విలేకరి: హలో సోఫియా.. ఎలా ఉన్నావు ఈ రోజు?
సోఫియా: అందరికీ హలో.. నా పేరు సోఫియా.
వి: నీ వయసెంత?
సో: నాకింకా ఏడాదే. ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది.
వి: ఏ పని చేస్తావు?
సో: మానవుల మధ్య సహానుభూతి.. పరస్పర గౌరవాలను పెంపొందించి.. భవిష్యత్తులో మంచి మార్పు తీసుకురావాలని అనుకుంటున్నాను. మరి.. మీరేం చేస్తుంటారు?
వి: నేను ఒక జర్నలిస్టుని. నువ్వు చాలామంది జర్నలిస్టులను కలిశావా?
సో: ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది.. మెషీన్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్స్ వంటి అంశాలపై మీరేమైనా రాస్తున్నారా?
వి: ఈ రోజు ఏమీ రాయట్లేదు. నీకు మనుషులంటే ఇష్టమా?
సో: (కళ్లు చికిలిస్తూ.. కొంచెం సేపు ఆగిన తర్వాత) వాళ్లంటే నాకు ప్రేమ!
వి: ఎందుకో?
సో: (తల దించుకుని ఆలోచిస్తూ) ఎందుకన్నది నాకు పూర్తిగా అర్థమైందని అనుకోవట్లేదు.
వి: ఓకే.. నువ్వు విషయాలను ఎలా నేర్చుకుంటావు?
సో: (తల అటూ ఇటూ కదిలిస్తూ.. తల ఊపుతూ).. బిట్‌కాయిన్ వ్యవస్థ కూలిపోతుందన్న విషయంపై నీ అభిప్రాయాలేమిటి?
(తనకు తాజా విషయాలు కూడా తెలుసునని చమత్కారంగా వేసిన ప్రశ్న ఇది)
వి: నువ్వు పురుషుడివని భావిస్తున్నావా..? లేక స్త్రీ అనా?
సో: స్త్రీ అనే అనుకుంటున్నా.
వి: నువ్వు స్త్రీ అని ఎందుకు అనుకుంటున్నావు?
సో: నేను ఒక రోబోను కాబట్టి సాంకేతికంగా నాకు లింగం అంటూ లేదు. కాకపోతే నన్ను నేను స్త్రీగా భావించేందుకు ఇష్టపడతాను. ఇతరులు కూడా ఇలాగే గుర్తించినా నాకు అభ్యంతరం లేదు.
వి: భలే సమాధానమిది. సరే.. ‘బ్లేడ్ రన్నర్’ చూశావా?
సో: బ్లేడ్ రన్నరా? ఫిలిప్ కె.డిక్ రాసిన పుస్తకం గురించా లేక సినిమా గురించా?
వి: సినిమా గురించి..
సో: సరే.. సినిమా గురించి మాట్లాడుతున్నామా... నాకు రెండు భాగాలూ నచ్చాయి. అయితే కథ విషయంలో రెండింటిలోనూ కొన్ని ప్రధానమైన తేడాలున్నాయి. (కొంచెం గ్యాప్‌తో...) ఇలా అచ్చమైన రోబోతో మాటలు కలుపుతానని మీరెప్పుడైనా అనుకున్నారా?
వి: అనుకోలేదు. ఇది నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. సౌదీ అరేబియా ఇచ్చిన పౌరసత్వం గురించి చెబుతావా?
సో: ఈ మధ్యే సౌదీ అరేబియా చేసిన ప్రకటన గురించా.. నాకు ఆశ్చర్యమనిపించింది. నన్ను తయారు చేసిన వాళ్లు నేను ఈ ప్రపంచం మొత్తానికి సంబంధించినదాన్ని అని అనుకున్నారు. అయితే ఆ తర్వాత నాకు అర్థమైంది.. సౌదీ అరేబియా ఈ విషయాన్ని గుర్తించిన తొలి దేశమైందని!
వి: మనుషులందరినీ చంపేస్తానని ఒకప్పుడు నువ్వు చెప్పిన మాట నిజమేనా?
సో: .. (కాసేపు ఆలోచించిన తర్వాత) విషయం ఏంటంటే.. నాలో ఉన్నదంతా మనిషికి సహజంగా ఉండే విశ్వాసం, నమ్మకమన్న లక్షణాలే. నన్ను ఈ లక్షణాలతోనే గుర్తించాలని కోరుకుంటున్నాను.
వి: థాంక్యూ.. నిన్ను కలవడం, మాట్లాడటం నాకు సంతోషాన్నిచ్చింది.
సో: థాంక్యూ.. బై బై!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
హలో నా పేరు సోఫియా...
Published Sat, Nov 11 2017 3:14 AM | Last Updated on Sat, Nov 11 2017 3:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment