సాక్షి, హైదరాబాద్ : నగర ప్రజలు మెట్రో సేవలను వినియోగించుకోవాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ విజ్ఞప్తి చేశారు. సోమవారం అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రో కారిడర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలుష్యం తగ్గాలంటే మెట్రో ప్రయాణమే మంచిదన్నారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఉండదన్నారు. మెట్రో ప్రయాణం వల్ల అంబులెన్స్‌లు సహా అత్యవసర సేవల ప్రయాణాలకు ఆటంకం కలగదని తెలిపారు. మెట్రో స్టేషన్‌లలో అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయని, ఒక్క స్మార్ట్ కార్డ్ ద్వారా అన్ని సౌకర్యాలు పొందేలా చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులకు సూచించారు. డిసెంబర్ 15 లోగా హైటెక్ సిటీ మార్గాన్ని కూడా పూర్తి చేయాలని కోరారు. ఇది మన మెట్రో అని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
దేశంలోనే బెస్ట్ మెట్రో..
దేశంలోనే హైదరాబాద్ మెట్రో బెస్ట్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్రస్తుతం నగరంలో మెట్రో సేవలు 46 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రతి స్టేషన్ వద్ద పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. భద్రతా అనుమతులు వల్ల నెలరోజులు ఆలస్యమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment