‘‘మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సిస్టం ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. ఉదయం10 గంటలకు డ్యూటీకి వెళితే వర్క్ పూర్తయ్యేసరికి రాత్రి 10 అవుతుంది. ఆఫీస్ నుంచి అమీర్‌పేట్‌కు 11 గంటలకల్లా వస్తున్నా.. అక్కడి నుంచి కొత్తపేట్ వెళ్లే పరిస్థితి లేదు. ఆ సమయంలో మెట్రో సర్వీస్ ఉంటే నాలాంటి వారికి ఉపయోగంగా ఉంటుంది’’ అని అంటున్నాడు కొత్తపేట్‌కు చెందిన రామకృష్ణ. అమీర్‌పేట్.. విద్యా,వ్యాపారం కేంద్రం. పంజగుట్ట.. వాణిజ్య సముదాయాలకు, కోఠి, అబిడ్స్.. హోల్‌సేల్ వ్యాపారానికినిలయం. దిల్‌సుఖ్‌నగర్.. కోచింగ్ సెంటర్ల హబ్.కొత్తపేట్ హోల్‌సేల్ దుస్తులు, పండ్ల మార్కెట్‌కు సెంటర్. ఇక ఎల్బీనగర్.. నిత్యం ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే వేలాది మందికి రవాణా సౌకర్యం దొరికే పాయింట్. ఇంతకాలం ఆయా ప్రాంతాలకు బస్సుల్లోనో, సొంత వాహనాల్లోనో వెళ్లేవారు ట్రాఫిక్ ఇక్కట్లతో సతమతమయ్యేవారు. ఇకపై వారికి ఆ కష్టాలు తీరనున్నాయి. సోమవారం నుంచి అమీర్‌పేట్–ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రూట్‌లో ఉన్న 16 మెట్రో స్టేషన్లు వేలాది మందికి సేవలు అందించనున్నాయి.
సాక్షి,సిటీబ్యూరో: ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ) రూట్లో రెండురోజుల్లో మెట్రో రైళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రూట్లో తిరిగే ప్రయాణికులకు కల్పించిన వసతులు, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ, పార్కింగ్ వంటి అంశాలన్నీ ఆసక్తికరంగా మారాయి. సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈ మార్గంలో మెట్రో రైళ్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు రైళ్లు అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు చెబుతున్నారు. రాత్రి 10.30 గంటల వరకు ప్రతి ఐదు నిమిషాలకో రైలు చొప్పున 84 ట్రిప్పుల మేర రాకపోకలు సాగిస్తాయంటున్నారు. మంగళవారం నుంచి నిత్యం సుమారు లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, అమీర్‌పేట్ నుంచి ఎల్‌బీనగర్ వరకు ఉన్న 16 స్టేషన్ల వద్ద వయాడక్ట్, స్టేషన్ నిర్మాణం పనులను ఎల్‌అండ్‌టీ సంస్థ పూర్తి చేసింది. ప్రధాన రహదారి వద్ద స్టేషన్ల పరిసరాల్లో ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్, సుందరీకరణ పనులను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ చేపట్టింది. దిల్‌సుఖ్‌నగర్, ఎర్రమంజిల్ స్టేషన్ వద్ద పరిసరాల సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో అన్ని స్టేషన్ల వద్ద ఈ పనులు పూర్తి చేస్తామని హెచ్‌ఎంఆర్ అధికారులు చెబుతున్నారు.
ఇక్కడా పార్కింగ్ పరేషానే..
♦ ఎల్బీనగర్–అమీర్‌పేట్ మధ్య అత్యంత రద్దీగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో స్టేషన్లకు ద్విచక్రవాహనాలు, కార్లలో వచ్చే ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు తప్పవు. నాలుగు స్టేషన్లు మినహా మిగతా 12 స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు బస్సులు, ఆటోలు, క్యాబ్‌సర్వీసుల్లో మాత్రమే స్టేషన్లకు రావాల్సి ఉంటుంది.
♦ ఇప్పటి దాకా ఎల్‌బీనగర్‌లో స్టేడియం పక్కనే మెట్రోకు రెండు ఎకరాల స్థలం ఉన్నప్పటికీ పార్కింగ్ ఏర్పాట్లు పూర్తికాలేదు. కానీ ఎల్బీనగర్ స్టేషన్ పరిసరాల్లో పరిమిత సంఖ్యలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు.
♦ ఇక ముసారాంబాగ్‌లో మెట్రో మాల్ ఉంది. అక్కడ వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. ఎర్రమంజిల్‌లోనూ మెట్రో మాల్ పూర్తయింది. ఇక్కడా వాహనాలు నిలుపుకోవచ్చు.
♦ పంజగుట్ట వద్ద కూడా మెట్రో మాల్‌లో వాహనాల్ని పార్క్ చేయవచ్చు. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద అధునాతన మల్టీలెవల్ పార్కింగ్ సముదాయ నిర్మాణానికి ఇటీవల భూమి పూజ చేసినప్పటికీ ఈ పనులు పూర్తి కావాలంటే మరో ఏడాది వేచిచూడక తప్పదు.
భద్రతా తనిఖీలు ముమ్మరం
ఎల్బీనగర్ మార్గంలోని 16 స్టేషన్లలో భద్రతా తనిఖీలు మొదలయ్యాయి. డాగ్ స్క్వాడ్ బృందం స్టేషన్లలో తనిఖీలు చేస్తోంది. ఈ మార్గంలోని చివరి స్టేషన్ ఎల్‌బీనగర్‌లో గురు, శుక్రవారాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. మెట్ల మార్గాలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్, ఫ్లోరింగ్‌ను సిబ్బంది శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
850 ఆర్టీసీ బస్సుల రాకపోకలు..
అమీర్‌పేట్–ఎల్‌బీనగర్ మెట్రో రైలు మార్గానికి అనుసంధానంగా సిటీ బస్సులను విస్తరించేందుకు గ్రేటర్ ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. ఇప్పటి దాకా ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ వరకు తిరిగే బస్సుల సంఖ్యను తగ్గించి మెట్రోస్టేషన్లకు రెండు వైపులా ఉన్న కాలనీలకు, శివారు ప్రాంతాలకు వాటి సంఖ్యను పెంచారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ రూటు వల్ల ఇటు ఎల్‌బీనగర్ నుంచి నాంపల్లి, లక్డీకాపూల్ మీదుగా అటు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా రెండు ప్రధాన కారిడార్లలో మియాపూర్‌కు మెట్రో కనెక్టివిటీ పెరగనుంది. దీంతో ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ తగ్గే అవకాశం ఉంది. మొదటి కారిడార్ వల్ల ఆర్టీసీపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ రెండో కారిడార్ వల్ల అతి పెద్ద రూట్ల మధ్య మెట్రో అనుసంధానం పెరుగుతుంది. దీంతో ఆర్టీసీ ప్రయాణికులు ఎక్కువగా మెట్రో వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకొని సుమారు 850 బస్సులను ఎల్‌బీనగర్–అమీర్‌పేట్ మార్గంలోని కాలనీలకు, శివారు ప్రాంతాలకు విస్తరించారు.
500 కాలనీలకు అనుసంధానం
హయత్‌నగర్ నుంచి ఎల్‌బీనగర్ మీదుగా, వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీ నుంచి ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, బీహెచ్‌ఈఎల్, లింగంపల్లి మార్గంలో సిటీబస్సులు ప్రతిరోజు సుమారు 7,295 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇప్పటి దాకా ఆర్టీసీకి అత్యధికంగా ఆదాయాన్ని తెచ్చే మార్గాలు కూడా ఇవే. ఈ రూట్లలో తిరిగే బస్సుల్లో ప్రతిరోజు 65 శాతానికి పైగా ఆక్యుపెన్సీరేషియో నమోదవుతుంది. ఎల్‌బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించనున్నారు. లింగంపల్లి, బీహెచ్‌ఈఎల్ మీదుగా వచ్చే బస్సులను మియాపూర్ వరకు పరిమితం చేస్తారు. అలాగే హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం రూట్లలో వచ్చే బస్సులను ఎల్‌బీనగర్ వరకు పరిమితం చేస్తారు. ఈ కారిడార్‌లో సమాంతరంగా నడిచే బస్సులను ప్రయాణికుల రద్దీ, ఆదరణకు అనుగుణంగా రూట్ కోర్సుల్లో మార్పులు చేస్తారు. సమాంతర రూట్ బస్సులను కుదించడం వల్ల మెట్రోకు రెండు వైపులా ఉండే సుమారు 500 కాలనీలు, నగర శివారు ప్రాంతాలకు అదనపు సర్వీసులు పెంచనున్నారు. కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డినగర్, నందనవనం, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మీర్‌పేట్, కొహెడ, తదితర ప్రాంతాల్లోని కొత్త కాలనీలకు బస్సులను విస్తరిస్తారు. ఈ రూట్ల లోంచి ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్లకు సిటీ బస్సులను కనెక్ట్ చేస్తారు. అలాగే పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌కు, అటు లక్డీకాపూల్‌కు సిటీ బస్సుల కనెక్టివిటీ పెరగనుంది.
మియాపూర్‌లో పెరిగిన ఆక్యుపెన్సీ
ఉప్పల్– అమీర్‌పేట్– మియాపూర్ మెట్రో కారిడార్‌లో రెండు వైపులా కాలనీలకు మెట్రో అందుబాటులోకి రావడంతోనే ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టారు. చిలుకానగర్, హేమానగర్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఘట్కేసర్, నారపల్లి, తదితర ప్రాంతాలకు ట్రిప్పులను పెంచారు. అలాగే మియాపూర్ మార్గంలో అపురూపకాలనీ, హైటెక్‌సిటీ, జగద్గిరిగుట్ట, వీబీఐటీ, జేఎన్‌టీయూ, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, అమీర్‌పేట్– హైటెక్‌సిటీ, తదితర ప్రాంతాలకు 60 బస్సులను అదనంగా ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండు రూట్లలో కాలనీలకు బస్సుల కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు ఈ బస్సులన్నీ ప్రతి రోజు 70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. గతంలో 68 శాతం ఉన్న ఆక్యుపెన్సీ 2 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
తొలిరోజు 50 వేలు.. తర్వాత లక్ష మంది
సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 84 ట్రిప్పుల మెట్రో రైళ్లలో సుమారు 50 వేల మంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 గంట వరకు(16 గంటలు) ఐదు నిమిషాలకొకటి చొప్పున 192 మెట్రో రైళ్ల ట్రిప్పులు నడిచే అవకాశం ఉంది. ఈ రద్దీ లక్ష మంది వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆదివారం, ఇతర పర్వదినాలు, సెలవు రోజుల్లో రద్దీ లక్షకు మించుతుందని భావిస్తున్నారు.
స్పీడు పెరిగిన మెట్రో రైళ్లు..
కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ రావడంతో మెట్రో రైళ్ల వేగం ఊపందుకుంది. ప్రస్తుతం మెట్రో రైలు 60 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళుతున్నట్టు మెట్రో అధికారులు చెబుతున్నారు. మెట్రో రైళ్ల గరిష్ట వేగం 8 కేఎంపీహెచ్ అని చెబుతున్నారు. ప్రారంభంలో నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో 30–40 కేఎంపీహెచ్ వేగంతోమాత్రమే మెట్రో రైళ్లు రాకపోకలు సాగించగా.. ఇప్పుడు ఈ మార్గంలోనూ రైళ్ల వేగం 60 కేఎంపీహెచ్‌కు పెరిగిందని చెబుతున్నారు. ఇక ఎల్బీనగర్ నుంచి మెట్రోలో బయలుదేరిన వ్యక్తి కేవలం 52 నిమిషాల్లోనే 29 కి.మీ దూరంలో ఉన్న మియాపూర్‌కు చేరుకోవచ్చు. అదే బస్సు లేదా కారులో రెండు గంటల పాటు ట్రాఫిక్ రద్దీలో జర్నీ చేయక తప్పదు.
త్వరలో ఈ బైక్‌లు, అధునాతన సైకిళ్ల సేవలు..
ఈ మార్గంలోని 16 స్టేషన్ల వద్ద అధునాతన సైకిళ్లు, ఈ బైక్‌లు, కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోఉండే స్టేషన్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామని హెచ్‌ఎంఆర్ అధికారులు తెలిపారు. ఈ మార్గంలోని స్టేషన్ల వద్ద ఉబర్, ఓలా క్యాబ్ సర్వీసులు, ఆటోలు నిలుపుకునేందుకు వసతులు కల్పించడంతో పాటు, ప్రత్యేక బుకింగ్ కౌంటర్లను సైతం దశలవారీగా ఏర్పాటు చేస్తామన్నారు.
అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు
ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో మెట్రో రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే అందుబాటులో ఉన్నాయి. ఇక మియాపూర్–ఎల్బీనగర్ మార్గంలో ప్రముఖ విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఆస్పత్రులు, మార్కెట్లు ఉండడంతో పాటు ఈ మార్గం వివిధ రంగాలకు హబ్‌గా మారింది. ఈ రూట్లో నిత్యం లక్షలాది మంది ట్రాఫిక్ రద్దీలో ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న ఎల్బీనగర్ నుంచి ఏపీ రాజధాని అమరావతి సహా వివిధ ప్రధాన నగరాలకు నిత్యం 300 వరకు ప్రైవేటు ట్రావెల్ బస్సులు బయలుదేరి వెళతాయి. ఇవన్నీ అర్ధరాత్రి 12 దాటిన తరవాతే వెళుతుంటాయి. ఈనేపథ్యంలో ట్రావెల్స్ బస్సుల్లో వివిధ నగరాలకు బయలుదేరి వెళ్లే ప్రయాణికులు, ప్రధానం నగరం వచ్చి తిరిగి వెళ్లే ఉద్యోగులు, కార్మికుల సౌకర్యార్థం ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రోరైళ్లను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. కనీసం రాత్రి 10 గంటల తరవాత ఫ్రీక్వెన్సీ తగ్గించి 15 నిమిషాలకో రైలునైనా నడపాలని కోరుతున్నారు. ఈ విషయమై మెట్రో అధికారులను వివరణ కోరగా.. ప్రయాణికుల రద్దీ, డిమాండ్, మూడ్‌ను బట్టి రాత్రి 11.30 గంటల వరకు మెట్రోరైళ్లను నడిపే అవకాశాలున్నట్లు హెచ్‌ఎంఆర్ అధికారులు తెలిపారు. ఎప్పటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందో త్వరలో తెలియజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment