విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీటి వంటి అంశాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లా
సంగారెడ్డి అర్బన్: విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీటి వంటి అంశాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లాను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని ప్రధానమంత్రి సలహాదారు, కొలంబియా విశ్వవిద్యాలయం సౌత్ ఏషియా ఇన్‌చార్జి డాక్టర్ నిరుపం బాజ్‌పాయ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యవైద్యం పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాలు, వాటి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను దేశంలో 6 జిల్లాలను ఎంపిక చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలను ఎంపిక చేసి గ్రామీణ స్థాయి నుంచి వీటిపై అవగాహన కల్పించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ కృషి చేస్తుందని, ఇందుకు గానూ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో వీటిపై అవగాహనకల్పించాలన్నారు.
కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ విద్య, వైద్యం పారిశుద్ధ్యం, తాగునీటి వినియోగంపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లాలోని ములుగు మండలాన్ని పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశామన్నారు. తదనంతరం దీనిని జిల్లా అంతటా కొనసాగిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయంలో అవగాహన వచ్చినట్లయితే జిల్లా దేశంలోని మోడల్ జిల్లాగా రూపొందుతుందన్నారు. అంతకు ముందు డీఎంహెచ్‌ఓ బాలాజీ పవార్, రాజీవ్ విద్యామిషన్, విద్యాశాఖ తదితర శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలను వివరించారు. సమావేశంలో ఏజేసీ మూర్తి, డీఎంహెచ్‌ఓ బాలాజీ పవార్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నరేంద్రబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయప్రకాశ్ , డీఈఓ రాజేశ్వర్‌రావు, ఆర్వీఎంపీఓ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.