సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు(అందరికీ వర్తింపజేస్తే) ఏటా రూ.3,431.03 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు అందిస్తున్న సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలను కొనసాగిస్తూ అదనంగా ఈ మేరకు నిధులివ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.
► రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి డిస్కంలు సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక 2023–24లోని ఫారం–12 ప్రకారం రాష్ట్రంలో మొత్తం గృహ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లు 1.20 కోట్లు కాగా, అందులో 1.05 కోట్ల కనెక్షన్లు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నాయి. అంటే రాష్ట్రంలోని 87.9 శాతం గృహాలు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుతున్నాయి.
► ఇందులో అన్ని గృహాలూ నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించవు. కొన్ని గృహాలు 0–50 యూనిట్లలోపు, మరికొన్ని 51–100 యూనిట్లలోపు, ఇంకొన్ని గృహాలు 101–200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుతున్నాయి. డిస్కంల లెక్కల ప్రకారం.. ఈ మూడు శ్లాబుల్లోని గృహాలకు 2023–24లో మొత్తం 9,021.95 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది.
► గృహ వినియోగదారులకు జారీ చేసే విద్యుత్ బిల్లుల్లో వాడిన విద్యుత్ మేరకు ఎనర్జీ చార్జీలతో పాటుగా మినిమమ్ చార్జీలు, ఫిక్స్‌డ్ చార్జీలు, కస్టమర్ చార్జీలను విధిస్తారు. ఈ నాలుగు రకాల చార్జీలు కలిపి 1.05 కోట్ల గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.3,431.03 కోట్ల విద్యుత్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుంది.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా, కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు, కొన్ని వర్గాల గృహాలకు సబ్సిడీ విద్యుత్ సరఫరా కోసం.. ఏటా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రూ.11 వేల కోట్లకు పైగా నిధులను సబ్సిడీగా అందజేస్తోంది. గృహజ్యోతి పథకం అమలుతో విద్యుత్ సబ్సిడీల భారం రూ.15 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment