
రిజిస్ట్రేషన్ల శాఖలో ‘ఎనీవేర్’ దందా!
♦ రూ.6వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పరం
♦ 615 ఎకరాల ప్రభుత్వ భూమిని బుక్ 4లో రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు
♦ కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు, క్రిమినల్ కేసు నమోదు
♦ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
♦ రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సుమారు రూ.6 వేల కోట్ల విలువైన 615 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. రిజిస్ట్రేషన్ల శాఖలోని ‘ఎనీవేర్’ వెసులుబాటుతో కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ నిషేధిత ఆస్తుల జాబితాలోని ప్రభుత్వ భూములను సైతం ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. వాస్తవానికి ఈ భూమి రంగారెడ్డి ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోనిది. ఈ వ్యవహారం ఏడాది క్రితమే జరిగినప్పటికీ, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు మనకెందుకులే అని కళ్లు మూసుకుని కూర్చున్నారు.
గురువారం ముఖ్యనేత ఒకరు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటికçప్పుడు విచారణ జరిపించి కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ అక్రమాలను అధికారులు బట్టబయలు చేశారు. వాస్తవానికి గత కొన్నేళ్లుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఎనీవేర్ దందా య«థేచ్ఛగా కొనసాగుతున్నా, పర్యవేక్షణాధికారులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ కిమ్మనడం లేదు. అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్లు, తాము దోచుకున్న దాంట్లో పై అధికారులకు ఎంతో కొంత ముట్టజెబుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
అక్రమాలకు పాల్పడుతున్న సబ్ రిజిస్ట్రార్లకు రాజకీయ అండదండలు కూడా ఉంటుండడంతో, అక్రమార్కులపై ఏదైనా చర్యలు చేపట్టాలంటే జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు, ఆఖరుకు కమిషనర్ స్థాయి వ్యక్తులు కూడా జంకుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖలో ఇటీవల బయటపడిన బోధన్ స్కామ్ కంటే, రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న ఎనీవేర్ దందా ఎన్నో రెట్లు పెద్ద స్కామ్ అని రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది చెబుతున్నారు. బోధన్ స్కామ్‌ను విచారించినట్లుగానే రిజిస్ట్రేషన్ల శాఖలో జరిగిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్లను సీఐడీతో విచారణ జరిపిస్తే మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.
సువిశాల్ పవర్ పేరిట బదిలీ...
సదరు భూమిపై తమకు షన ద్ హక్కులున్నాయంటూ అమీరున్నిసా బేగం మరో ఏడుగురు వ్యక్తులు తమ హక్కులను సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్ పేరిట ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు రిజిస్ట్రేషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఏదేని స్థిరాస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలను బుక్ 1లో నమోదు చేయాల్సి ఉండగా, ఈ అక్రమాలు ఎప్పటికీ బయట పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఆ వివరాలను చరాస్తులను రిజిస్ట్రేషన్ చేసే బుక్ 4లో నమోదు చేశారు.
సర్వే నంబరు 20లో 109 ఎకరాలు, 28లో145 ఎకరాలు, 44లో 25 ఎకరాలు, 45లో 98 ఎకరాలు,100లో 207 ఎకరాలు, 101లో 231 ఎకరాల ప్రభుత్వభూమి అన్యాక్రాంతమైనట్లు జిల్లా రిజిస్ట్రార్(ఆడిట్) ఉన్నతాధికారులకు అందించిన నివేదికలో పేర్కొన్నారు. నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేయడమేకాకుండా ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన స్టాంప్‌డ్యూటీ మినహాయింపుతో రిజిస్ట్రేషన్ల శాఖకు దాదాపు రూ.415.70 కోట్ల మేరకు గండి పడేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. భూములను కొనుగోలు చేసిన సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్ కంపెనీ తరఫున మేనేజర్ పీవీఎస్ శర్మ రిజిస్ట్రేషన్‌కు హాజరైనట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అక్రమంగా రిజిస్టర్ చేసిన ఆరు డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ల శాఖ రద్దు చేసింది.
సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు
కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చిన రిజిస్టేషన్ల శాఖ ఉన్నతాధికారులు అప్పటికప్పుడు క్రమశిక్షణ చర్యలు కూడా చేపట్టారు. నిషేధిత ఆస్తుల జాబితాలోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం సెక్షన్ 22 ఏ రిజిస్ట్రేషన్ల చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ సబ్ రిజిస్ట్రార్ ఆర్. శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. అంతేకాకుండా శ్రీనివాసరావుపై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు పెట్టారు. ఆయనను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై విచారణ చేసిన మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్(ఆడిట్) ఇచ్చిన నివేదిక ప్రకారం 2016 జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 6 డాక్యుమెంట్ల ద్వారా 615 ఎకరాల ప్రభుత్వ భూమిని సదరు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు.