ఏప్రిల్ 1 విడుదల | April 1 release | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 1 విడుదల

Published Thu, Mar 19 2015 1:47 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

ఏప్రిల్ 1 విడుదల - Sakshi

ఏప్రిల్ 1 విడుదల

  • పీఆర్‌సీ అమలుకు రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు
  • వేతన సవరణ వర్తింపజేస్తూ మార్గదర్శకాలు
  • పీఆర్‌సీ బకాయిలపై ఇంకా తేల్చని సర్కారు
  • చెల్లించే విధానంపై మల్లగుల్లాలు, తర్వాతే ప్రత్యేకంగా జీవో
  • వెంటనే స్పష్టతనివ్వాలని ఉద్యోగ సంఘాల డిమాండ్
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదో వేతన సవరణ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల కమిషన్ కొర్రీలకు సమాధానాలు, న్యాయ శాఖతో సంప్రదింపుల అనంతరం ఆర్థిక శాఖ ఎట్టకేలకు బుధవారం జీవోలు జారీ చేసింది. ప్రధాన జీవోకు అనుబంధంగా కరువు భత్యం(డీఏ), హౌజ్ రెంట్ అలవెన్స్(హెచ్‌ఆర్‌ఏ), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(సీసీఏ)లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఉత్వర్వులిచ్చింది. దీన్ని తెలంగాణ పీఆర్‌సీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ మేరకు 2013 జూలైనుంచి వేతన సవరణను అమలు చేస్తూ మార్గదర్శకాలను రూపొందించింది. ఏప్రిల్ ఒకటిన ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. అయితే 2014 జూన్ 2 నుంచి గత నెల వరకు చెల్లించాల్సిన వేతన సవరణ బకాయిల విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు పేర్కొనడం గమనార్హం. అలాగే పెన్షనర్లకు సంబంధించిన వివరాలను కూడా తాజా ఉత్తర్వుల్లో పొందుపరచలేదు. మరోవైపు బకాయిల వ్యవహారాన్ని తేల్చకుండా, ఉత్తర్వులను ఇవ్వకుండా వేతన స్థిరీకరణ, ఇంక్రిమెంట్ల నిర్ధారణ సాధ్యమే కాదని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. దీన్ని బట్టి మార్చి నెలకు కొత్త వేతనాలను అందించడం కుదరదని ఆందోళన వ్యక్తం చేశాయి. బకాయిలను జీపీఎఫ్‌లో కలిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని, బాండ్ల పేరుతో మోసం చేయొద్దని పేర్కొన్నాయి. సీఎం హామీ మేరకు అమలు చేయకుంటే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించాయి.
     
    అసమగ్ర ఉత్తర్వులు

    తాజా ఉత్తర్వుల్లో శాఖలవారీగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు వర్తించే సమగ్ర స్కేళ్ల వివరాలు లేకపోవడం కొంత గందరగోళానికి దారి తీసింది. మరో ప్రధానమైన ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీంకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేయలేదు. దీంతో పాటు వేతన స్థిరీకరణ విధివిధానాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా మెమో జారీ చేయాల్సి ఉంది. బకాయిల జీవోతో ఇంక్రిమెంట్లు ముడిపడి ఉంటాయని.. ఈ ఉత్తర్వులన్నీ విడుదలైతే తప్ప వేతన స్థిరీకరణ ప్రక్రియ మొదలు కాదు. ఇది ఆలస్యమైతే ఏప్రిల్ ఒకటిన కొత్త జీతాలు అందుకునే పరిస్థితి ఉండదని, మరో నెల ఆలస్యమవుతుందని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి.
     
    ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం: ఈటెల

    ఉద్యోగ సంఘాలతో చర్చించి, వారి సలహాలు, సూచనలకు అనుగుణంగా ఫిట్‌మెంట్ బకాయిల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. బకాయిలను నగదు రూపంలో కాకుండా, బాండ్ల రూపంలో చెల్లిస్తున్నట్లు ఒక పత్రికలో(సాక్షికాదు) వచ్చిన వార్త బుధవారం శాసన మండలిలో ప్రస్తావనకు రావడంతో మంత్రి వివరణ ఇచ్చారు. గిట్టనివాళ్లు దుర్బుద్ధితో మెలికపెడుతున్నారని విమర్శించారు. బకాయిల చెల్లింపునకు విధివిధానాల జీవోను అతి త్వరలోనే జారీ చేస్తామని ఈటెల చెప్పారు.
     
    ఉద్యోగ సంఘాల్లో ఆందోళన

    వేతన బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేయాలి. బాండ్ల రూపంలో ఇచ్చేందుకు కసరత్తు చేయడం సరికాదు. సీఎం తన హామీని నిలబెట్టుకోవాలి. బాండ్ల రూపంలో ఇస్తామంటే ఆందోళనలను కొనసాగిస్తాం. అలాగే అటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీం, ఇతర అలవెన్సుల ఉత్తర్వులు ఇవ్వలేదు.
    - వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, టీఎస్‌పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు; మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి; నర్సిరెడ్డి, రవి, టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి; రాజిరెడ్డి, భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు; హర్షవర్ధన్‌రెడ్డి, టీ-పీఆర్‌టీయూ అధ్యక్షుడు
     
    బకాయిలపై తర్జనభర్జన

    ఉద్యోగుల పీఆర్‌సీ బకాయిలను చెల్లించే విధానంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అందుకే 2014 జూన్ 2 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉన్న బకాయిలకు సంబంధించి తదుపరి ప్రత్యేక ఉత్తర్వులు విడుదలవుతాయని పేర్కొంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం దాదాపు రూ. 10 వేల కోట్లకు చేరుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. అంత మొత్తాన్ని ఒక్కసారిగా చెల్లించడం ఇబ్బందిగా మారుతుందని అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బకాయిలను విడతలవారీగా చెల్లించాలా, బాండ్ల రూపంలో ఇవ్వాలా, జీపీఎఫ్‌లో జమ చేయాలా అన్న దానిపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈలోగా పీఆర్‌సీ అమలు ఆలస్యం కాకూడదని సీఎం చేసిన సూచనల మేరకు ఆర్థిక శాఖ హుటాహుటిన ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ ఉత్తర్వులు వస్తేనే బకాయిల చెల్లింపుపై స్పష్టత రానుంది.
     
    సీఎం హామీ మేరకు జీవోలు

    సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని జీవోలు కూడా ఒకట్రెండు రోజుల్లో వస్తాయి. బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేలా ఉత్తర్వులు ఇస్తారన్న నమ్మకం ఉంది. రగ్రాట్యుటీని రూ. 15 లక్షలకు పెంచాలి.            
    - వి.మమత, సత్యనారాయణ, టీజీఓ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు; రవీందర్‌రెడ్డి, టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శి
     
    ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు

    2013 జూలై నుంచి ఉన్న మూల వేతనానికి 43 శాతం ఫిట్‌మెంట్‌ను, 63.344 శాతం కరువు భతాన్ని విలీనం చేసి మూల వేతనాన్ని స్థిరీకరిస్తారు.
     
    2013 జూలై నుంచి 2014 జూన్ ఒకటో తేదీ వరకు పీఆర్‌సీని నోషనల్‌గా వర్తింపజేస్తారు. ఆ తర్వాత కాలానికి  వేతన సవరణ అమలవుతుంది. వచ్చే ఏప్రిల్ ఒకటిన(మార్చి నెలకు) కొత్త జీతం అందుతుంది.
     
    2014 జనవరి నుంచి 2014 జూన్ ఒకటి వరకు ఉద్యోగులు పొందిన మధ్యంతర భృతి(ఐఆర్)ను రికవరీ చేయరు. ఆ తర్వాత చెల్లించిన మధ్యంతర భృతి మొత్తాన్ని త్వరలో చెల్లించనున్న బకాయిల్లో నుంచి ప్రభుత్వం తిరిగి రాబట్టుకుంటుంది.
     
    ఉద్యోగులకు పెరిగిన మూల వేతనాలపై 2014 జనవరి 1 నుంచి 5.24 శాతం డీఏ, 2014 జూలై 1 నుంచి 8.908 శాతం డీఏ వర్తిస్తుంది.
     
    సీసీఏ కింద హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతన పరిమితిని బట్టి రూ. 400 నుంచి వెయ్యి రూపాయల వరకు చెల్లిస్తారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, వరంగల్ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రూ. 200 నుంచి రూ. 500 వరకు అలవెన్స్ చెల్లిస్తారు.
     
    తాజా ఉత్తర్వుల ప్రకారం సవరించిన మాస్టర్ స్కేలును సైతం నిర్దేశించారు. ప్రస్తుతమున్న 32 గ్రేడ్‌లు, 80 సెగ్మెంట్లను యథాతథంగా కొనసాగిస్తూ.. కనిష్టంగా రూ. 13 వేలు, గరిష్టంగా రూ. 1,10,850 వరకు మాస్టర్ స్కేలు పరిధిని పొందుపరిచారు.
     
    హెచ్‌ఆర్‌ఏ గరిష్ట పరిమితి పెంపు

    ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్‌ఆర్‌ఏ స్లాబుల్లో మార్పులేమీ లేవు. గరిష్ట పరిమితిని మాత్రం రూ. 12 వేల నుంచి రూ. 20 వేలకు, అలాగే రూ. 8 వేల నుంచి రూ. 15 వేలకు పెంచారు. నగరాలు, పట్టణాలకు సంబంధించి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో నివాసముంటున్న వారందరికీ అదే హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మూల వేతనంలో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్ కార్పొరేషన్‌ల పరిధిలో 20 శాతం, ఆదిలాబాద్, కాగజ్‌నగర్, నిర్మల్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిద్దిపేట, జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, తాండూరు, వనపర్తి, గద్వాల్, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, జనగాం, పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల పరిధిలో 14.5 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుంది. మిగతా ప్రాంతాల్లో 12 శాతం చెల్లిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement