సూర్యాపేట, న్యూస్‌లైన్ : ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుల రుణమాఫీని షరతులు లేకుండా అమలుచేస్తున్నట్టు అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీపై షరతులు విధించడంతో తెలంగాణ ప్రాంతంలో రైతులు నిరాశలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హామీలను త్వరితగతిన అమలుచేయాలని కోరారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటును సీపీఎం స్వాగతిస్తుందని, అదేవిధంగా హామీల అమలు కోసం ఉద్యమిస్తుందన్నారు. రైతులు సాగుకోసం తీసుకున్న అన్నిరకాల రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు కొరత తీవ్రంగా ఉందని.. వాటి పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. రైతాంగానికి ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించి, నకిలీ విత్తనాలు, ఎరువులను నిషేధించాలని కోరారు. సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు నూకల మధుసూదన్‌రెడ్డి, మట్టిపల్లి సైదులు, పి.పెంటయ్య పాల్గొన్నారు.
రుణమాఫీపై అసెంబ్లీలో సరైన ప్రకటన చేయాలి
Published Mon, Jun 9 2014 12:10 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement