సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో సుమారు 600 మేర అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి త్వరలో ఉమ్మడి ప్రకటన జారీ కానుంది. రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)లలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంతకుముందు విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీ కోసం ఒకేసారి వేర్వేరుగా నియామక ప్రకట నలు జారీ చేయడం పలు సమస్యలకు దారి తీసింది. దాంతో ఉమ్మడి నియామక ప్రకటనల ద్వారా ఏఈ పోస్టుల భర్తీ చేపట్టాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయిం చాయి. తమ పరిధిలోని ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో ఏఈ పోస్టుల ఖాళీలను గుర్తించి భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి.
ఏఈ మిగులు పోస్టుల భర్తీ పూర్తి
రాష్ట్ర విద్యుత్ సంస్థలు రెండేళ్ల కింద 1,427 ఏఈ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ల కింద నియామకాలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. తెలంగాణ జెన్‌కోలో 856, ట్రాన్స్‌కోలో 206, ఎన్పీడీసీఎల్‌లో 164, ఎస్పీడీసీఎల్‌లో 201 పోస్టులు కలిపి మొత్తం 1,427 ఏఈ పోస్టుల భర్తీకి ఆయా విద్యుత్ సంస్థలు ఒకేసారి వేర్వేరుగా నియామక ప్రకటనలు జారీ చేశాయి. అయితే కొందరు అభ్యర్థులు రెండు, మూడు సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాంటివారు ఏదో ఒక సంస్థలో చేరగా.. మిగతా సంస్థల్లో వారికి సంబంధించిన పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.
టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో నియామకాలు ఆలస్యం కావడంతో అభ్యర్థులు ఇతర సంస్థల్లో చేరిపోయారు. దాంతో ఇందులోని 164 ఏఈ పోస్టులకుగాను ఏకంగా 107 పోస్టులు ఖాళీగా మిగిలాయి. ట్రాన్స్‌కోలో 206 పోస్టులకుగాను 59, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 201 పోస్టులకుగాను 73 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. ఇలా మిగిలిన 239 పోస్టులను రెండో మెరిట్ జాబితాతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం వివాదాలకు దారితీసింది. దాంతో సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక మినహాయింపు పొంది ఈ 239 పోస్టులను రెండో మెరిట్ జాబితాతో భర్తీ చేయాల్సి వచ్చింది. ఇందులోనూ కొందరు ఉద్యోగంలో చేరేందుకు ముందుకు రాకపోవడంతో మూడో మెరిట్ జాబితాను ప్రకటించారు. ఎట్టకేలకు రెండో, మూడో మెరిట్ జాబితాల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ట్రాన్స్‌కో గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment