అన్ని అర్హతలున్నా ‘ఆసరా’ అందకపోవడంతో లబ్ధిదారులకు పింఛన్ ఫికర్ పట్టుకుంది. ఇన్నాళుగా వచ్చిన పింఛన్ ఇప్పుడు వస్తలేదాయేనంటూ ఆందోళన చెందుతున్నారు. అన్ని అర్హతులున్నా తమను ఎందుకు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పెన్షన్ అందుతుందనే ఆశతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
* అర్హులకు అందని ‘ఆసరా’
* కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
* చేతులెత్తేసిన ప్రజాప్రతినిధులు
* ఆందోళనలో లబ్ధిదారులు
సంగారెడ్డి మున్సిపాలిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. అన్ని అర్హతలున్నా అర్హులకు పింఛన్ అందడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చేతులెత్తేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో గతంలో 5378 పింఛన్లు మంజూరు కాగా ప్రస్తుతం 1962 మాత్రమే మంజూరయ్యాయి. దీంతో అర్హులైన వేలమంది అర్జీదారులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
అధికారులు మాత్రం మంజూరైన పింఛన్లను పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఎస్‌కేఎస్ ఫాం సర్వే అన్‌లైన్ చేసే క్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు సక్రమంగా నిర్వహించకపోవడంతో అర్హులు చాల మందికి పింఛన్ పొందలేకపోతున్నారు. పుల్‌కల్ మండలం మిన్‌పూర్‌లో సైతం ఇదే సమస్య నెలకొని ఉన్నా పట్టించుకునే వారే లేకపోయారు. దీంతో మంగళవారం మండలాభివృద్ధి అధికారి కార్యలయం ఎదుట గంటల తరబడి నిరీక్షించిన పట్టించుకునే వారు లేరు. దీంతో వృద్ధులు ప్రజాప్రతినిధుల తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన మంగలి మల్లయ్య (79 సంవత్సరాలు) తనకు పింఛన్ అందలేదని తెలిపారు.
కుటుంబంలో తనను చూసేవారు ఎవరూ లేరని, కొడుకులు వేరుగా ఉంటూ బతుకు దెరువుకోసం వలస వెళ్లారని తెలిపారు. దీంతో తనను చూసేవారే లేకుండా పోయారన్నారు. ఇప్పటి వరకు తనకు వచ్చిన పింఛన్‌తో జీవనం కొనసాగించినట్లు తెలిపారు. ప్రస్తుతం వచ్చే పింఛన్ కూడా రాకపోవడంతో తిండితినలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి తనకు పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇదే గ్రామనికి చెందిన మున్సిబీ(71) కి సైతం పింఛన్ మంజూరు కాలేదు.
ఆమె భర్త 36 సంవత్సరాల క్రితం చనిపోయాడని అయినప్పటికీ ఆమెకు వితంతు పింఛను కాని, వృద్ధాప్య పింఛన్ కానీ మంజూరు కాలేదు. ఆమెకు కొడుకులు లేకపోవడంతో గ్రామంలో ఉన్న కుమార్తె వద్ద ఉంటోంది. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే అనంతరం రేషన్‌కార్డు, పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. 71 సంవత్సరాలున్న ఆమెకు వృద్ధాప్య, వితంతు పింఛన్ మంజూరు కాకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా జిల్లా వ్యప్తంగా అర్హులైన వృద్ధులకు, వితంతువులకు పింఛను మంజూరు కాకకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీడీఓలకు దరఖాస్తు చేసుకోవాలి
ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లు అర్హులకు అందని పక్షంలో వెంటనే సంబంధింత మండలాభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సత్యనారాయణరెడ్డి సూచించారు. అర్హులకు పింఛన్ అందడం లేదనే విషయంపై పీడీని వివరణ కోరగా ఆయన పై విధంగా స్పందించారు.
పింఛన్..ఫికర్
Published Thu, Dec 18 2014 12:36 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
Advertisement