దత్తన్నకు దత్తత
జిల్లాలో మరో గ్రామానికి దత్తత యోగం పట్టింది. మత సామరస్యానికి ప్రతీక అయిన మండలంలోని అన్నారం షరీఫ్ దశ ఇక మారనుంది. సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన(ఎస్‌ఏజీవై)కింద కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఇన్‌చార్జి ఎంపీడీఓ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. జిల్లాలో ఇప్పటి కే ఐదు గ్రామాలను లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు దత్తత తీసుకున్నారు. దత్తత పొందిన ఆరో గ్రామం అన్నారం షరీఫ్.
- అన్నారం షరీఫ్‌కు మహర్దశ
- ఎస్‌ఏజీవై కింద దత్తత
- స్థానికుల హర్షాతిరేకాలు
అన్నారం షరీఫ్(పర్వతగిరి): జిల్లా కేంద్రానికి 42 కిలో మీటర్ల దూరంలో ఉన్న అన్నారం షరీఫ్‌లో దశాబ్దల క్రితం యాకూబ్ బాబా కొలువుదీరారు. పెద్ద సంఖ్యలో హిందువులూ బాబాను కొలుస్తారు. మొక్కులు తీర్చుకునేందుకు భారీగా కందూర్లు చేస్తారు. ఇక్కడి దర్గాల ఏటా వక్ఫ్‌బోర్డు టెండర్లు నిర్వహిస్తుంది. ఇలా సుమారు రూ. 80 లక్షల ఆదాయం సమకూరుతుంది.
సమస్యల జాతర
ఇంత ఆదాయం ఉన్నా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దర్గాలో భక్తుల వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ఇబ్బందిపడాల్సి వస్తోంది. తాగునీటి సమస్యలూ వెంటాడుతున్నాయి. దర్గా అభివృద్ధి కూడా ప్రధాన సమస్య. 2, 280 జనాభా ఉన్న ఈ గ్రామంలో ఓటర్ల సంఖ్య 1740.
పంచాయతీ ఇంటి బకాయిలు రూ.3 లక్షలు, నల్లా పన్నుల బకాయిలు రూ. 2 లక్షలు వరకు ఉన్నాయి. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న స్థానికుల అభీష్టం.. దత్తత ద్వారా త్వరలో నెరవేరనుంది. దత్తతపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా తెలుగు యువత అధ్యక్షడు మో టపోతుల మనోజ్‌గౌడ్ మాట్లాడుతూ, గ్రా మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దితే ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. సర్పంచ్ జడల పద్మ, మండల కో ఆప్షన్ సభ్యుడు షబ్బీర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లూనవత్ పంతులు, రామ్మూర్తి, మాజీ ఉప సర్పంచ్ బూర యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
చాలా సంతోషంగా ఉంది
అన్నారం షరీఫ్‌ను సంసద్ ఆదర్శ్ గ్రామంగా దత్తత తీసుకోవటం మా అదృష్టం. హిందూముస్లింల ఐక్యతకు నిదర్శనమైన గ్రామం మాది. తాగునీరు, డ్రెయినేజీ సమస్యలను దత్తత ద్వారా పరిష్కరిస్తే ప్రజలకు మేలు కలుగుతుంది. మా గ్రామాన్ని దత్తాత్రేయ దత్తత తీసుకోవటానికి కృషి చేసిన యుగాంతర్ సంస్థ డెరైక్టర్ ఎర్రబెల్లి మదన్‌మోహన్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
- జడల పద్మ, సర్పంచ్