నిర్మల్/కడెం: ఆ చిన్నారి వయస్సు 11 నెలలు... ఆకలికి తట్టుకోలేకపోయింది. అప్పుల బాధతో తండ్రితో పాటు తల్లి కూడా పురుగుల మందు తాగి ఆస్పత్రిలో ఉందన్న జ్ఞానం ఆమెకు లేదు. ఆకలికి తాళలేక తల్లిపాలు తాగగా.. అవికాస్తా విషపూరితమై చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటనలో రైతు కుటుంబంలో భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. హృదయ విదారకమైన ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేటలో శనివారం జరిగింది.
ధర్మాజీపేటకు చెందిన కసునూరి భీమేశ్(36) తండ్రి పదేళ్ల క్రితమే మరణించాడు. అతడికి నలుగురు అక్కాచెల్లెళ్లు. ఎకరం సాగు భూమి ఉండగా, సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉండగా.. ఓ కుమారుడు కాల్వలో పడి చనిపోయాడు. భార్యకు విడాకులిచ్చిన భీమేశ్ రెండేళ్ల క్రితమే శైలజ(31)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి 11 నెలల కూతురు మహేశ్వరి ఉంది. అయితే, కుటుంబ అవసరాల కోసం రూ. 3 లక్షల వరకు అప్పులు అయ్యాయి.
అప్పు తీరకపోగా.. వడ్డీ పెరుగుతుండటంతో రుణభారం రోజురోజుకూ పెరుగుతోంది. మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మంది తాగారు. స్థానికులు నిర్మల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ భీమేశ్ చనిపోయాడు. ఆస్పత్రిలో ఉన్న శైలజ పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఇవేవీ తెలియని చిన్నారి మహేశ్వరి తల్లిపాలను తాగింది. అప్పటికే తల్లిపాలు విషపూరితం కాగా, చిన్నారి అస్వస్థతకు గురైంది. నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. చిన్నారి చనిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment