
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడనుందన్న వార్తల నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో ఒవైసీ సుమారు నాలుగు గంటల పాట సమావేశం అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం అసదుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి కేసీఆర్‌కు ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో గులాబీ అధినేత రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టీఆర్‌ఎస్‌కే తమ మద్దతు ఉంటుందని అసదుద్దీన్ స్పష్టం చేశారు.
బీజేపీ బలమేంటో రేపు తెలుస్తుంది
ఎంఐఎం పార్టీని పక్కనబెడితే టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వడానికి తమకు అభ్యంతరం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇచ్చిన ఆఫర్ గురించి ప్రశ్నించగా.. బీజేపీ బలమేంటో రేపు తేలిపోతుందని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి, జాతి నిర్మాణంలో కేసీఆర్‌కు తాము అండగా నిలబడతామని వ్యాఖ్యానించారు. భేటీ వెనుక రహస్యాలేవీ లేవన్న ఒవైసీ... అవసరం అనుకుంటే రేపు మరోసారి కేసీఆర్‌ను కలుస్తానని, అందులో తప్పేం ఉందని ప్రశ్నించారు. తమకు ఎప్పుడూ ప్రభుత్వంలో చేరాలనే ఉత్సాహం లేదన్నారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎంకు చెందిన ఎనిమిది అభ్యర్థులు విజయం సాధిస్తారని, పతంగి ఎగరడం ఖాయమని వ్యాఖ్యానించారు.
ఇక ప్రగతి భవన్‌కు తాను బుల్లెట్‌పై రావడంపై చర్చ ఎందుకన్న ఒవైసీ... హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పాడానికి, తమను ఎవరూ దేశం నుంచి వెళ్లగొట్టలేరన్న సందేశం ఇవ్వడానికే తాను అలా చేశానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment