కేసీఆర్ మనసులో ఏముందో.. | Banda narendar reddy MLC chance to KCR promises is guaranteed | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మనసులో ఏముందో..

Published Sat, Jul 19 2014 12:29 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

కేసీఆర్ మనసులో ఏముందో.. - Sakshi

కేసీఆర్ మనసులో ఏముందో..

అంతుబట్టని  అంతరంగం
* పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు
* మరో రెండు నెలలు నిరీక్షణే అంటున్న గులాబీ నేతలు
* బండాకు ఏ పదవి ఇస్తారో... క్యూలో మరికొందరు సీనియర్లు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: కేసీఆర్ అంతరంగం అంతుబట్టక గులాబీ నేతలు అయోమయానికి గురవుతున్నారు. పద్నాలుగేళ్ల పోరాటం తర్వాత టీఆర్‌ఎస్  అధికారంలోకి వచ్చింది. మొదటినుంచీ పార్టీనే నమ్ముకుని పనిచేసిన వారంతా ఏదో ఒక పదవిపై ఆశ పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కని వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని బుజ్జగించారు. జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్  ఎలిమినేటి కృష్ణారెడ్డి ఇలా హామీలు పొందిన వారిలో ఉన్నారన్నది పార్టీవర్గాల సమాచారం. కాగా, సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆయా కోటాల్లో రాష్ట్రంలో  ఇద్దరికి అవకాశం ఇచ్చారు. తాజాగా మరో ఇద్దరి పేర్లు ఖరారు చేశారు.

మునుగోడు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన కర్నె ప్రభాకర్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని  కేబినెట్ సమావేశం అనంతరం సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఖాళీలు ఏమీ లేకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్సీ పదవులనే ఆశజూపడం వంటి కారణాల నేపథ్యంలో జిల్లాలో మరోనేతకు ఈ అవకాశం వస్తుందా..?  లేదా? అన్న అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నల్లగొండ అసెంబ్లీ టికెట్ ఆశించిన జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డిని తొలుత లోక్‌సభ నియోజకవర్గం  నుంచి బరిలో దింపాలని భావించారు.

ఈ మేరకు హామీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మారిన సమీకరణాల నేపథ్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనూహ్యంగా తెరపైకి వచ్చి నల్లగొండ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. రాజేశ్వర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే సందర్భంలో ఆ వేదికపై బహిరంగంగానే బండా నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తదనంతర పరిణామాల తర్వాత రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇక, బండా నరేందర్‌రెడ్డి శాసనమండలిలో అడుగుపెట్టడమే తరువాయి అనుకున్నారంతా. కానీ, తొలివిడతలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి (జిల్లావాసే)కి, ఆదిలాబాద్ జిల్లా గిరిజన నేత రాములనాయక్‌కు అవకాశం కల్పించారు. ఆ తర్వాత గవర్నర్ కోటాలో జిల్లాకు చెందిన కర్నె ప్రభాకర్‌ను, ఆంగ్లో ఇండియన్ ఒకరిని ఎంపిక చేశారు. దీంతో ఇక, బండా నరేందర్‌రెడ్డికి ఎలా అవకాశం దక్కుతుందన్న ప్రశ్న మొదలైంది.
 
నామినేటెడ్ పోస్టులపైనే ఆశ
జిల్లాకు చెందిన మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరారు. ఆ జాబితాతో  శాసనమండ లి డిప్యూటీ  చైర్మన్ నేతి విద్యాసాగర్ ఉన్నారు. ఆయన నేరుగా పార్టీ కండువా కప్పేసుకుని, పార్టీ సభ్యత్వం తీసుకోకున్నా, మొన్నటి శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లో ఇన్‌చార్జ్ చైర్మన్‌గా ఉండి కూడా చైర్మన్‌గా పోటీలో ఉన్న స్వామిగౌడ్‌కు ఓటు వేసి తానూ గులాబీ పక్షమేని చెప్పకనే చెప్పుకున్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయనకు తిరిగి మరోమారు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. ఇక, ఏ సమీకరణాల దృష్ట్యా చూసినా బండా నరేందర్‌రెడ్డికి కానీ, మరొకరికి కానీ, జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కడం దాదాపు అసాధ్యం.

ఈ కారణంగానే రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ పదవి దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ ముఖ్యులకు ప్రణాళికమండలి, ఆర్టీసీ వంటి ప్రధానమైనవి పోయినా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు ఎక్కువే ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏదో ఒకటి తప్పక వస్తుందన్న ఆశతో ఉన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం, బహుశా సెప్టెంబరు మాసంలో ప్రభుత్వ కార్పొరేషన్లను భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. అంటే కనీసం మరో రెండు నెలలు వేచిచూడక తప్పని పరిస్థితి. ‘ఇప్పటి వరకైతే సీఎం అందరికీ న్యాయం చేస్తూ వస్తున్నారు.

పద్నాలుగేళ్లుగా పార్టీని నమ్ముకుని, అప్పజెప్పిన బాధ్యతల్లా మోసిన సీనియర్లను ఎలా పక్కన పెడతారు..? కచ్చితంగా వారికి కూడా న్యాయం చేస్తారు. కాకుంటే కొంత సమయం వేచి చూడక తప్పదు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం కోసం పదవుల భర్తీ తప్పనిసరి. అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నా..’ అని టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. అంటే, జిల్లాకు ఎమ్మెల్సీ పదవులు అందివచ్చినా, రాకున్నా, నామినేటెడ్ పోస్టులు రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement