అసెంబ్లీలో నాయకుల ముచ్చట్లు
కొమురవెల్లి మూల విరాట్టును ముట్టుకోం
పుట్టమన్ను విగ్రహం యథాతథం: తలసాని
హైదరాబాద్: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని, యాదవులు, కురుమలకు కులదైవమని, మల్లన్న మూలవిరాట్టు విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలసి ఆయన శుక్రవారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు. పుట్టమన్నుతో ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామని అనవసర ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని, కురుమ యాదవుల ప్రతినిధిగా తాను చెబుతున్నానని, పుట్టమన్ను విగ్రహం అలాగే ఉంటుందని అన్నారు. రెండేళ్ల కిందట కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికి హామీలు ఇచ్చారని, ఆ పనులన్నీ కొనసాగుతున్నాయని తెలిపారు. సుమారు 166 ఎకరాల దేవుని మాన్యాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ స్థలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. కొమురవెల్లికి మొక్కుల చెల్లింపుల్లో వచ్చిన కోడెలను విక్రయించడం లేదని, ఎవరకీ ఎలాంటి అపోహలు అవసరం లేదని, అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన కోరారు. గడిచిన రెండేళ్లలో ఆలయ ఆదాయం రూ.4 కోట్లకు పెరిగిందని, మిషన్ భగీరథ నుంచి తాగునీటి సౌకర్యం కూడా కల్పించామని ముత్తిరెడ్డి వివరించారు.
కొత్త జిల్లాల ఆందోళనలపై స్పందించండి
మండలిలో ప్రస్తావించిన ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ
హైదరాబాద్: కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలని ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని కోరారు. మండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద శుక్రవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. రామాయంపేట డివిజన్ కోసం 97 రోజులుగా ఆందోళన జరుగుతోందని, ధర్నాలు, రాస్తారోకోలతో ప్రతిరోజు అక్కడి హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోతోందని తెలిపారు. బాన్సువాడ జిల్లా కోసం కూడా ఆందోళన జరుగుతోందని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా అక్కడి ప్రజలతో చర్చలు జరపాలని, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆందోళనలు విరమింపజేయాలని కోరారు.
తెలంగాణ ప్రైవేట్ బస్సులను అడ్డుకోవద్దు
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రైవేటు బస్సులు తెలంగాణలో ఎన్ని నడుస్తున్నాయో అదే సంఖ్యలో తెలంగాణ బస్సులను కూడా ఏపీలో నడవ నివ్వాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయిం ట్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దుర్గం చిన్నయ్యలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో నడుస్తున్న తెలంగాణకు చెందిన ప్రైవేటు బస్సులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటివి పునరావృతమైతే తెలంగాణలో తాము కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. పాలెం బస్సు ప్రమాద ఘటనలో జేసీ బ్రదర్స్ నిందితులని, ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 27న జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తానంటే అక్రమ కేసులకు సంబంధించిన ఆధారాలను చూపడానికి తాము సిద్ధమని ప్రకటించారు.
హోంగార్డుల సమస్యలపై సీఎం స్పందన
వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో కమిటీ
హైదరాబాద్: హోంగార్డుల సమస్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందించారు. వారి వేతనాల పెంపు, ఇ తర సమస్యలపై ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజుల్లోగా నివేదిక అందజేయాలని కమిటీని సీఎం ఆదేశించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో హోంగార్డుల సమస్యలను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ లేవనెత్తారు. సమస్యలను విన్న సీఎం కేసీఆర్.. అసెంబ్లీలోని తన చాంబర్‌లో డీజీపీ అనురాగ్ శర్మ, హోంగార్డ్స్ ఐజీలతో సహా హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించారు. వెంటనే ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. హోంగార్డుల వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, కానిస్టేబుల్ నియామకాల్లో ప్రాధాన్యం, ఇతర సౌకర్యాల కల్పన వంటి అంశాలపై సీఎం నివేదిక కోరారు. రాష్ట్రంలోని 25వేల మంది హోంగార్డుల కుటుంబాలలో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని హోం గార్డుల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘పీఏసీ బాధ్యతలు గీతారెడ్డే చూస్తారు’
హైదరాబాద్: ప్రజాపద్దుల సంఘం(పీఏసీ) బాధ్యతలను పదవీకాలం పూర్తయ్యేదాకా జె.గీతారెడ్డి నిర్వహిస్తారని, ఇందులో ఎవరికీ అనుమానాలు అవసరం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షం నాయకుడు కె.జానారెడ్డి స్పష్టంచేశారు. పీఏసీ చైర్‌పర్సన్ జె.గీతారెడ్డితో కలసి శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో జానారెడ్డి విలేకరులకు ఎదురయ్యారు. టీఆర్‌ఎస్ నేతలతో గీతారెడ్డి సన్నిహితంగా ఉంటున్నారనే ఉద్దేశంలో పీఏసీ బాధ్యతలను ఎవరికి అప్పగించబోతున్నారనే అర్థంతో జానారెడ్డిని విలేకరులు ప్రశ్నించారు. దీనికి జానారెడ్డి సమాధానం ఇస్తూ గీతారెడ్డి సమర్థతపై, పార్టీ పట్ల అంకితభావంపై ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. పదవీకాలం పూర్తయ్యేవరకూ పీఏసీ బాధ్యతలను గీతారెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తారని జానారెడ్డి స్పష్టం చేశారు. కాగా, తనకు కొంత అనారోగ్య పరిస్థితుల వల్ల ఎక్కువగా తిరుగలేకపోతున్నానని, దీనిపై అనవసర ఊహాగానాలు వద్దు అని గీతారెడ్డి వ్యాఖ్యానించారు.