రాష్ట్రీయ మహిళాకోశ్ రుణం చెల్లించకపోవడంతో కేసు నమోదు
కొత్తగూడెం, న్యూస్‌లైన్: డ్వాక్రా మహిళలకు అందించిన రుణాలు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన మహిళా సమాఖ్యల సభ్యులకు అరెస్టు వారెంట్లు జారీచేసింది. రాష్ట్రీయ మహిళాకోశ్ నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడం, రుణానికి పూచీకత్తుగా ఉన్న బ్యాంకు చెక్కులు బౌన్స్ కావడంతో ఢిల్లీ పోలీసులు వారెంట్లతో జిల్లాకు వచ్చారు. వివరాలివీ.. 2007లో జిల్లాలోని 14 మండల సమాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ మహిళా కోశ్ నుంచి ఒక్కో మండలానికి రూ.50 లక్షల చొప్పున రుణం ఇచ్చింది.
మహిళా కోశ్ అధికారులు 50 పైసల వడ్డీకి ఈ రుణాలను అందించగా, సమాఖ్యలు వీవోలకు రూ.1 చొప్పున ఈ రుణాలను పంపిణీ చేశారుు. వీవోలు డ్వాక్రా సంఘాలకు రూ.1.50వడ్డీ చొప్పున అందించారు. ప్రతినెలా డ్వాక్రా సంఘాలు చెల్లించిన రుణాలను వీవోలు సేకరించి వాటిని సమాఖ్యలకు అందించాల్సి ఉం టుంది. ఈ రుణాలిచ్చేందుకు అగ్రిమెంట్‌తోపాటు మండల సమాఖ్యల నుంచి ఖాళీ చెక్‌లను తీసుకున్నారు. ముందస్తు ఒప్పందం ప్రకారం 2014 జనవరిలోగా ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే జిల్లాలోని కొత్తగూడెం, కామేపల్లి, చింతకాని, బోనకల్ మండలాలకు చెందిన సమాఖ్యలు పూర్తిగా చెల్లించలేదు.
కొత్తగూడెం మండల సమాఖ్య ఇప్పటికి రూ.30 లక్షలు చెల్లించగా రూ.26 లక్షల బకాయి ఉంది. కామేపల్లి సమాఖ్య రూ.20 లక్షలు, చింతకాని మండల సమాఖ్య రూ.40 లక్షలు, బోనకల్ మండల సమాఖ్య రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంది. రుణ కాలపరిమితి ముగియడంతో రాష్ట్రీయ స్వయం కోశ్ అధికారులు మండల సమాఖ్యలు ఇచ్చిన చెక్కులను బ్యాంక్‌లో వేయగా, అవి బౌన్సయ్యాయి. దీంతో సమాఖ్య సభ్యులకు అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఢిల్లీ పోలీసులు శనివారం జిల్లాకు చేరుకుని వారికి నోటీసులు అందించారు. జూన్ 4న ఢిల్లీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌నాయక్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా బకాయి పడిన మండల సమాఖ్యలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై మండల సమాఖ్యలతో చర్చించి రుణం తిరిగి చెల్లించేలా చూస్తామని తెలిపారు.
ఐకేపీ మహిళలకు అరెస్ట్ వారెంట్
Published Sun, Jun 1 2014 2:20 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM
Advertisement
Advertisement