ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి.
బోయిన్‌పల్లి (కరీంనగర్) : ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా బీటెక్ పరీక్షలు సరిగ్గా రాయలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి మండలం విలాసాగర్‌లో గురువారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన కొప్పుల శ్రీలేఖ(21) హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్స్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. నాలుగు రోజుల క్రితమే పరీక్షలు ముగించుకొని ఇంటికి వెళ్లిన శ్రీలేఖ పరీక్షలు సరిగ్గా రాయలేదని అన్యమనస్కంగా ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.