ఎన్నికల హామీలు అమలు చేయాలి
తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు : ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీ లు, మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని, ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తామని, ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు భూములు ఇస్తామని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
వాగ్దానాలు చేసిన ప్రజాసమస్యలను పరిష్కరించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య విగ్రహాలను హైదరాబా ద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. నీతి, నిజాయితీగా ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తే తమ పార్టీ తరఫున సహకారం ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఎమ్యెల్యేగా ఉన్నా తెలంగాణ ఉద్యమం వల్ల నియోజవర్గా న్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని, ఈసారి అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. సమావేశంలో నాయకులు డాక్టర్ సోమేశ్వర్‌రావు, నరేందర్‌రెడ్డి, జలగం శ్రీను, రాజేశ్‌నాయక్, దారావత్ సోమన్న, గుండా సోమయ్య తదితరులు పాల్గొన్నారు.