ఈవీఎంకు 36 ఏళ్లు..
కౌటాల(సిర్పూర్): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం) పుట్టి 36 ఏళ్లవుతోంది. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలకు ప్రత్యామ్నాయంగా 1982లో ఈ యంత్రాలను ప్రవేశపెట్టారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఈవీఎంల పుట్టుకతో వాటి నిర్వహణ లోపాలు, సందేహాలతో కొంతకాలం కొట్టుమిట్టాడి ఆ తర్వాత నిలదొక్కుకుంది. అప్పటి నుంచి అనేక ఎన్నికల్లో ఈవీఎంలను విజయవంతంగా వినియోగిస్తున్నారు.
► మొదటిసారి కేరళ రాష్ట్రం పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1982 మే 19న ఈవీఎంలను వినియోగించారు.
► ఆ తర్వాత 1982, 83లో జరిగిన ఉపఎన్నికల్లో దేశవ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో వీటిని వాడారు.
► ఈవీఎంలను ఉపయోగించవద్దని 1984 మే 5న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
► ఈవీఎంల వాడకాన్ని 1988 మార్పు చేసి డిసెంబర్‌లో కేంద్రం సెక్షన్ 61 ద్వారా ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేర్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 61ఏ సవరణను 1989 మార్చి 15న అమల్లోకి రావడంతో ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
► జనవరి 1990లో ఎన్నికల సంస్కరణల కమిటీ(ఈఆర్‌సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్‌లో ఈవీఎంల వాడకాన్ని సాంకేతిక నిపుణుల కమిటీ సమర్థించింది.
► ఎన్నికల సవరణను 1992 మార్చి 24న ఎన్నికల నియమావళి 1961ని ప్రభుత్వం అధీకృతం చేసింది.
► ఈవీఎంల వాడకానికి 1998లో ప్రజామోదం లభించింది.
► వివిధ రాష్ట్రాల్లో 1999, 2004లలో వివిధ శాసనసభల ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వినియోగించారు.
► లోక్‌సభకు 2004–14 మధ్య జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఈవీఎంలను వాడారు.
► వీవీప్యాట్‌లను (వోట్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్) వినియోగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
► దశలవారీగా 2013 నుంచి వీవీ ప్యాట్‌లను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు.
► 2017 ఏప్రిల్‌లో 3173.47 కోట్లతో 16.15 లక్షల వీవీప్యాట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కూడా వీవీప్యాట్‌లను వినియోగించేందుకు ఎన్నికల కమీషన్ ఆమోదం తెలిపింది.
ఆసిఫాబాద్: స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలైనా ఆసిఫాబాద్ నియోజకవర్గం దశ మారడం లేదు. పోరాటాల గడ్డగా పేరుపొందినా ఈ ప్రాంతం సమస్యల అడ్డాగా మారింది. ఇప్పటికీ విద్య, వైద్యం, రవాణా సౌకర్యం, సాగునీటి వసతిలో ఎంతో వెనుకబడి ఉంది. ఎన్నికలు, ఇతరాత్ర కార్యక్రమాల్లో ప్రజల సమస్యలు తీరుస్తామని పాలకులు హామీలు గుప్పించినా నెరవేరని పనులెన్నో కళ్లముందే కదలాడుతున్నాయి.
ఆసిఫాబాద్ మండలం..
► ఆసిఫాబాద్ మండలంలోని అడ గ్రామం వద్ద రూ.450కోట్లతో నిర్మిస్తున్న కుమురంభీం ప్రాజెక్టు పనులు ఏళ్ల తరబడి పూర్తి కావడం లేదు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్ద కాలంగా పనులు పూర్తి కావడం లేదు. 2007లో పూర్తి కావలసిన పనులు నిధుల కొరత, అటవీశాఖ క్లియరెన్స్, పునరావాసం తదితర కారణాలతో పనులు పూర్తి కాకపోవడంతో రైతులు ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారు. అలాగే 1998లో రూ.100 కోట్లతో నిర్మించిన వట్టివాగు ప్రాజెక్టు పరిస్థితి అలాగే ఉంది. కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్ మండలాల్లో 24,500 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉన్నా కనీసం వెయ్యి ఎకరాలకు కూడా నీరందడం లేదు.ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.85 కోట్లతో ప్రతిపాదనలు పంపినా పనులు ముందుకు సాగడం లేదు.
► మండలంలోని గుండి వంతెన పిల్లర్ల దశలోనే ఉంది. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.60 కోట్లు కేటాయించినా గత పదేళ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వంతెన లేక వర్షాకాలంలో ఈ గ్రామాలకు 108, 104 కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది.
► నియోజకవర్గ కేంద్రం ఆసిఫాబాద్‌లో ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఈ ప్రాంత విద్యార్థులు ఇంటర్‌తో చదువు మానేస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారిన ఈ కళాశాల మాత్రం మంజూరు కావడం లేదు.
► జిల్లా కేంద్రంలో రూ.11.22 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించిన ప్రభుత్వాస్పత్రిలో అవసరమున్న వైద్యులు లేక రోగులకు సేవలందడం లేదు. 50 పడకల ఆస్పత్రిలో కేవలం జ్వరాలకు తప్ప ఇతర జబ్బులకు వైద్యం అందడం లేదు. గతేడాది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా కార్పొరేటుకు ధీటుగా వైద్యసేవలందించి, వైద్యుల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించినా ఫలితం లేకుండాపోయింది.
రెబ్బెన మండలం..
► ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ప్రధాన సమస్య రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్‌రోడ్ రైల్వేస్టేషన్‌లో ఫుట్ ఓవర్‌బ్రిడ్జి లేకపోవటం. ఈ బ్రిడ్జి కోసం ప్రయాణికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి నాయకులు హామీలు ఇవ్వడమే తప్పా ప్రయాణికుల కష్టాలకు పరిష్కారం చూపడం లేదు.
► కైరిగూడ గ్రామానికి వెళ్లే దారిలో గుండాల వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని ఎన్నో ఏళ్లుగా నాయకులు హామీలు ఇచ్చినా వంతెన నిర్మించలేదు. కొన్ని నెలల క్రితం బ్రిడ్జికి రూ.5కోట్లు మంజూరుకాగా ప్రభుత్వ రద్దుకు కొన్ని రోజుల ముందే పనుల ప్రారంభానికి భూమిపూజ చేశారు. అయితే ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
► తక్కళ్లపల్లి నుంచి రోళ్లపాడు వరకు బీటీ రోడ్డు లేకపోవటంతో వర్షాకాలం ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే కొన్ని నెలల క్రితం సుమారు రూ.4కోట్లతో తక్కళ్లపల్లి రైల్వే గేట్ నుంచి రోళ్లపాడు వరకు బీటీ రోడ్ మంజూరు కాగా పనుల ప్రారంభానికి భూమిపూజ చేశారు. గత నెలలో రోడ్డు వెంట అక్కడడక్కడ బర్మ్ పనులు చేపట్టి వదిలేశారు. తప్ప పనుల్లో పురోగతి లేదు.
► కొండపల్లి గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇప్పటి వరకు మంజూరు కాలేదు. రాంపూర్ గ్రామానికి సైతం బీటీరోడ్ లేకపోవటంతో వర్షాకాలం కనీసం నడిచి వెళ్లలేని దుస్థితి నెలకొంటోంది.
కెరమెరి మండలం.. ‘సరిహద్దు’ గ్రామాల గోస
కెరమెరి మండలంలో మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 32వేల జనాభా ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న వివాదాస్పద గ్రామ పంచాయతీలు పరందోలి, అంతాపూర్, బోలాపటార్‌లో సమస్యలు తాండవిస్తున్నాయి. ఆ పంచాయతీల్లో 12 గ్రామాలు ఉండగా ఎక్కడ కూడా నీటి సౌకర్యం లేదు. గతంలో నిర్మించిన మంచినీటి పథకాలు, చేతిపంపులు అలంకార ప్రాయంగా మారాయి. ఒక్కసారి చెడిపోతే మరమ్మతు చేసే నాయకుడు ఉండడు. 4 వేల జనాభా ఉన్న ఆ గ్రామాల్లో 80 శాతం రైతులకు సాగు భూములకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారు. పరందోలి గ్రామ పంచాయతీలోని 6 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక అభివృద్ధి నిలిచిపోయింది. ఐదేళ్ల క్రితం ఉమ్రి వాగు నుంచి నిర్మిస్తున్న రోడ్డు ఆర్‌ఎఫ్‌లో ఉందని అటవీ అధికారులు నిలిపి వేశారు. ఇప్పటి వరకు దానికి బీటీ వేయలేదు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సమస్య తీరిపోతుందని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న పలుమార్లు అనుమతులు ఇప్పించి రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు.
తిర్యాణి మండలం.. తిర్యాణి మండలంలో ప్రధాన సమస్య బస్టాండ్ లేకపోవడం. మండలంలోని 29 గ్రామపంచాయతీలకు చెందిన ప్రజలు మండలం నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్‌ఐబీ ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రధాన దారి తిర్యాణి నుంచి వెళ్లాలి. నిత్యం వందలాది మంది బస్‌లు, ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా తిర్యాణి నుంచి తాండూర్ ఐబీ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా సాగిస్తున్నారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో బస్డాండ్ లేక బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు చెట్లనీడన సేద తీరుతున్నారు. గతంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌లు మండల పర్యటనకు వచ్చినపుడు మండల కేంద్రంలోని కుమురంభీం చౌరస్తాలో బస్టాండ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాని ఇంత వరకు దాని ఊసే లేదు.
► గుండాల గ్రామానికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైన పనులు కాలేదు. అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో పనులు ఆపేశారు. ఈ అనుమతులువస్తాయని ఎమ్మెల్యే కోవ లక్ష్మి, చాలాసార్లు మండలంలో నిర్వహించిన సమావేశాల్లో చెప్పినా ఇప్పటికీ అనుమతులు రాలేదు. దీంతో ఏళ్ల నుంచి గుండాలవాసులు కాలినడకకే పరిమితమయ్యారు.
► మండలానికి 50 డబుల్‌బెడ్ రూం ఇళ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసినా ఒక్కరికీ ఇల్లు కట్టియ్యలేదు.
► మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిలో వైద్యులు లేరు. ఒక్క వైద్యుడితోనే నడిపిస్తున్నారు.
వాంకిడి మండలం..మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులు, వాగులపై వంతెనలు నిర్మిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కానీ వెలిగి, పిప్పర్‌గోంది, హరిద్వాయి, ఎనోలి, డోంగర్‌గాం, గడెమార్గ్ తదితర గ్రామాలకు వెళ్లే వాగులపై ఇప్పటికీ వంతెనలు లేవు. ఖమాన, పిప్పర్‌గోంది, ఎనోలి వాగుపై వంతెన నిర్మిస్తామని ఎమ్మెల్యేతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా వంతెనల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలానికి 50 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు కాగా, మండల కేంద్రంలో 15 ఇళ్ల నిర్మాణాల పనులు ప్రారంభించినా పిల్లర్ల దశలోనే ఉన్నాయి.
నోటాకూ వేయొచ్చు
∙గత ఎన్నికల్లో 17,095 ఓట్లు
∙పోస్టల్ బ్యాలెట్లలో 67 పోల్
ఆదిలాబాద్‌డెస్క్: ఓటు వజ్రాయుధం లాంటిది. చట్టసభలకు సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో కీలకమైంది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరికీ నచ్చాలని ఏం లేదు. గతంలో నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్నా ఎవరికో ఒకరికి ఓటు వేయక తప్పేది కాదు. బ్యాలెట్ పత్రం వినియోగించిన సమయంలో రెండు గుర్తులపై ఓటు వేసేవారు కొందరైతే.. ఓటింగ్‌కు దూరంగా ఉండేవారు మరికొందరు.. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఈవీఎంల్లో నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్) బటన్ తీసుకొచ్చారు. ఇది కేవలం ఓటరుకు ఉన్న ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయదు. అత్యధికులు నోటాను వినియోగించుకున్నా.. పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 17,095 మంది నోటాను వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ 67 మంది నోటాకు ఓటేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 2,829 మంది నోటాను వినియోగించుకోగా.. అత్యల్పంగా బెల్లంపల్లిలో 769 మంది నోటాను వినియోగించుకున్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. సిర్పూర్‌లో 1,752, చెన్నూర్‌లో 1,609, బెల్లంపల్లిలో 769, మంచిర్యాలలో 1,472, ఆసిఫాబాద్‌లో 2,829, ఖానాపూర్‌లో 2,421, ఆదిలాబాద్‌లో 850, బోథ్‌లో 2,242, నిర్మల్‌లో 1360, ముథోల్‌లో 1,791 మంది నోటాను వినియోగించుకోవడం గమనార్హం. పోస్టల్ ఓట్లలో సిర్పూర్‌లో 4, చెన్నూర్‌లో 7, బెల్లంపల్లిలో 12, మంచిర్యాలలో 10, ఆసిఫాబాద్‌లో 4, ఖానాపూర్‌లో 6, ఆదిలాబాద్‌లో 14, బోథ్‌లో 4, నిర్మల్‌లో 5, ముథోల్ 1 నోటాకు పోల్ అయ్యాయి.
ఇలా ఈవీఎంల్లోకి..
2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. ఇది భావ వ్యక్తీకరణలో అంతర్భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛతీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 2013 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో నోటా ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టారు. అన్ని గుర్తులకంటే చివరలో నోటా గుర్తు ఉంటుంది. ఈ గుర్తును అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ రూపొందించింది.
ఏజెన్సీ మండలాల్లో..
► ఏజెన్సీ మండలాల్లో రహదారి సౌకర్యం లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యు), నార్నూర్ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సిర్పూర్(యు)–లింగాపూర్ మధ్యలో ఉన్న వాగు నీటి ప్రవాహం పెరిగితే వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. నార్నూర్–కెరమెరి మధ్యతో ఉమ్రి వాగు బ్రిడ్జి నిర్మాణం పనులు ముందుకు సాగకపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లని దుస్థితి ఉంది. ఏజెన్సీ మండలాల్లో..
వైద్యసేవలు మెరుగుపరచాలి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో అవసరమున్న వైద్యులు లేకపోవడంతో వైద్య సేవలందడం లేదు. ఆస్పత్రి కేవలం జ్వరాల చికిత్సకే పరిమితమవుతోంది. హృద్రోగ సమస్యలు, గర్భిణులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లల వైద్యులను నియమించాలి.
– నల్లగొండ శ్రీరాములు, ఆసిఫాబాద్
ఎక్కడి సమస్యలు అక్కడే..
తెలంగాణ వచ్చి టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మండలంలోని గ్రామీణ ప్రాంతాల సమస్యలు తీరుతాయనుకున్నాం. కానీ తీరలేదు. వాగులపై వంతెనలు లేకపోవడంతో రవాణా కష్టాలు తప్పడం లేదు. డబుల్ బెడ్రూం మంజూరైన నిర్మిస్తలేరు.
– విలాస్, వాంకిడి
ఆర్టీసీ బస్టాండ్ నిర్మించాలి
తిర్యాణి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటులో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామంలో బస్టాండు లేకపోవడంతో ఎండ, వాన, చలికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
– చిలుక శ్రావణ్, తిర్యాణి మీకు తెలుసా
ఛాలెంజ్ ఓటు అంటే..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎన్నికల్లో ‘ఛాలెంజ్ ఓటు’(సవాలు ఓటు) కూడా ఉంటుంది. ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావితం చేసే ఈ ఓటు గురించి ఇప్పటికీ చాలా మంది తెలియదు. ఛాలెంజ్ ఓటు అంటే ఓటరు జాబితాలో పేరు ఉన్నా.. ఎవరైనా ఓటుకు అనర్హుడని రాజకీయ పార్టీల ఏజెంట్లు సవాలు చేయడాన్ని ఛాలెంజ్ ఓటు అంటారు. జాబితాలో ఓటరు పేరు, ఫొటో ఇతర వివరాలు సక్రమంగా ఉంటే చాలు. ఇక పోలింగ్ కేంద్రంలో కొంత మంది ఏజెంట్లు ఆ వ్యక్తి బోగస్ అని పోలింగ్ అధికారికి తెలియజేస్తారు. సదరు అధికారి ఫిర్యాదును పరిశీలించి ఏజెంట్ నుంచి రూ.5 ఫీజు తీసుకుని రసీదు ఇస్తారు. స్థానిక సిబ్బందితో ప్రాథమిక విచారణ జరిపిస్తారు. అర్హుడని తేలితే ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతి ఇస్తారు. బోగస్ అని తేలితే మాత్రం అధికారులు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు
Comments
Please login to add a commentAdd a comment