పకడ్బందీగా ‘మన ప్రణాళిక’
మహబూబ్‌నగర్ టౌన్: ‘మనఊరు.. మన ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మరో మూడురోజుల్లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. రోజువారీగా చేపట్టిన వాటినే వెంటనే అప్‌లోడ్ చేయాలని సూచించినా.. కొందరు నిర్లక్ష్యం వహించడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. గురువారం మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1331 గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు కేవలం 400గ్రామాలకు చెందిన డాటా మాత్రమే అప్‌లోడ్ అయిందన్నారు.
ఈ విషయంపై ప్రత్యేకాధికారులు ప్రత్యేకదృష్టి సారించాలని, అవసరమైతే అదనపు కంప్యూటర్లను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామని, ఇందుకుగాను ప్రతి మండలంలో 10లక్షల మొక్కలను నాటాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమానికి ప్రతిఒక్కరూ ప్రాధాన్యమిస్తూ నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించాలన్నారు. రైతులు తమ తమ పొలాల్లో పండ్లమొక్కలతో పాటు ఇతర వాటిని నాటుకునేందుకు ప్రోత్సహించాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవీందర్, డ్వామా పీడీ హరితతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.