సాక్షి, సిటీబ్యూరో: భానుడి ప్రతాపం అప్పుడే మొదలైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు విద్యుత్ శాఖకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సాధారణంగా శివరాత్రి తర్వాత ఎండల తాకిడి పెరుగుతుంది. ఈసారి మాత్రం ముందుగానే ఎండలు మండుతుండటంతో గ్రేటర్‌లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. . ఉదయం 10 గంటల తర్వాత సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం పూట బయటికి రావాలంటేనే నగరవాసులు కాస్త ఆలోచిస్తున్నారు. శనివారం గరిష్ఠంగా 35.4 సెల్సియస్ డిగ్రీలు, కనిష్ఠంగా 16.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భగ్గున మండుతున్న ఎండలకు ఉక్కపోత తోడవడంతో ఉపశమనం కోసం సిటీజన్లు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు.
57 ఎంయూలకుపైగా..
► వాతావరణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ మార్పులను శరీరం తట్టుకోలేక పోతోంది. నిజానికి చలి కారణంగా నిన్న మొన్నటి వరకు ఫ్యాన్లు పెద్దగా వాడలేదు. ప్రస్తుతం ఉక్కపోత ప్రారంభం కావడంతో ఏకంగా ఏసీలను ఆన్ చేస్తున్నారు. కేవలం గృహ విద్యుత్ మాత్రమే కాకుండా వాణిజ్య వినియోగం భారీగా నమోదవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేస్తుండటమే ఇందుకు కారణం.
► ఫిబ్రవరి మొదటి వారంలో నగరంలో రోజు సగటు విద్యుత్ డిమాండ్ 52 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 57 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. రెండో శనివారం విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. వర్కింగ్ డేస్‌తో పోలిస్తే.. సెలవు దినాల్లో వినియోగం కొంత తగ్గాల్సి ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి చివరి నాటికి 75 నుంచి 80 ఎంయూలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేసింది.
హీటెక్కుతున్న డీటీఆర్‌లు
ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగడంతో సబ్‌స్టేషన్లలోని ఫీడర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆయిల్ లీకేజీలను సరి చేయకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఒత్తిడి తట్టుకోలేక పేలిపోతున్నాయి. తాజాగా శనివారం పాతబస్తీ దారుíÙఫాలోని ఓ డీటీఆర్ నుంచి మంటలు వ్యాపించి భారీ శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. వేసవి ప్రారంభానికి ముందే లైన్ల పునరుద్ధరణ, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ, ఎర్తింగ్ ఏర్పాటు, లూజు లైన్లను సరి చేయడం వంటి పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. అధికారులు ఇప్పటి వరకు వాటిపై దృష్టిపెట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
చదవండి: ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..!
Comments
Please login to add a commentAdd a comment