అంతా భ్రాంతియేనా కామ్రేడ్...
రాష్ట్రంలో ప్రధాన వామపక్షపార్టీలైన సీపీఐ, సీపీఎంల మధ్య స్నేహం మళ్లీ మొదటికి వచ్చిందని ఆ పార్టీల నాయకులే లోలోపల గొణుక్కుంటున్నారట. వామపక్ష ఐక్యత అంటూ ప్రచారం చేయడం ఎప్పటికప్పుడు అది మూణ్ణాళ్ల ముచ్చటగా మారడం ఒక రివాజుగా మారిపోతున్నదని వాపోతున్నారు. మళ్లీ తాజాగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రూపంలో రెండుపార్టీల మధ్య మిత్రత్వానికి పరీక్ష ఏర్పడిందని వారు తలలు పట్టుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో ఈ రెండుపార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట. జాతీయ స్థాయిలో ఒక విధానం, బెంగాల్, కేరళలో మరో విధానం, ఏపీ, తెలంగాణలో ఇంకొక విధానం అన్నట్లుగా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయని ఈ పార్టీల నేతలే పెదవివిరుస్తున్నారట. పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీని ఓడించేందుకు ప్రజాస్వామ్య శక్తులంతా ఒకటి కావాలంటూ పరోక్షంగా కాంగ్రెస్‌తో మిత్రత్వానికి సంకేతాలిస్తూ, తెలంగాణలో ఖమ్మం కార్పొరేషన్ వరకైనా కాంగ్రెస్‌తో సీపీఎం దోస్తీకి అడ్డం వచ్చిందంటూ సీపీఐనాయకులు ప్రశ్నిస్తున్నారట. మరోవైపు ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతును తీసుకున్న సీపీఐ ఇప్పుడు కూడా ఆ పార్టీతోనే పోతుందని, ఇంకా వామపక్ష ఐక్యత ముందంటూ సీపీఎం నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారట. ఎక్కడైనా బావ కాని వంగతోట వద్ద కాదు అన్న సామెతను నిజం చేస్తూ ఎక్కడైనా మిత్రత్వం కాని ఎన్నికలపుడు కాదన్న చందంగా వామపక్షాల తీరు తయారైందని ఈ రాజకీయాలను దగ్గరగా గమనిస్తున్నవారు వ్యాఖ్యానించడం కొసమెరుపు...