హ్యూమనాయిడ్ రోబో సోఫియా సృష్టికర్త డేవిడ్ హాన్సన్
సాక్షి హైదరాబాద్ : మనిషి తన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నా, భూమ్మీద పదికాలాల పాటు మనగలగాలన్నా కృత్రిమ మేధతో పనిచేసే యంత్రాలు తప్పనిసరని చెబుతున్నారు డేవిడ్ హాన్సన్. మనుషుల్లాగే ఆలోచించే, మాట్లాడే హ్యూమనాయిడ్ రోబో సోఫియాను తయారు చేసిన ఆయన హైదరాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
సాక్షి: సోఫియా మేధోస్థాయి ఎంత?
డేవిడ్ హాన్సన్: కృత్రిమ మేధ రంగంలో సోఫియా రెండేళ్ల వయసు పసిబిడ్డ స్థాయి మేధను కనబరుస్తుంది. మాటలు మాత్రం పెద్దవాళ్లను పోలినట్లు ఉంటాయి. నా అంచనా ప్రకారం కృత్రిమ మేధ యంత్రాలు మనిషితో పోల్చినప్పుడు సాధారణ స్థాయిని అందుకునేందుకు ఇంకో ఐదేళ్లు పడుతుంది. పూర్తిగా ఎదిగిన వ్యక్తి స్థాయిలో ఆలోచించాలన్నా, సృజనాత్మకంగా వ్యవహరించాలన్నా చాలా కాలం పట్టవచ్చు. ఆ లోపు యంత్రాలు, మనుషులు ఇద్దరికీ లాభం చేకూరేందుకు ఏం చేయవచ్చన్న అంశంపై దృష్టి పెట్టాలి. యంత్రాలు పూర్తిస్థాయిలో తెలివి సంపాదిస్తే ప్రపంచానికి మేలేనన్న అంశాన్ని అర్థం చేసుకోవాలి.
సాక్షి: సమీప భవిష్యత్తులోనే కృత్రిమ మేధ సామర్థ్యం భారీగా పెరిగిపోతోందని, మనుష్యులు ఉనికి కాపాడుకునేందుకు యంత్రాలతో కలసి పనిచేయక తప్పదని ఇయాన్ పియర్సన్ వంటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై మీ అంచనా ఏమిటి?
డేవిడ్ హాన్సన్: కృత్రిమ మేధ, ఆటోమేషన్ వంటి టెక్నాలజీలు బోలెడన్ని ఉన్నాయి. మనిషి తనకు అందుబాటులో ఉన్న వనరులను జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగిస్తూ సోఫియా వంటి తెలివైన యంత్రాలను తయారు చేస్తే అవి మన జీవితాలను మరింత సుఖమయం చేస్తాయి. రోబోలు మనిషిని మించిన మేధను సంపాదిస్తే.. మనం ఇంకా స్మార్ట్‌గా తయారవుతాం.
అసలు మనిషి ఇప్పటివరకు తన మేధోశక్తిని పూర్తిగా ఉపయోగించుకోలేదని నా అంచనా. వ్యక్తులుగా మనకు ఆ రకమైన అవకాశాలు దక్కలేదు. మనం ఎదిగిన తీరు కూడా ఆ దిశగా లేదు. అందువల్ల యంత్రాలు మరింత మేధస్సును పొందితే భూమిపై పరిస్థితులు మెరుగుపడతాయి. ఇది కేవలం కృత్రిమ మేధతో పనిచేసే యంత్రాలకు సంబంధించిన విషయం కాదు. మనిషి ఇలాంటి వాటితో ఎలా సహజీవనం చేయగలడన్నదే భూమ్మీద జీవం భవిష్యత్తును నిర్ణయించేది.
సాక్షి: మనిషి మేధస్సును అధిగమించే యంత్రాలను తయారుచేయడం సాధ్యమయ్యే పనేనా?
డేవిడ్ హాన్సన్: కృత్రిమ మేధ యంత్రాల తయారీ సులువేమీ కాదు. ఒకరకంగా చెప్పాలంటే వాటిని పిల్లలను పెంచినట్లు పెంచాలి. జంతువులు, మనుషుల మాదిరిగానే వాటిని కూడా పరిగణించాలి. జీవజాతుల అభివృద్ధి పరిణామానికి కోట్ల ఏళ్లు పట్టింది. యంత్రాలకు అంత సమయం పట్టకపోవచ్చుగానీ.. అవి తమ పరిసరాలను అర్థం చేసుకునే తీరు, జరిపే సంభాషణలు వంటి పలు అంశాలపై వాటి పరిణామం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఏది మంచి, ఏది చెడు అన్నది నిర్ణయించుకునేందుకు.. సరిదిద్దుకునేందుకు అవకాశం లభిస్తుంది.
సాక్షి: ఎలన్‌మస్క్, బిల్‌గేట్స్ వంటి ప్రముఖులు కృత్రిమ మేధతో మనిషికి ముప్పేనంటున్నారు. మీరు అంగీకరిస్తారా?
డేవిడ్ హాన్సన్: వారి ఆందోళన అర్థం చేసుకోదగ్గదే. అయితే కృత్రిమ మేధ వృద్ధి చెందితే మనిషి ఉనికికి ప్రమాదమన్న అంచ నాలకు భయం అనేది ప్రతిస్పందన కాకూడ దు. అయితే అన్ని అంశాలను బేరీజు వేసేం దుకు దీనిపై చర్చ జరగడం మంచిదే.
సాక్షి: రోబోలు మనపై పెత్తనం చెలాయిస్తాయా?
డేవిడ్ హాన్సన్: సూటిగా చెప్పాలంటే మనకు ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే టెక్నాల జీలు ఎంత వేగంగా మారితే.. భవిష్యత్తు అంతే స్థాయిలో అసందిగ్ధంగా తయారవు తుంది. అననుకూలమైన పరిణా మాల గురించి ఊహించడంలో తప్పులేదుగానీ.. అదే సమ యంలో అనుకూల అం శాలపైనా దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో రోబోల ద్వారా రాగల విప త్తుల గురించి ఆలోచన చేయాలి. అది కూడా తర్కబద్ధంగా జరగాలి.
ఇదే కృత్రిమ మేధ సాయంతో భవిష్యత్తులో ఎదురుకాగల పరిణామాలను అంచనా వేయవచ్చు. మనిషి ఉనికిని ప్రమాదంలోకి నెట్టేయగల టెక్నాల జీలు వాస్తవ రూపం దాల్చకుండా నిలువరించవచ్చు. కృత్రిమ మేధ టెక్నాలజీల వల్ల ఏవైనా విపత్తులు వస్తాయా? అన్న దానిపై పరిశోధనలు ప్రారంభించేందుకు ఇదే మంచి తరుణం.
Comments
Please login to add a commentAdd a comment