♦ ఇజార్‌ఖాన్ మృతదేహం బంధువులకు అప్పగింత
♦ హైదరాబాద్ నుంచి విమానంలో లక్నోకు తరలింపు
♦ 46 గంటలపాటు పోలీసుల నిఘాలో ఎంజీఎం ఆస్పత్రి
♦ ఊపిరి పీల్చుకున్న పోలీసు యంత్రాంగం
♦ ఇది బూటకపు ఎన్‌కౌంటర్ : న్యాయవాది సయ్యద్ అలీఖాన్
ఎంజీఎం : వరంగల్-నల్లగొండ జిల్లాల సరిహద్దులో మంగళవారం ఉదయం జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ ప్రక్రియ ముగిసింది. బుధవారం నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లగా.. గురువారం రాత్రి 9.52 గంటలకు ఇజార్‌ఖాన్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహాన్ని తీసుకుంటూ అంగీకారపత్రంపై ఇజార్‌ఖాన్ సోదరుడు తన్వీర్ అహ్మద్ ఖాన్, బంధువులు సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీపంలో గల అమీనాబాద్ నుంచి వచ్చిన వెంటనే అడ్వొకేట్‌ల సమక్షంలో మృతదేహాన్ని అప్పగించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 46 గంటలపాటు ఎంజీఎం ఆస్పత్రి పోలీసుల ఆధీనంలోనే ఉంది. పోలీసులు డేగకళ్లతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. పక్కా ప్రణాళికతో పోలీసులు ముందుకు సాగారు. కాగా, ఇజార్‌ఖాన్ న్యాయవాది సయ్యద్ అలీఖాన్ మాట్లాడుతూ.. ఇవి పోలీసుల హత్యలని, న్యాయ పోరాటం చేస్తామన్నారు.
ప్రత్యేకమైన కాఫిన్ బాక్స్‌లో మృతదేహం తరలింపు
ఇజార్ ఖాన్ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన కాఫిన్ బాక్స్‌లో లక్నోకు తరలించారు. గురువారం రాత్రి అంబులెన్స్ ద్వారా బయలుదేరిన ఇజార్ ఖాన్ మృతదేహం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించి లక్నోకు వెళ్లనున్నారు. అయితే కాఫిన్ బాక్స్‌లో మృతదేహాన్ని తరలించడం వల్ల ఎయిర్‌పోర్టులో పోలీసులు స్కాన్ చేసిన సందర్భంలో బాక్స్ తెరవాల్సిన అవసరం ఉండదని పేర్కొంటున్నారు. విమానం ముందు జరిగే స్కానింగ్ పరీక్షలకు కాఫిన్ బాక్స్ అణువుగా ఉంటుంది.
ముగిసింది
Published Fri, Apr 10 2015 2:49 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement