! ఎంజీబీఎస్, కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల మెట్రో రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు అంతంతామాత్రంగానే ఉన్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలల పనులు పూర్తి కాలేదు. ఎస్కలేటర్ పనులు సైతం కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాథమిక దశలోనే మొరాయించడంతో మరమ్మతులు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. దీనిపై మెట్రో అధికారులను వివరణ కోరగా ఎంజీబీఎస్ బస్టాండ్‌లో పార్కింగ్ చేసుకోవచ్చని ఉచిత సలహా ఇస్తున్నారు. 20 నిమిషాల్లో... నాకు మియాపూర్‌లో సెలూన్ ఉంది. ప్రతిరోజు బైక్‌పై వెళ్లి రావాలంటే చాలా కష్టమవుతోంది. ఇప్పుడు ఇంటికి దగ్గర్లోని ఎర్రమంజిల్ స్టేషన్లో మెట్రో ఎక్కితే 20 నిమిషాల్లో మియాపూర్ చేరుకుంటాను. హ్యాపీగా, సాఫీగా వెళ్లిపోవచ్చు. – సంతోష్, ఎర్రమంజిల్ కాలనీ తగ్గిస్తే మేలు.. ఢిల్లీలో మాదిరి హైదరాబాద్‌లోనూ టికెట్ ధరలు తగ్గించాలి. ఆదరణ పెరగాలంటే చార్జీలు తగ్గించి, స్టేషన్లలో సెక్యూరిటీ పెంచాలి. – సాన శ్రీతిషా ఎంతో హాయి... ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఎలాంటి ట్రాఫిక్‌జామ్ లేకుండా మెట్రో రైలులో వెళ్లడం ఎంతో హాయినిచ్చింది. బైక్‌లో వెళ్లడం కంటే మెట్రోలో సేఫ్ కూడా. ఇది ప్రజలకెంతో సౌకర్యం. – స్వరూప్‌రెడ్డి, ప్రయాణికుడు చార్జీలు తగ్గించాలి.. నేను నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగిని. తార్నాకలో ఉంటాను. రోజు ట్రాఫిక్‌లో రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఇక ఇప్పుడు మెట్రోలో ఇబ్బందులు లేకుండా వెళ్లొచ్చు. నిమ్స్‌కు వచ్చే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కానీ చార్జీలు కొంత మేరకు తగ్గించి, పేదలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలి. – సత్యగౌడ్, నిమ్స్ ఉద్యోగి చార్జీలు ఇలా... మెట్రో రైలులో ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ) మార్గంలో ఒక చివరి నుంచి మరో చివరికి ప్రయాణించేందుకు రూ.60 చార్జీ అవుతుంది. ఇక మియాపూర్‌లో బయలుదేరిన వ్యక్తికి స్టేషన్ల వారీగా మెట్రో టిక్కెట్ చార్జీ ఇలా ఉంది ప్రయాణం చార్జీ (రూ.ల్లో) మియాపూర్–జేఎన్టీయూ 10 కేపీహెచ్‌బీ కాలనీ 15 కూకట్పల్లి 25 బాలానగర్ 30 మూసాపేట్ 30 భరత్‌నగర్ 30 ఎర్రగడ్డ 35 ఈఎస్ఐ 35 ఎస్ఆర్నగర్ 40 అమీర్‌పేట్ 40 పంజగుట్ట 40 ఎర్రమంజిల్ 40 ఖైరతాబాద్ 45 లక్డీకాపూల్ 45 అసెంబ్లీ 45 నాంపల్లి 45 గాంధీభవన్ 50 ఉస్మానియా మెడికల్ కాలేజ్ 50 ఎంజీబీఎస్ 50 మలక్‌పేట్ 50 న్యూమార్కెట్ 50 మూసారాంబాగ్ 55 దిల్సుఖ్నగర్ 55 చైతన్యపురి 60 విక్టోరియా మెమోరియల్ 60 ఎల్బీనగర్ 60 -
ప్రారంభమైన అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రోరైలు
-
మెట్రో సేవలను వినియోగించుకోవాలి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్ : నగర ప్రజలు మెట్రో సేవలను వినియోగించుకోవాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విజ్ఞప్తి చేశారు. సోమవారం అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రో కారిడర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలుష్యం తగ్గాలంటే మెట్రో ప్రయాణమే మంచిదన్నారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఉండదన్నారు. మెట్రో ప్రయాణం వల్ల అంబులెన్స్‌లు సహా అత్యవసర సేవల ప్రయాణాలకు ఆటంకం కలగదని తెలిపారు. మెట్రో స్టేషన్లలో అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయని, ఒక్క స్మార్ట్ కార్డ్ ద్వారా అన్ని సౌకర్యాలు పొందేలా చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులకు సూచించారు. డిసెంబర్ 15 లోగా హైటెక్ సిటీ మార్గాన్ని కూడా పూర్తి చేయాలని కోరారు. ఇది మన మెట్రో అని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలోనే బెస్ట్ మెట్రో.. దేశంలోనే హైదరాబాద్ మెట్రో బెస్ట్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్రస్తుతం నగరంలో మెట్రో సేవలు 46 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రతి స్టేషన్ వద్ద పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. భద్రతా అనుమతులు వల్ల నెలరోజులు ఆలస్యమైందన్నారు. -
ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రోరైలు ప్రారంభం
-
ప్రారంభమైన ఎల్బీనగర్-అమీర్‌పేట్ మెట్రోరైలు
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్-అమీర్‌పేట్ (16 కి.మీ.) మార్గంలో మెట్రో రైలు ప్రారంభమైంది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొని.. మెట్రోరైలులో ప్రయాణించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గంలో మెట్రోరైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతాచోట్ల ఇప్పటివరకు పార్కింగ్ వసతులు అందుబాటులో లేవు. ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కి.మీ. దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తరవాత రైళ్ల ఫ్రీక్వెన్సీ 2 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లో మెట్రో ప్రారంభంతో ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్ బస్ డిపో, మలక్‌పేట్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ నరకం నుంచి ఉపశమనం కలగనుంది. ఈ రూట్లో అసెంబ్లీ–ఎంజీబీఎస్ మార్గంలో పలు చారిత్రక కట్టడాలున్న నేపథ్యంలో ఐదు కిలోమీటర్ల మార్గంలో దక్కనీ, ఇండో పర్షియన్ కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. తొలిరోజు సుమారు 50 వేలు.. తర్వాత నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
అర్ధరాత్రి వేళల్లోనూ మెట్రో నడపాలని డిమాండ్
‘‘మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సిస్టం ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. ఉదయం10 గంటలకు డ్యూటీకి వెళితే వర్క్ పూర్తయ్యేసరికి రాత్రి 10 అవుతుంది. ఆఫీస్ నుంచి అమీర్‌పేట్‌కు 11 గంటలకల్లా వస్తున్నా.. అక్కడి నుంచి కొత్తపేట్ వెళ్లే పరిస్థితి లేదు. ఆ సమయంలో మెట్రో సర్వీస్ ఉంటే నాలాంటి వారికి ఉపయోగంగా ఉంటుంది’’ అని అంటున్నాడు కొత్తపేట్‌కు చెందిన రామకృష్ణ. అమీర్‌పేట్.. విద్యా,వ్యాపారం కేంద్రం. పంజగుట్ట.. వాణిజ్య సముదాయాలకు, కోఠి, అబిడ్స్.. హోల్‌సేల్ వ్యాపారానికినిలయం. దిల్సుఖ్నగర్.. కోచింగ్ సెంటర్ల హబ్.కొత్తపేట్ హోల్‌సేల్ దుస్తులు, పండ్ల మార్కెట్‌కు సెంటర్. ఇక ఎల్బీనగర్.. నిత్యం ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే వేలాది మందికి రవాణా సౌకర్యం దొరికే పాయింట్. ఇంతకాలం ఆయా ప్రాంతాలకు బస్సుల్లోనో, సొంత వాహనాల్లోనో వెళ్లేవారు ట్రాఫిక్ ఇక్కట్లతో సతమతమయ్యేవారు. ఇకపై వారికి ఆ కష్టాలు తీరనున్నాయి. సోమవారం నుంచి అమీర్‌పేట్–ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రూట్లో ఉన్న 16 మెట్రో స్టేషన్లు వేలాది మందికి సేవలు అందించనున్నాయి. సాక్షి,సిటీబ్యూరో: ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ) రూట్లో రెండురోజుల్లో మెట్రో రైళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రూట్లో తిరిగే ప్రయాణికులకు కల్పించిన వసతులు, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ, పార్కింగ్ వంటి అంశాలన్నీ ఆసక్తికరంగా మారాయి. సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ మార్గంలో మెట్రో రైళ్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు రైళ్లు అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు చెబుతున్నారు. రాత్రి 10.30 గంటల వరకు ప్రతి ఐదు నిమిషాలకో రైలు చొప్పున 84 ట్రిప్పుల మేర రాకపోకలు సాగిస్తాయంటున్నారు. మంగళవారం నుంచి నిత్యం సుమారు లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, అమీర్‌పేట్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న 16 స్టేషన్ల వద్ద వయాడక్ట్, స్టేషన్ నిర్మాణం పనులను ఎల్అండ్టీ సంస్థ పూర్తి చేసింది. ప్రధాన రహదారి వద్ద స్టేషన్ల పరిసరాల్లో ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్, సుందరీకరణ పనులను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ చేపట్టింది. దిల్సుఖ్నగర్, ఎర్రమంజిల్ స్టేషన్ వద్ద పరిసరాల సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో అన్ని స్టేషన్ల వద్ద ఈ పనులు పూర్తి చేస్తామని హెచ్ఎంఆర్ అధికారులు చెబుతున్నారు. ఇక్కడా పార్కింగ్ పరేషానే.. ♦ ఎల్బీనగర్–అమీర్‌పేట్ మధ్య అత్యంత రద్దీగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో స్టేషన్లకు ద్విచక్రవాహనాలు, కార్లలో వచ్చే ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు తప్పవు. నాలుగు స్టేషన్లు మినహా మిగతా 12 స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు బస్సులు, ఆటోలు, క్యాబ్సర్వీసుల్లో మాత్రమే స్టేషన్లకు రావాల్సి ఉంటుంది. ♦ ఇప్పటి దాకా ఎల్బీనగర్లో స్టేడియం పక్కనే మెట్రోకు రెండు ఎకరాల స్థలం ఉన్నప్పటికీ పార్కింగ్ ఏర్పాట్లు పూర్తికాలేదు. కానీ ఎల్బీనగర్ స్టేషన్ పరిసరాల్లో పరిమిత సంఖ్యలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ♦ ఇక ముసారాంబాగ్‌లో మెట్రో మాల్ ఉంది. అక్కడ వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. ఎర్రమంజిల్‌లోనూ మెట్రో మాల్ పూర్తయింది. ఇక్కడా వాహనాలు నిలుపుకోవచ్చు. ♦ పంజగుట్ట వద్ద కూడా మెట్రో మాల్లో వాహనాల్ని పార్క్ చేయవచ్చు. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద అధునాతన మల్టీలెవల్ పార్కింగ్ సముదాయ నిర్మాణానికి ఇటీవల భూమి పూజ చేసినప్పటికీ ఈ పనులు పూర్తి కావాలంటే మరో ఏడాది వేచిచూడక తప్పదు. భద్రతా తనిఖీలు ముమ్మరం ఎల్బీనగర్ మార్గంలోని 16 స్టేషన్లలో భద్రతా తనిఖీలు మొదలయ్యాయి. డాగ్ స్క్వాడ్ బృందం స్టేషన్లలో తనిఖీలు చేస్తోంది. ఈ మార్గంలోని చివరి స్టేషన్ ఎల్బీనగర్లో గురు, శుక్రవారాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. మెట్ల మార్గాలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్, ఫ్లోరింగ్‌ను సిబ్బంది శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. 850 ఆర్టీసీ బస్సుల రాకపోకలు.. అమీర్‌పేట్–ఎల్బీనగర్ మెట్రో రైలు మార్గానికి అనుసంధానంగా సిటీ బస్సులను విస్తరించేందుకు గ్రేటర్ ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. ఇప్పటి దాకా ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు తిరిగే బస్సుల సంఖ్యను తగ్గించి మెట్రోస్టేషన్లకు రెండు వైపులా ఉన్న కాలనీలకు, శివారు ప్రాంతాలకు వాటి సంఖ్యను పెంచారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ రూటు వల్ల ఇటు ఎల్బీనగర్ నుంచి నాంపల్లి, లక్డీకాపూల్ మీదుగా అటు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా రెండు ప్రధాన కారిడార్లలో మియాపూర్‌కు మెట్రో కనెక్టివిటీ పెరగనుంది. దీంతో ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ తగ్గే అవకాశం ఉంది. మొదటి కారిడార్ వల్ల ఆర్టీసీపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ రెండో కారిడార్ వల్ల అతి పెద్ద రూట్ల మధ్య మెట్రో అనుసంధానం పెరుగుతుంది. దీంతో ఆర్టీసీ ప్రయాణికులు ఎక్కువగా మెట్రో వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకొని సుమారు 850 బస్సులను ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలోని కాలనీలకు, శివారు ప్రాంతాలకు విస్తరించారు. 500 కాలనీలకు అనుసంధానం హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ మీదుగా, వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీ నుంచి ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కోఠి, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, లింగంపల్లి మార్గంలో సిటీబస్సులు ప్రతిరోజు సుమారు 7,295 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇప్పటి దాకా ఆర్టీసీకి అత్యధికంగా ఆదాయాన్ని తెచ్చే మార్గాలు కూడా ఇవే. ఈ రూట్లలో తిరిగే బస్సుల్లో ప్రతిరోజు 65 శాతానికి పైగా ఆక్యుపెన్సీరేషియో నమోదవుతుంది. ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించనున్నారు. లింగంపల్లి, బీహెచ్ఈఎల్ మీదుగా వచ్చే బస్సులను మియాపూర్ వరకు పరిమితం చేస్తారు. అలాగే హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం రూట్లలో వచ్చే బస్సులను ఎల్బీనగర్ వరకు పరిమితం చేస్తారు. ఈ కారిడార్‌లో సమాంతరంగా నడిచే బస్సులను ప్రయాణికుల రద్దీ, ఆదరణకు అనుగుణంగా రూట్ కోర్సుల్లో మార్పులు చేస్తారు. సమాంతర రూట్ బస్సులను కుదించడం వల్ల మెట్రోకు రెండు వైపులా ఉండే సుమారు 500 కాలనీలు, నగర శివారు ప్రాంతాలకు అదనపు సర్వీసులు పెంచనున్నారు. కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డినగర్, నందనవనం, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మీర్పేట్, కొహెడ, తదితర ప్రాంతాల్లోని కొత్త కాలనీలకు బస్సులను విస్తరిస్తారు. ఈ రూట్ల లోంచి ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్లకు సిటీ బస్సులను కనెక్ట్ చేస్తారు. అలాగే పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్‌కు, అటు లక్డీకాపూల్‌కు సిటీ బస్సుల కనెక్టివిటీ పెరగనుంది. మియాపూర్‌లో పెరిగిన ఆక్యుపెన్సీ ఉప్పల్– అమీర్‌పేట్– మియాపూర్ మెట్రో కారిడార్‌లో రెండు వైపులా కాలనీలకు మెట్రో అందుబాటులోకి రావడంతోనే ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టారు. చిలుకానగర్, హేమానగర్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఘట్కేసర్, నారపల్లి, తదితర ప్రాంతాలకు ట్రిప్పులను పెంచారు. అలాగే మియాపూర్ మార్గంలో అపురూపకాలనీ, హైటెక్‌సిటీ, జగద్గిరిగుట్ట, వీబీఐటీ, జేఎన్టీయూ, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, హైటెక్‌సిటీ, అమీర్‌పేట్– హైటెక్‌సిటీ, తదితర ప్రాంతాలకు 60 బస్సులను అదనంగా ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండు రూట్లలో కాలనీలకు బస్సుల కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు ఈ బస్సులన్నీ ప్రతి రోజు 70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. గతంలో 68 శాతం ఉన్న ఆక్యుపెన్సీ 2 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. తొలిరోజు 50 వేలు.. తర్వాత లక్ష మంది సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 84 ట్రిప్పుల మెట్రో రైళ్లలో సుమారు 50 వేల మంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 గంట వరకు(16 గంటలు) ఐదు నిమిషాలకొకటి చొప్పున 192 మెట్రో రైళ్ల ట్రిప్పులు నడిచే అవకాశం ఉంది. ఈ రద్దీ లక్ష మంది వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆదివారం, ఇతర పర్వదినాలు, సెలవు రోజుల్లో రద్దీ లక్షకు మించుతుందని భావిస్తున్నారు. స్పీడు పెరిగిన మెట్రో రైళ్లు.. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ రావడంతో మెట్రో రైళ్ల వేగం ఊపందుకుంది. ప్రస్తుతం మెట్రో రైలు 60 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళుతున్నట్టు మెట్రో అధికారులు చెబుతున్నారు. మెట్రో రైళ్ల గరిష్ట వేగం 8 కేఎంపీహెచ్ అని చెబుతున్నారు. ప్రారంభంలో నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో 30–40 కేఎంపీహెచ్ వేగంతోమాత్రమే మెట్రో రైళ్లు రాకపోకలు సాగించగా.. ఇప్పుడు ఈ మార్గంలోనూ రైళ్ల వేగం 60 కేఎంపీహెచ్‌కు పెరిగిందని చెబుతున్నారు. ఇక ఎల్బీనగర్ నుంచి మెట్రోలో బయలుదేరిన వ్యక్తి కేవలం 52 నిమిషాల్లోనే 29 కి.మీ దూరంలో ఉన్న మియాపూర్‌కు చేరుకోవచ్చు. అదే బస్సు లేదా కారులో రెండు గంటల పాటు ట్రాఫిక్ రద్దీలో జర్నీ చేయక తప్పదు. త్వరలో ఈ బైక్‌లు, అధునాతన సైకిళ్ల సేవలు.. ఈ మార్గంలోని 16 స్టేషన్ల వద్ద అధునాతన సైకిళ్లు, ఈ బైక్‌లు, కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోఉండే స్టేషన్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. ఈ మార్గంలోని స్టేషన్ల వద్ద ఉబర్, ఓలా క్యాబ్ సర్వీసులు, ఆటోలు నిలుపుకునేందుకు వసతులు కల్పించడంతో పాటు, ప్రత్యేక బుకింగ్ కౌంటర్లను సైతం దశలవారీగా ఏర్పాటు చేస్తామన్నారు. అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో మెట్రో రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే అందుబాటులో ఉన్నాయి. ఇక మియాపూర్–ఎల్బీనగర్ మార్గంలో ప్రముఖ విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఆస్పత్రులు, మార్కెట్లు ఉండడంతో పాటు ఈ మార్గం వివిధ రంగాలకు హబ్‌గా మారింది. ఈ రూట్లో నిత్యం లక్షలాది మంది ట్రాఫిక్ రద్దీలో ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న ఎల్బీనగర్ నుంచి ఏపీ రాజధాని అమరావతి సహా వివిధ ప్రధాన నగరాలకు నిత్యం 300 వరకు ప్రైవేటు ట్రావెల్ బస్సులు బయలుదేరి వెళతాయి. ఇవన్నీ అర్ధరాత్రి 12 దాటిన తరవాతే వెళుతుంటాయి. ఈనేపథ్యంలో ట్రావెల్స్ బస్సుల్లో వివిధ నగరాలకు బయలుదేరి వెళ్లే ప్రయాణికులు, ప్రధానం నగరం వచ్చి తిరిగి వెళ్లే ఉద్యోగులు, కార్మికుల సౌకర్యార్థం ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రోరైళ్లను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. కనీసం రాత్రి 10 గంటల తరవాత ఫ్రీక్వెన్సీ తగ్గించి 15 నిమిషాలకో రైలునైనా నడపాలని కోరుతున్నారు. ఈ విషయమై మెట్రో అధికారులను వివరణ కోరగా.. ప్రయాణికుల రద్దీ, డిమాండ్, మూడ్‌ను బట్టి రాత్రి 11.30 గంటల వరకు మెట్రోరైళ్లను నడిపే అవకాశాలున్నట్లు హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. ఎప్పటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందో త్వరలో తెలియజేస్తామన్నారు. -
జులైలో అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెండోదశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను బుధవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు మొదలైన ట్రయల్ రన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జులై చివరివారంలో అమీర్‌పేట- ఎల్బీనగర్ మార్గాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెట్రోతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయని తెలిపారు. మెట్రోతో నాంపల్లి రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్‌ను అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా సెట్విన్ బస్సులను కూడా అనుసంధానం చేస్తామన్నారు. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఎల్బీనగర్- అమీర్‌పేట మధ్యలో ఉన్న చారిత్రక సంపదని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని ఎల్అండ్టీ కంపెనీని కోరామన్నారు. హైటెక్ సిటీ మార్గాన్ని అక్టోబర్‌లో పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. Inspected the metro rail stations at Lakdi-ka-Pul, Nampally & MGBS stations and asked @hmrgov to prepare by end of July for the line to be opened till LB Nagar Also directed @ltmhyd and @hmrgov to develop a heritage precinct between Nampally station & Rangamahal station pic.twitter.com/EnVqrliJIb — KTR (@KTRTRS) June 20, 2018 -
జూలైలో ఎల్బీనగర్-అమీర్‌పేట మెట్రో రైలు పరుగులు