ఏప్రిల్‌దాకా ఉద్యోగుల బదిలీలుండవు
- స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ వరకు ఉద్యోగులు, ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, హరితహారం, ఆహార భద్రతాకార్డుల మంజూరు, రహదారుల నిర్మాణం వంటి ప్రధాన కార్యక్రమాలు డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉన్నందున.. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని ఎక్కడికీ బదిలీ చేయబోమని, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమాలపైనే దృష్టి కేంద్రీకరించాలని సీఎం ఆదేశించారు.
సోమవారం సచివాలయంలో జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన స్పష్టతనిచ్చారు. ఏప్రిల్ వరకు బదిలీల గురించి ఆలోచించవద్దని చెప్పినట్లు ఓ ఉన్నతాధికారి వివరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తరువాత సిబ్బంది కాని, ఉన్నతాధికారుల బదిలీలుకాని పెద్ద ఎత్తున చేపట్టని విషయం తెలిసిందే.
ఇదివరలో ఒకే దఫాలో 99 మంది డీఎస్పీల బదిలీలు, ప్రారంభంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు మినహా,, రాష్ట్ర కేడర్‌లోకాని, దిగవస్థాయిలోకాని అధికారుల బదిలీలను పెద్దఎత్తున చేపట్టలేదు. ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది.