
సాక్షి, చార్మినార్ : నిత్యం సందడిగా ఉండే జూ పార్కులో లాక్‌డౌన్ కారణంగా నిశ్శబ్దం ఆవహించింది. మామూలు సమయంలో వన్యప్రాణులను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చేవారు. వాటిని చూసిన ఆనందంలో చిన్నారుల కేరింతలు, అరుపులతో ఆ ప్రాంతం మార్మోగేది. కరోనా వైరస్ నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు జూ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎండాకాలం కావడంతో వేడి నుంచి కాపాడేందుకు చర్యలు చేపట్టారు. వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. జూపార్కులో సందర్శకులు లేకపోవడంతో వన్యప్రాణులు ఎంజాయ్ చేస్తున్నాయి. ఫుల్ జోష్‌తో ఉండటంతో పాటు అడవిలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నాయి.
నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని జంతువులు రోజంతా హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి. లాక్‌డౌన్ ప్రభావం ఇక్కడి జూ పార్కులో కనిపించడం లేదు. ఎలాంటి టెన్షన్ లేకుండా వణ్యప్రాణాలు సరదాగా గడుపుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా విజిటర్స్‌కు అనుమతి లేకపోయినప్పటికీ.. జూలో ఎప్పటిలాగే కార్యకాలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు విజిటర్స్‌తో సందడిగా ఉండే జూపార్కు.. కొద్దిరోజులుగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. విజిటర్స్ చప్పుళ్లు, చిన్నారుల కేరింతలు, బ్యాటరీ వాహనాల రాకపోకలు, చిట్టిరైలు ప్రయాణాలతో జూపార్కులో సందడే.. సందడి. ఇవ్వన్నీ ఇక్కడి జంతువులన్నీ అలవాటైపోయాయి.(మ...మ... మాస్క్... టీమిండియా ఫోర్స్!)
ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. విజిటర్స్ ఎవరూ రాకపోవడంతో ప్రతిరోజు ఎన్‌క్లోజర్ల వద్దకు యానిమల్ కీపర్స్, వెటర్నరీ డాక్టర్స్ ఇతర సిబ్బంది వెళ్తున్నారు. వీరితోనే కాలక్షేపం చేస్తున్న జంతువులకు ఎక్కడ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు, యానిమల్ కీపర్లు ఇతర సిబ్బంది రౌండ్ ది క్లాక్ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం జూలోని జంతువులన్నీ ప్రశాంతంగా గడుపుతున్నాయి. వేళకు ఫీడింగ్ అయిపోగానే.. ఎన్‌క్లోజర్స్‌లో కాలక్షేపం చేస్తున్నాయి. డే ఎన్‌క్లోజర్స్ సమయం ముగియగానే.. నైట్ ఎన్‌క్లోజర్స్‌లోకి వెళ్తున్నాయి.
విజిటర్స్ లేనంత మాత్రానే జూలోని జంతువులను నైట్ ఎన్‌క్లోజర్స్‌కు పరిమితం చేయడం లేదు. యథావిధిగానే రోజువారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గుహలకే పరిమితం కావడం లేదు. వాటి ఎన్‌క్లొజర్స్‌లలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఉదయం 10:30 గంటల కల్లా ఫీడింగ్ పూర్తి కాగానే జంతువులను రిలీజ్ చేస్తూ.. సాయంత్రం 4:30 గంటలకు తిరిగి నైట్ ఎన్‌క్లోజర్‌లకు పంపిస్తున్నారు. లాక్‌డౌన్ పీరియడ్‌లో.. గర్భినిగా ఉన్న సైనా అనే ఎల్లో టైగర్ పండంటి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అలాగే నక్క జాతికి చెందిన జకాల్ అనే జంతువు 6 పిల్లలకు జన్మనిచ్చింది.
కట్టుదిట్టమైన చర్యలు..
నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని వన్యప్రాణులపై కోవిడ్–19 వైరస్ ప్రభావం పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా న్యూయార్క్‌లో ఓ పెద్ద పులికి కరోనా వైరస్ వచ్చినట్లు వార్తలు రావడంతో జూపార్కులోని అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ క్రిమిసంహారక మందులైన సోడియం హైపో క్లోరైడ్‌ను పిచికారీ చేస్తున్నారు. వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తున్నారు. యానిమల్ కీపర్లు మాస్క్‌లు, గ్లౌజ్‌లతో పాటు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లను వాడుతూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. సెంట్రల్ జూ అథారిటీ, పీసీసీఎఫ్ అధికారుల సూచన మేరకు జూలో కరోనా వ్యాప్తి చెందకుండా నెల నుంచే ఈ ముందు జాగ్రత్త చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రతిరోజు బయటి నుంచి జూపార్కులోకి వచ్చి విధినిర్వాహణ కొనసాగించే సిబ్బంది ద్వారా వణ్యప్రాణులకు ఎలాంటి వైరస్ ఎఫెక్ట్ లేకుండా ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. జూపార్కులోని సిబ్బందికి జూ సర్వీస్ గేట్ వద్ద థర్మల్ స్కానింగ్ జరుపుతున్నారు. అంతేగాకుండా ఎన్‌క్లోజర్‌ల వద్ద ఫూట్ బాత్ నిర్వహిస్తున్నారు. యాంటీ వైరస్ పౌడర్‌ను చల్లుతున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కూలర్స్‌తో పాటు నీటి తుంపర్లతో పిచికారీ చేస్తున్నారు.
ప్రతి 2 గంటలకు ఆరోగ్య సమాచార సేకరణ..
కోవిడ్–19 ప్రభావం జంతువులపై పడకుండా జూ క్యూరేటర్ ఎప్పటికప్పుడు జూలోని వెటర్నరీ వైద్యుల ద్వారా ప్రతి రెండు గంటలకు ఆరోగ్య సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఓ వైపు కోవిడ్ వైరస్.. మరోవైపు వేసవి కాలం కావడంతో జూలోని జంతువుల ఆరోగ్యంపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. విజిటర్స్ లేకపోయినా.. ప్రతిరోజు 120 మంది వరకు యానిమల్ కీపర్స్ జూలో విధినిర్వాహణ కొనసాగిస్తుంటారు. వీరందరూ ఆయా ఎనిమల్స్ ఎన్‌క్లోజర్స్ వద్దకు వెళ్లి జంతువులకు అవసరమైన ఫీడింగ్, ఇతర ఏర్పాట్లను చేస్తుంటారు. తద్వారా జంతువులకు కరోనా వైరస్ సోకకుండా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. జంతువుల్లో రోగ నిరోధక శక్తి పెరగడానికి శుభ్రమైన నీటిలో గ్లూకోన్ డీ, కొబ్బరి బోండాం, వాటర్ మిలన్, సీ విటన్ కోసం సంత్రాలు, ఆరేంజ్ పళ్లను అందిస్తున్నామని జూ అధికారులు తెలిపారు. జూపార్కులోని వన్యప్రాణులకు కరోనా వైరస్ సోకకుండా ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నారు. జూ పార్కులోని వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో కరోనా లక్షణాలను పరిశీలించడంతో పాటు వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు.