మన మార్కెట్‌కు ఆంధ్రా పసుపు | Andhra turmeric to our market | Sakshi
Sakshi News home page

మన మార్కెట్‌కు ఆంధ్రా పసుపు

Published Tue, Sep 9 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

Andhra turmeric to our market

మోర్తాడ్ :  ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో పండించిన పసుపు పంట నిజామాబాద్ మార్కెట్‌కు తరలివస్తోంది. అక్కడ డిమాండ్ లేకపోవడం వల్లే ఇందూరు మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దుగ్గిరాల, కడప ప్రాంతాలనుంచి వ్యాపారులు పసుపు పంటను తీసుకు వస్తున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పసుపు పంట ఆర్మూర్ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కడప, దుగ్గిరాల, తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతాలలో విస్తారంగా సాగవుతుంది.

అయితే ఆర్మూర్ ప్రాంతంలో పండించిన పసుపునకు మార్కెటింగ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. నిజామాబాద్, సాంగ్లీ మార్కెట్‌లకు జాతీయ స్థాయి వ్యాపారులు వచ్చి పసుపు పంటను కొనుగోలు చేస్తారు. దీంతో కడప, దుగ్గిరాల ప్రాంతాలలోని వ్యాపారులు పసుపును ఇక్కడికి తరలించి విక్రయిస్తున్నారు.

 ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా పసుపు దిగుబడులు అంతగా ఉండే అవకాశం లేదని వ్యాపారులు భావిస్తున్నారు. పసుపు మార్కెట్ ఆరంభం అయిన తర్వాత పంటకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో పసుపు పంట లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకుని నిల్వ చేసుకుంటున్నారు.

క్వింటాలుకు రూ. 5 వేలనుంచి రూ. 5,500 వరకు చెల్లిస్తున్నారు. కొందరు వ్యాపారులు ఇలా కొనుగోలు చేసిన పంటను కోల్‌కతా, ముంబయి ప్రాంతాలలోని పారిశ్రామిక సంస్థలకు విక్రయిస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు విక్రయాలు సాగుతున్నాయని గుర్తించిన కడప, దుగ్గిరాల వ్యాపారులు అక్కడి రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి మన మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు ఐదు లారీల్లో పసుపు పంట పొరుగు రాష్ట్రం నుంచి మన మార్కెట్‌కు తరలివచ్చిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. నిజామాబాద్ మార్కెట్‌లో క్రయవిక్రయాలు స్తబ్ధంగా ఉన్న సమయంలో పొరుగు రాష్ట్రం నుంచి పసుపు తరలిరావడంపై వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement