విద్యుత్ సామాజిక సంపద. దీని వినియోగాన్ని తగ్గించుకుంటే ఎంతో మేలు. అసలే వేసవి. ఆపై కరెంట్ వాడకం విరివిగా ఉంటుంది. విద్యుత్ అవసరాలకు– ఉత్పత్తికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. బిల్లు ఎంత వచ్చినా చెల్లించేందుకు డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదు. విద్యుత్‌ను ఆదా చేయకపోవడంతో పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందరికీ అన్ని రకాల విద్యుత్ అవసరాలు తీరాలంటే దీనికి తగినట్లు విద్యుత్ సరఫరా జరగాలి. ఇవన్నీ సవ్యంగా అమలు కావాలంటే కరెంట్ ఆదాపై నగర వాసులు శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ ఆదా సామాజిక బాధ్యతగా భావించాలి. బస్తీల నుంచి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ వాసుల వరకు గుర్తించాలి. విద్యుత్ వాడకంలో పొదుపు పాటిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని తెలుసుకోవాలి. విద్యుత్‌ను ఎలా ఆదా చేయవచ్చో తెలుసుకుందాం. – సాక్షి, సిటీబ్యూరో
వాషింగ్ మెషిన్‌లు వినియోగిస్తున్నప్పుడు..
దుస్తులు ముందుగా నానబెట్టండి. వాషింగ్ మెషిన్‌లను ఫుల్ లోడ్‌తో వాడుతూ.. టైమర్‌ను తక్కువగా సెట్ చేసుకోవాలి. సరైన పాళ్లలో మాత్రమే నీరు, డిటెర్జంట్ వాడాలి. రిన్స్ చేయడానికి చల్ల నీరు మాత్రమే వాడాలి. ఎలక్ట్రిక్ డ్రయింగ్ ద్వారా కాకుండా వీలైనంత వరకు దుస్తుల ఆరుబయట ఆరబెట్టుకోవాలి. పీక్ లోడ్ సమయాల్లో (సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటలు) మెషిన్ వాడవద్దు.
రిఫ్రిజిరేటర్ వాడేటప్పుడు..
ఫ్రిజ్ డోర్ ఎక్కువసార్లు తెరవకూడదు. ఫ్రిజ్ థర్మోస్టాట్‌ను మీడియంలో సెట్టింగ్ చేసుకోవాలి. వేడిని ప్రేరేపించే ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఫ్రిజ్ ఉండాలి. గోడకు అర అడుగు దూరంగా, గాలి బాగా వీచే ప్రదేశంలో ఫ్రిజ్ ఉంచాలి. స్టార్ సామర్థ్యమున్న ఫ్రిజ్‌లను వాడాలి. ప్రెషర్ ఆన్ అవుతున్నా, బాడీ అమితంగా వేడెక్కినా మెకానిక్‌తో చెక్ చేయించుకోవాలి.
గీజర్లుఉపయోగించినప్పుడు..
అక్కర్లేని సమయాల్లో స్విచ్ఛాఫ్ చేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే గీజర్లను ఆన్ చేయండి. థర్మోస్టాట్ సెటింగ్‌ను 35 నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉంచాలి. గీజరు స్విచ్‌ను బాత్రూంలో ఏర్పాటు చేసుకోండి. తద్వారా వెంటనే ఆఫ్ చేయడానికి వీలుంటుంది. అపార్టుమెంట్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, కమ్యూనిటీ క్లబ్‌లు, క్యాంటిన్లలో గీజర్లు విధిగా వాడాలి.
పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో..
అంతగా అత్యవసరం కాని లోడ్‌ను, పీక్ లోడ్ సమయం నుంచి (సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది) మిగిలిన సమయానికి మార్చాలి. దీనివల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ బిల్లు ఆదా చేసుకోవచ్చు. పవర్ ఫేక్టర్ వీలైనంతవరకు 0.99 పైబడి మెయింటెన్ చేయాలి. నాన్ లీనియర్ లోడ్, అధికంగా ఉన్న పరిశ్రమల్లో హార్మోనిక్ ఫిల్టర్లు వాడాలి. బ్లోయర్లు, పంప్‌సెట్లు, ఎయిర్ కంప్రెషర్లు తదితర సాధనాలలో వేరియబుల్ స్పీడ్ డ్రైవ్స్, ‘వి’ బెల్టులకు బదులు ప్లాట్ బెల్ట్స్, స్టార్–డెల్టా–స్టార్ స్టార్టర్లను, తక్కువ రాపిడి బేరింగులు మొదలైనవి వాడి విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. లోడుకు అనుగుణంగా కేబుల్ పరిమాణం, పరికరాల సామర్థ్యం, అధిక విద్యుత్ ఆదా గల మోటార్ల వినియోగం, పంప్‌సెట్ల వాడకం, ఆటోమెషన్ తదితర అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యర్థ పదార్థాలను తగ్గింపు, పునర్వినియోగంలో శ్రద్ధ వహించాలి. స్టార్ సామర్థ్యమున్న ట్రాన్స్‌ఫార్మర్లు ఎంపిక చేసుకోవడం, మూడు ఫేజ్‌లలోనూ సమానంగా లోడును సర్దుబాటు చేసుకోవడం ద్వారా సరఫరాలో మరింత నాణ్యత పొందవచ్చు. పరికరాల మన్నిక వృద్ధి చెందుతుంది.
ఏసీ ఫిల్టర్‌ను శుభ్రపర్చుకోవాలి..
ఏసీ ఆన్‌లో ఉండగా తలుపులు, కిటికీలను మూసి ఉంచండి. కిటికీలకు సన్‌ఫిల్మ్, కర్టెన్లను వాడండి. ఇంటి టెర్రస్‌పై కూల్ హోమ్ పెయింట్ వేయడం, రూఫ్ గార్డెన్‌ను పెంచడం ద్వారా ఏసీపై లోడ్ తగ్గించవచ్చు. ఏసీకి దగ్గరలో టీవీ, లైట్లు వంటివి ఉంచకూడదు. ఏసీ యూనిట్‌పై చెట్ల నీడ పడేలా చూసుకోండి. స్టార్ సామర్థ్యమున్న ఎయిర్ కండిషనర్స్‌ను వాడండి.
లైట్లు, ఫ్యాన్‌లు వేసే వేళ..
వీలైనంత వరకు సహజమైన వెలుతురు, గాలి వచ్చేలా చూసుకోవాలి. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్‌లను ఆపివేయాలి. ఫిల్‌మెంట్ బల్బులకు బదులుగా ఎనిమిది రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేసే, అంతే వెలుగునిచ్చే ఎల్‌ఈడీ బల్బులను వాడాలి. ట్యూబ్‌లైట్లకు ఎలక్ట్రానిక్ చోక్ అమర్చుకోవచ్చు. కొత్తవి కొనేటప్పుడు విద్యుత్ ఆదా చేసే ట్యూబ్‌లైట్లు తీసుకోవచ్చు. నెలకోసారి బల్బులను శుభ్రపరచుకోవాలి. ఫ్యాన్‌లకు ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్‌లను అమర్చుకోండి. బల్బులు, ట్యూబ్‌లైట్లకు దుమ్ము చేరకుండా శుభ్రం చేసుకోవాలి.
వంటగదిలో వినియోగించే వస్తువులు..
మిక్సీలో వేసే పదార్థాలను ముందుగా నానబెట్టడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. పొడి పదార్థాలను సాధ్యమైనంత మేరకు గ్రైండింగ్ చేయకపోవడమే ఉత్తమం. ఇండక్షన్ స్టౌలకు బదులు మైక్రోవేవ్ ఓవెన్‌లు వాడితే 50 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అడుగుభాగాన సమతలంగా ఉన్న స్టవ్‌లను వాడడం ద్వారా వేడి బాగా వ్యాపించి విద్యుత్ ఆదా అవుతుంది.
సోలార్ వాటర్ హీటర్లు వాడాలి..
సాధ్యమైనంతవరకు సోలార్ వాటర్ హీటర్లనే వాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పీక్ లోడ్ సమయాల్లో వాడవద్దు.
Comments
Please login to add a commentAdd a comment