ప్రమాదానికి కారణమైన సంప్ , పాఠశాల వద్ద యాజమాన్యానికి వ్యతిరేకంగా బంధువులు, స్థానికుల నిరసన
హైదరాబాద్: అప్పటివరకు అక్కతో ఆడుకున్నాడు.. స్కూల్‌లో బాలల దినోత్సవం కావడంతో అమ్మ అందంగా ముస్తాబు చేసింది.. నాన్న తీసుకెళ్లి పాఠశాల వద్ద వదిలివెళ్లాడు. ఆ తర్వాత ఏంజరిగిందో ఏమో.. చివరికి స్కూల్ ఆవరణలోని సంప్‌లో ఆ చిన్నారి శవమై తేలాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరితరం కావడంలేదు. ఈ హృదయవిదారక ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.
పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆర్‌కేనగర్ వీణా అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న అనిల్ కుమార్ వ్యాపారి. అతనికి భార్య విశాల, ఎనిమిదేళ్ల కూతురు అనన్య, రెండున్నరేళ్ల కుమారుడు శివ్‌రచిత్ ఉన్నారు. అనన్య స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. శివ్‌రచిత్‌ను విష్ణుపురి కాలనీలోని బచ్‌పన్ ప్లేస్కూల్‌లో నర్సరీలో చేర్పించారు. రోజూలాగే మంగళవారం ఉదయం అనిల్.. శివ్‌రచిత్‌ను పాఠశాల వద్ద స్కూల్ యాజమాన్యానికి అప్పగించి వ్యాపా రం నిమిత్తం వెళ్లాడు. బాలల దినోత్సవం కావడంతో 11.30కే తీసుకెళ్లాలని చెప్పడంతో అనిల్ భార్యకు సమాచారం అందించాడు.
సంప్‌లో పడిఉన్న చిన్నారి..
ఉదయం 11.20 సమయంలో పాఠశాలకు వచ్చిన విశాలకు అబ్బాయి స్కూల్‌కు రాలేదని యాజమాన్యం చెప్పడంతో భర్తకు ఫోన్ చేసింది. తానే రచిత్‌ను స్కూల్ వద్ద వదిలిపెట్టానని అనిల్ చెప్పాడు. అనిల్ తన స్నేహితులకు సమాచారం అందించాడు. విశాల, అనిల్ స్నేహితులు స్కూల్ యాజమా న్యాన్ని నిలదీసింది. అదే సమయంలో ఏడుస్తూ వచ్చిన ఆయా సంప్ వద్దకు తీసుకెళ్లి చూపించగా.. అందులో పడివున్న రచిత్‌ను గమనించారు. హుటాహుటిన తార్నాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తూ యాజమాన్యం దిష్టిబొమ్మ దహనం చేశారు.
తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు
తన కొడుకు మృతి చెందడానికి స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 304ఏ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్ జానకిరెడ్డి చెప్పారు. కాగా, స్కూల్ డైరెక్టర్ రాఘవేంద్రరావు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు సంప్‌లో పడి విద్యార్థి మృతి చెందడంతో బుధవారం మల్కాజిగిరి పరిధిలోని అన్ని పాఠశాలల బంద్‌కు టీఎన్‌ఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, టీఆర్‌ఎస్వీ, ఏఐఎస్‌ఎఫ్ పిలుపునిచ్చాయి. యాజమా న్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా?
సోమవారం మంచినీరు రావడంతో మంచినీటి సంపు మూత తెరచి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, యాజమాన్యం నిర్లక్ష్యమే రచిత్‌ను బలిగొన్నదని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్ ఉన్న ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. సంప్ నిండిందా లేదా అని చూసిన వాచ్‌మెన్.. దాని మూత పూర్తిగా మూయలేదని, దానిమీద కాలు వేయడం వల్లే చిన్నారి సంప్‌లో పడిఉండొచ్చని భావి స్తున్నారు. యాజమాన్యం వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారిం చామని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలి పారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు పాఠశాల మూసివేయడానికి గల అవకాశాలపై నివేదిక అందజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment