ఎవరెస్టుపై జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న తిరుపతిరెడ్డి
పంజగుట్ట: పట్టుదల ఉంటే పేదరికం లక్ష్యానికి అడ్డురాదని నిరూపించాడా యువకుడు. ఆర్థిక స్థోతమత లేకున్నా కేవలం దాతల సాయంతో తాను అనుకున్న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు వికారాబాద్ జిల్లా ఎల్లకొండ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కొడుకు జి.తిరుపతిరెడ్డి. ఎవరెస్టు అనుభవాలను సాయం అందించిన దాతలతో కలిసి శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో పంచుకున్నాడు. ఈసారి ఎవరెస్టు ఎక్కేటప్పుడు ఒకేసారి రెండువందల మంది ఒకేదగ్గర కలవడంతో సుమారు 3 గంటల పాటు ట్రాఫిక్ జామైందని, దాంతో ముందుకు కదల్లేక, వెనక్కి రాలేక ఒకేచోట ఉండాల్సి వచ్చిందన్నాడు. నడుస్తున్నప్పుడు శరీరంలో వేడి పుడుతుందని, అప్పుడే ముందుకు సాగగలమని.. కానీ ఒకేచోట కదలకుండా ఉంటే శరీరం చల్లబడిపోయి, మెదడు పనిచేయదన్నాడు.
ఒక్కో సమయంలో వెనక్కి వెళ్లిపోదామా అన్న ఆలోచన వచ్చేదని, తమతో వచ్చిన బృందం ప్రోత్సాహం, తనకు సాయం చేసిన దాతలు, విద్యార్థులు కళ్లముందు కనిపించడంతో ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్లగలిగామన్నాడు. 7400 మీటర్ల ఎత్తు నుంచి మాత్రమే ఆక్సిజన్ వినియోగించామని, అయితే, 3 గంటల పాటు ట్రాపిక్ జామ్ కారణంగా తిరిగి వచ్చే సమయంలో ఆక్సిజన్ సమస్య వచ్చిందన్నాడు. అయితే, ఉన్న దానితోనే అతి జాగ్రత్తగా త్వరత్వరగా శిఖరం దిగామని వివరించాడు. మన రాష్ట్రం నుంచి ఆర్మీకి వెళ్లేవారి సంఖ్య తగ్గుతోందని, యువతను ఆ వైపు ప్రోత్సహించేందుకు త్రివిధ దళాల ప్రాధాన్యతను వివరిస్తూ ఎవరెస్టుపై జాతీయ పతాకాన్ని ప్రదర్శించినట్లు చెప్పాడు. తనకు సాయం అందించిన ప్రతీ సంస్థ పేరు, దాతల ఫొటోలను సైతం ప్రదర్శించానని తెలిపాడు. తనకు ప్రోత్సాహం అందిచిన దాతలకు రుణపడి ఉంటానని తిరుపతిరెడ్డి కృతజ్ఞతలు చెప్పాడు. తనపై పత్రికల్లో వచ్చిన కథనానికి స్పందించిన ఓ మహిళా దాత రూ.50 వేల సాయం అందించారని, కానీ ఆమె ఎవరో తనకు తెలియదని తెలిపాడు. ఈ సమావేశంలో దాతలు విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘు ఆరికెపూడి, ప్రభులింగం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment