మధుయాష్కీకి మతిస్థిమితం తప్పింది
పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ మతిస్థిమితం కోల్పోయి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎంపీ కవితలపై విమర్శలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. యాష్కీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలసి గురువారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని కవిత అభివృద్ధి చేస్తున్నారని, ఏడు నియోజకవర్గాల్లో రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కవితదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ టీఆర్‌ఎస్‌ను కవిత బలోపేతం చేస్తున్నారని.. పార్టీ బలపడితే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్న అక్కసుతోనే యాష్కీ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
మహిళ అనే కనీస గౌరవం లేకుండా సోకుల కోసమే కవిత విదేశాలకు వెళుతున్నారని యాష్కీ అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుమన్ హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై యాష్కీ చేసిన మనీ లాండరింగ్ ఆరోపణలు అర్థరహితమని, ఆ విద్యలు కాంగ్రెస్ నేతలకే తెలుసన్నారు. ప్రధాని మోదీని రాహుల్ కలిస్తే లేని తప్పు.. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కలిస్తే తప్పా అని నిలదీశారు. తాము ఏం చేసినా బాజాప్తా చేస్తామని, ఉస్మానియా వర్సిటీపై కాంగ్రెస్ నేతలకు ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. మధు యాష్కీ పవర్ పోయి పరేషాన్ లో మాట్లాడుతున్నారని, ఎంపీ నిధులను ఖర్చు చేయకుండా వాపస్ పంపిన ఘనత యాష్కీదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు.