
‘బడ్జెట్’.. బాగేనా?
సాగునీరు, తాగునీరే జిల్లాకు ప్రధాన అవసరం
ఏఎమ్మార్పీ, నక్కలగండి, మూసీ ప్రాజెక్టులకు నిధులొచ్చేనా?
డబుల్‌బెడ్‌రూం, దళితులకు మూడెకరాల పంపిణీకి ఏ మేరకో?
జిల్లా ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో?
గంపెడాశలతో నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ
నల్లగొండ : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రధాన సమస్యలైన తాగునీరు, సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌లు ఏ మేరకు కరుణ చూపుతారని జిల్లా ప్రజానీకం ఎదురుచూస్తోంది. జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అధికారపక్షంలో, మరో ఆరుగురు ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో స్థానిక సమస్యల పరిష్కారానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారు..ఏయే సమస్యలు లేవనెత్తుతారనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తొలి అసెంబ్లీ బడ్జెట్‌లో జిల్లా ప్రజలకు ప్రధాన అవసరాలైన తాగు, సాగునీటికి సంబంధించి నిధుల కేటాయింపు అత్తెసరుగానే ఉన్న పరిస్థితుల్లో ఈసారైనా కాసుల వర్షం కురుస్తుందా...జిల్లా ప్రజల సమస్యలు తెలంగాణ రాష్ట్రంలోనయినా తీరుతాయా అనే ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాకు ప్రధాన సాగునీటి వనరులైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బీసీ, నక్కలగండి, మూసీ ప్రాజెక్టులకు తగినన్ని నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు మినహా మిగిలిన వాటికి ఏటా కనీసం రూ.400 కోట్లయినా కేటాయించాల్సిన పరిస్థితుల్లో ఈసారి ఎన్ని నిధులు పెడతారు... జిల్లా ఆయకట్టు వరకు నీటిని ఏ మేరకు తెస్తారు అనేది ఇప్పుడు ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తోంది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమవుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ఆధునీకరణ, జిల్లాలో ఎడమకాల్వపై ఉన్న లిఫ్టుల నిర్వహణలకు పెద్దఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంది. ఇక తాగునీటి అవసరాలను తీర్చే ఉదయసముద్రం లాంటి ప్రాజెక్టులకు కూడా నిధులివ్వాల్సి ఉంది.
సం‘క్షేమ’మేనా?
సాగు,తాగునీటి అవసరాల మాట అటుంచితే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల కేటాయింపు కూడా ప్రాధాన్యతాంశంగా మారింది. ముఖ్యంగా జిల్లాలో గృహనిర్మాణానికి సంబంధించిన పనులు ఆగిపోయాయి. గృహ నిర్మాణాలకు సంబంధించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికల రూపొందించుకున్న నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిర్మాణాల మాట అటుంచితే బిల్లుల చెల్లింపు కూడా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన టీఆర్‌ఎస్ హామీ ఏ మేరకు నెరవేరుతుంది... ఎంతమంది లబ్ధిదారులకు ఇళ్లు కట్టించేందుకు నిధులు మంజూరు చేస్తారనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇక, మరో ముఖ్యమైన అంశం దళితులకు భూపంపిణీ. భూమి లేని దళితులకు మూడెకరాల భూమి ఇచ్చే కార్యక్రమానికి నిధులు కేటాయించాల్సి ఉంది. ఇప్పటివరకు జిల్లాలో రూ8కోట్లు వెచ్చించి 117మంది లబ్ధిదారులకు మాత్రమే భూమి కేటాయించారు.
వేలాది మంది దళితులు ఈ భూమి కొనుగోలు పథకం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు ఆసరా పెన్షన్లు, ఆహారభద్రత, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వాటర్‌గ్రిడ్, మిషన్‌కాకతీయ, రోడ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలకు ఏ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది? అందులో జిల్లాకు ఏ మేరకు చేరుతుంది? జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో ఏ మేరకు గళం విప్పుతారు? జిల్లాకు ఏ మేరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారో వేచిచూడాల్సిందే.